హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): రేవంత్రెడ్డి సర్కారు రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి మరో రూ.1,400 కోట్ల అప్పు తీసుకున్నది. మంగళవారం నిర్వహించిన ఈ- వేలం ద్వారా ఈ మొత్తం సేకరించినట్టు ఆర్బీఐ వెల్లడించింది. 27 ఏండ్లకాల పరిమితితో 6.79 శాతం వార్షిక వడ్డీకి రూ.700 కోట్లు తీసుకున్నది. మరో రూ.700 కోట్లను 31 ఏండ్లకాల పరిమితితో 6.79 శాతం వార్షిక వడ్డీకి సేకరించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.14 వేల కోట్ల రుణ సమీకరణ కోసం ఆర్బీఐకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఈ నెలలో ఇప్పటివరకు మూడు దఫాల్లో రూ.4,400 కోట్ల రుణ సమీకరణ చేసింది. ఈ నెల 8న 1,000 కోట్లు, 15న రూ.2000 కోట్లు, 29న రూ.1,400 కోట్లు ఆర్బీఐ నుంచి తీసుకున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ రుణాల కింద రూ.64,539 కోట్లు సమీకరిస్తామని బడ్జెట్లో ప్రతిపాదించారు.