కట్టంగూర్, మార్చి 11 : నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం గార్లబాయిగూడేనికి చెందిన రైతు కంచర్ల లింగారెడ్డి ఎండిపోతున్న పంటను చూసి ఆవేదన చెందుతున్నాడు. ‘నాకున్న 4 ఎకరాల్లో రూ.1.35లక్షలు పెట్టుబడి పెట్టి వరి సాగు చేస్తే.. నీళ్లు లేక, కరెంట్ సరిగ్గా రాక పంటంతా పొట్ట దశలోనే ఎండిపోయింది. రూ.10వేలు పెట్టి ట్యాంకర్ల ద్వారా నీళ్లు కొన్నా.. రెండు గుంటలు కూడా పారుతలేదు. పంటలు ఎండి అరిగోస పడుతున్నాం. రేవంత్రెడ్డి రైతులకు చేసిందేమీ లేదు. మళ్లీ కేసీఆర్ వస్తేనే రైతులకు బతుకు. లేకుంటే మట్టిపాలే’ అంటూ వాపోయాడు.
పలిమెల, మార్చి11: గత పదేళ్లలో నీటి కోసం గోస పడలే. ఇప్పుడు మళ్లీ నీళ్ల కరువు అచ్చింది. 600 ఫీట్లకు పైగా బోరు వేసినా ఫలితం లేకపోయిందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెలకు చెందిన రైతు బడిషా భాస్కర్ ఆవేదన వ్యక్తంచేశాడు. పక్కనే గోదావరి నది.. తలాపునే మేడిగడ్డ ప్రాజెక్టు.. అయినా నీళ్ల తిప్పలు తప్పుతలేవని వాపోయాడు. పలిమెలలో తనకున్న 4 ఎకరాల భూమిలో మిరపతోట వేసినట్టు తెలిపాడు. మేడిగడ్డ ప్రాజెక్టును ఎండబెట్టడంతో నీళ్ల కరువు వచ్చి బోరు అడుగంటి చేను ఎండిపోయిందని వాపోయాడు. కేసీఆర్ హయాంలో మేడిగడ్డ నిండుకుండలా ఉండేదని, సంతోషంగా ఎవుసం చేసుకునేటోళ్లమని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పేర్కొన్నాడు.
చౌటుప్పల్, మార్చి 11 : ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని, ఉత్తరభాగంలో రీ సర్వే చేయాలని ట్రిపుల్ ఆర్ బాధితులు మంగళవారం హైదరాబాద్లోని ఎన్హెచ్ఏఐ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్, వలిగొండ, రాయగిరితోపాటు గజ్వేల్ తదితర ప్రాంతాల బాధితులు పెద్దఎత్తున ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. ఇప్పటికే నేషనల్ హైవేలకు, విద్యుత్తు లైన్లకు, కాల్వలకు భూములు కోల్పోయామని ఆవేదన వ్యక్తంచేశారు.