హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): తాను ప్రధాని మోదీ స్కూల్, చంద్రబాబు కాలేజీలో చదువుకున్నానని, ఇప్పుడు రాహుల్‌గాంధీ వద్ద ఉద్యోగం చేస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం శిల్పాకళావేదికలో జరిగిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ జీవిత చరిత్ర ‘ప్రజల కథే.. నా ఆత్మకథ’ పుస్తాకావిష్కరణ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. నీతి ఆయోగ్ సమావేశం సందర్భంగా భోజన సమయంలో చంద్రబాబును చూ పిస్తూ ‘ఆప్ కే సాథీ ఇదర్ హై’ అని మోదీ అన్నారని, అప్పుడు తాను పైవిధంగా స్పందించినట్టు రేవంత్ గుర్తుచేసుకున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అందరితో నూ తనకు సన్నిహిత సంబంధాలు ఉండేవని, వాటిని దాచుకోవాలని ఎప్పుడూ అనుకోలేదని పేర్కొన్నారు. అందుకనే మంత్రివర్గ విస్తరణ ఉన్నా, అది అయిపోగానే దత్తాత్రేయ కోసం ఈ కార్యక్రమానికి హాజరైనట్టు చెప్పారు. జాతీయ రాజకీయాల్లో మాజీ ప్రధాని వాజపేయికి ఉన్న గౌరవం రాష్ట్రస్థాయిలో దత్తాత్రేయకు ఉందని పేర్కొన్నారు.
మనోహర్ షిండే వల్లే ఈ రోజు తానీ స్థాయిలో ఉన్నట్టు దత్తాత్రేయ తెలిపారు. వీ రామారావు తనను పాలిటిక్స్‌లోకి తీసుకొచ్చారని, ఇంద్రసేనారెడ్డి తన వెన్నంటే ఉన్నారని పేర్కొన్నారు. రాజకీయాలు వృత్తి, వ్యాపారం కాదని సమాజం కోసమే పనిచేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, ఏపీ, ఒడిశా, త్రిపుర గవర్నర్లు జస్టిస్ అబ్దుల్ నజీర్, కంభంపాటి హరిబాబు, ఇంద్రసేనారెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, విశ్రాంత సీజేఐ ఎన్వీరమణ, శాసన మండలి చైర్మన్ గుత్తాసుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు పొ న్నం ప్రభాకర్, బీజేపీ ఎంపీ లక్ష్మణ్, కాంగ్రెస్ నేతలు కే కేశవరావు, వీ హనుమంతరావు, ఇతర నేతలు పాల్గొన్నారు.
పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబును మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొగడ్తలతో ముంచెత్తారు. ‘మన ప్రియతమ నాయకుడు’ అంటూ ప్రసంగంలో చంద్రబాబును ఆకాశానికి ఎత్తారు. హైటెక్ సిటీ చూసినా, హైదరాబాద్ అన్న పదం వినబడినా చంద్రబాబే గుర్తొస్తారని పేర్కొన్నారు. అయితే ఈ సభలో రేవంత్‌రెడ్డి, చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తడంతో గురు, శిష్యుల బంధంపై మరోమారు చర్చ మొదలైంది.
కిషన్‌రెడ్డితో తనకున్న ప్రత్యేక అనుబం ధం గురించి అందరికీ తెలుసని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తామిద్దరం కలిస్తే తెలంగాణ అభివృద్ధి వేగంగా దూసుకెళ్తుందని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా కిషన్‌రెడ్డిని గౌరవిస్తానని, అప్పుడప్పుడు ప్రశ్నిస్తూనే తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు తాను ఎప్పుడు ముందుంటానని చెప్పారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్, బీజేపీ రహస్యబంధం బయటపడిందనే చర్చ మొదలైంది.
కిషన్‌రెడ్డిపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటుగా స్పందించారు. ‘రేవంత్‌రెడ్డీ.. మీరు ఎవరిని హెల్ప్ అడుగుతున్నారు. చెవులు ఉన్నాయి కానీ వినబడదు, నోరు ఉంది కానీ మాట్లాడరు. అలాంటి మహానుభావులను మీరు హెల్ప్ అడిగితే ఎక్కడ హెల్ప్ చేస్తారండి’ అంటూ కిషన్‌రెడ్డి టార్గెట్‌గా వ్యాఖ్యలు చేశారు.