BRS Party | హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రజల ఎజెండాను పూర్తిగా అటకెక్కించి, కక్షపూరిత రాజకీయాలపైనే దృష్టిపెట్టింది. ప్రజాసమస్యలపై నిలదీస్తున్న బీఆర్ఎస్ లీడర్లు, మద్దతుదారుల గొంతు నొక్కేందుకు పోలీసు కేసులను అస్ర్తాలుగా మార్చుకున్నది. క్యాడర్‌ను బెదిరించి లీడర్‌ను దారిలోకి తెచ్చుకునే కుట్రలను అమలు చేస్తున్నది. గులాబీ జెండాను గుండెలకు హత్తుకొని బీఆర్ఎస్ వెంటే నడుస్తున్న కార్యకర్తలు, సర్కారు ఎంత వేధిస్తున్నా తట్టుకొని నిలబడుతూ ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు కక్ష సాధింపు చర్యలు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల వరకే పరిమితం కాలేదు. ఒకవేళ వాళ్లు దారికి రాకుంటే కుటుంబాలను సైతం వేదనకు గురిచేస్తూ అధికార పార్టీ రాక్షసానందం పొందుతున్నది. ఎవరిపైనా శత్రుత్వం లేదంటూనే ఏదో ఒక కారణం చూపి, సాక్ష్యాలు, ఆధారాలు లేకున్నా గులాబీదండును భయపెట్టి లొంగదీసుకునేందుకు రేవంత్‌రెడ్డి అండ్ కో ఆడుతున్న రాక్షస క్రీడ పరాకాష్టకు చేరిందనేందుకు ఈ ఉదంతమే సాక్ష్యంగా నిలిచింది.
అక్రమ కేసులు బనాయించి..
హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం రెడ్డిపురం గ్రామానికి చెందిన దుగ్గెంపూడి రంజిత్‌రెడ్డి, 2009 నుంచి వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ వెంట నడుస్తున్నాడు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన రంజిత్‌రెడ్డి, ఆ తర్వాత వరంగల్ పశ్చిమంలో గులాబీ జెండాను ఎగరేసేందుకు శాయశక్తులా కృషి చేశాడు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ వినయ్‌భాస్కర్ కార్యక్రమాలపై ప్రచారం చేస్తున్నాడు. ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నాయిని రాజేందర్‌రెడ్డి తన ప్రత్యర్థి వినయ్‌భాస్కర్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా రంజిత్‌రెడ్డిని టార్గెట్ చేసినట్టు తెలుస్తున్నది. రంజిత్‌ను పలు క్రిమినల్ కేసుల్లో ఇరికించేందుకు కుట్ర పన్నారు. కేయూ పోలీస్‌స్టేషన్‌కు పిలిచి వేధించడం, ఆ తర్వాత హనుమకొండ ఏసీపీ దగ్గరకు పిలిచి వార్నింగ్ ఇవ్వడం వంటి ప్రయత్నాలు చేశారు. ఇవి విఫలం కావడంతో రంజిత్ కుటుంబాన్ని కూడా ఇందులోకి లాగారు.
వివాదంలోకి ఉసిగొల్పి..
రెడ్డిపురంలోని రంజిత్‌రెడ్డి భూమి విషయంలో కోర్టులో కేసులు నడుస్తున్నాయి. దీన్ని ఆధారంగా చేసుకున్న ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి తన అనుచరుడు రజనీకర్రెడ్డిని వివాదంలోకి ఉసిగొల్పారు. వివాదంలో ఉన్న భూమిని కబ్జా చేయాలని ప్రోత్సహించారు. ఉల్టా రంజిత్రెడ్డిపైనే కేసులు పెట్టి మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. ఇదంతా రంజిత్‌రెడ్డిని బీఆర్ఎస్కు దూరం చేసే కుట్రలో భాగమేనని స్థానికంగా చర్చ నడుస్తున్నది. ఎన్ని వేధింపులకు గురిచేసినా రంజిత్‌రెడ్డి వెనక్కి తగ్గకుండా గుండెధైర్యంతో ముందుకు పోతున్నాడు. రంజిత్‌రెడ్డిని దారికి తెచ్చుకోవడం కోసం చివరికి ఆయన తల్లి టేకులమ్మ, అక్కపైనా కేసులు పెట్టి పోలీస్స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. రాజకీయ ఒత్తిళ్లతోనే కేసులు పెడుతున్నట్టు పోలీసువర్గాల్లోని కొందరు అధికారులు బాహాటంగానే చెప్తున్నారు.
చనిపోయిన వ్యక్తిపై కేసు!
రంజిత్‌రెడ్డిని వేధించే క్రమంలో పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తులపైనా కేసులు నమోదు చేసి ప్రభుత్వ పెద్దలపై తమ విధేయతను చాటుకుంటున్నారు. నిరుడు సెప్టెంబర్ 4న కేయూ పీఎస్‌లో నమోదైన ఎఫ్ఐఆరే ఇందుకు నిదర్శనంగా నిలిచింది. ఎఫ్ఐఆర్ (నంబర్ 440/2024 తేదీ:04-09-2024)లో మురికి అనంతలక్ష్మి అనే మహిళతో పాటు కొందరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంజిత్‌రెడ్డి, మర్రెడ్డి, టేకులమ్మ, ఆమె కూతురు వాణి, ఆదూరి చల్మారెడ్డి, వెంకట ఫణీంద్రయాదవ్పై పోలీసులు దాడి కేసు నమోదు చేశారు. ఇందులో ఆదూరి చల్మారెడ్డి కరోనా సమయంలోనే 2020, ఆగస్టు 30న చనిపోయాడు. చనిపోయిన వ్యక్తిపై నాలుగేళ్ల తర్వాత కేసులు పెట్టడం, కనీసం విచారణ కూడా చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా కేసులు నమోదు చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఎఫ్ఐఆర్లో దాడి జరిగిన తేదీ 2024, సెప్టెంబర్ 4గా పోలీసులు నమోదు చేయగా, 2024, మే 26న తనపై దాడి జరిగిందని ఫిర్యాదుదారు కంప్లయింట్లో పేర్కొన్నారు. అంటే ఫిర్యాదు అందకముందే కేసు నమోదైందని స్పష్టమవుతున్నది. ఎమ్మెల్యే ఏం చెప్తే అదే చేస్తున్నారని, ఈ వ్యవహారంపై విచారణ చేస్తామని ఓ పోలీస్ ఉన్నతాధికారి మహిళా కమిషన్ ముందు చెప్పారు.
సాక్షుల తారుమారు!
పోలీసులు రంజిత్‌రెడ్డిపై పెట్టిన మొదటి కేసులో కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలను సాక్షులుగా పేర్కొన్నారు. ఈ విషయం సదరు సాక్షులకు కూడా తెలియదు. తప్పుడు కేసులో తమను సాక్షులుగా చేర్చడమేమిటని పోలీసులను ప్రశ్నించారు. ఇదంతా బీఆర్ఎస్లో అలజడి సృష్టించేందుకు కాంగ్రెస్ నేతలు, పోలీసులు ఆడుతున్న నాటకమని గులాబీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ కార్యకర్తలు తప్పుడు సాక్ష్యం చెప్పేందుకు నిరాకరించారు. దీంతో రంజిత్‌రెడ్డిపై పెట్టిన రెండో కేసులో వారిని నిందితులుగా చేర్చారు. వివరాల్లోకి వెళ్తే ఎఫ్ఐఆర్ నం. 440/2024కు సంబంధించిన ఫిర్యాదులో వినోద్, నరేందర్, రాకేశ్యాదవ్లను సాక్షులుగా చూపించారు. మార్చి 18న మురికి కొండయ్య అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నం.157/2025, తేదీ.18.03. 25లో వినోద్ అనే వ్యక్తిని ఏ1గా, దుగ్గెంపూడి రంజిత్ అక్క, ఇతరులు అంటూ ఏ-2గా చూపించారు. ఇందులో వినోద్ గతంలో రంజిత్‌పై ఫిర్యాదు చేసిన మురికి అనంతలక్ష్మి ఫిర్యాదులో సాక్షిగా ఉన్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే సాక్షులు ముగ్గురు అసలు తమకు ఆ ఘటనతో సంబంధం లేదని, తాము లేకున్నా తమ పేర్లు పెట్టారని స్పష్టంచేశారు. రంజిత్‌రెడ్డితో కలిసి బీఆర్ఎస్లో ఉన్నారు కాబట్టి అందరినీ ఒకేసారి టార్గెట్ చేయొచ్చనే లక్ష్యంతో ఈ పనిచేశారని సాక్షులే చెప్తున్నారు.
డయల్ 100కు ఫోన్‌చేస్తే ఉల్టా కేసులు
ప్రస్తుతం వరంగల్ పశ్చిమం నుంచి నాయిని రాజేందర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన గతంలో వినయ్‌భాస్కర్ చేతిలో ఓడిపోయారు. ఆ ఓటమికి వినయ్‌భాస్కర్ అనుచరుడు రంజిత్‌రెడ్డి కూడా కారణమనే పగతోనే నాయిని ఇదంతా చేస్తున్నాడని నియోజకవర్గవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఎట్టిపరిస్థితుల్లోనూ రంజిత్‌రెడ్డిని చంపేస్తానని తన అనుచరుల వద్ద రాజేందర్‌రెడ్డి చెప్పాడని రంజిత్‌రెడ్డి ఆరోపిస్తున్నాడు. తనకు ప్రాణభయం ఉన్నదని, హైదరాబాద్‌కు వచ్చి ప్రశాంతంగా ఉంటే తన కుటుంబాన్ని టార్గెట్ చేశారని ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు. భూమి విషయంలో కోర్టులో కేసు నడుస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు వచ్చి ఆ స్థలంలో రాద్ధాంతం చేస్తుంటే మూడుసార్లు ఫిర్యాదు చేశామని, ప్రతిసారీ తమపైనే ఉల్టా కేసులు పెడుతున్నారని రంజిత్‌రెడ్డి తల్లి టేకులమ్మ, అక్క రత్నమేరీ కన్నీటిపర్యంతమవుతున్నారు. తమపై దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిని సీఐ రవికుమార్ కాపాడుతున్నారని తెలిపారు. తమ జాగ మీదకు దుండగులు వచ్చినప్పుడు డయల్ 100కు కాల్ చేసినా ఫలితంలేదని, రెండు సార్లు తాము ఫిర్యాదు చేస్తే తమకు న్యాయం చేయకుండా వాళ్ల ఫిర్యాదు మేరకు తమపైనే కేసులు పెట్టారని విలపిస్తున్నారు. మహిళ అని కూడా చూడకుండా తనపై రౌడీషీట్ ఓపెన్ చేస్తానంటూ సీఐ రవికుమార్ బెదిరించారని రత్నమేరీ వాపోయారు. ఈ మేరకు తాను మహిళా కమిషన్‌ను ఆశ్రయించానని తెలిపారు.
ఎన్కౌంటర్ చేస్తమని బెదిరించిండ్రు
నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేయడమే తప్పైందా? ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తగా కొనసాగడమే నేరమైందా? నన్ను, నా కుటుంబాన్ని టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయించిండ్రు. చనిపోయిన వారిపై కూడా కేసులు పెట్టి పైశాచికానందం పొందుతున్నరు. స్థానిక ఎమ్మెల్యే తన అధికార బలంతో పోలీసులను ప్రయోగించి పెట్టిన కేసులు, చేస్తున్న వేధింపులతో చాలా ఇబ్బంది పడుతున్నం. ఊరిలో ఉండలేక ఎటూ పోలేక, ఆత్మాభిమానం చంపుకోలేక నలిగిపోతున్నం. ఇన్నాళ్లూ స్వేచ్ఛగా తిరిగిన తెలంగాణలో మళ్లీ బానిసలుగా బతకాల్సిన పరిస్థితులు వచ్చినయి. ఒంటరి మహిళలైన నా తల్లి, అక్కమీద కూడా కేసులు పెట్టి, నా సొంత భూమి విషయంలో కోర్టులో కేసులు నడుస్తుండగానే రౌడీలకు వత్తాసు పలుకుతూ, కబ్జాలు, దాడులు చేయిస్తున్నరు. ఉల్టా మాపైనే పోలీసులు కేసులు పెడుతున్నరు. ఆడోళ్లపై రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని బెదిరిస్తున్న సీఐ రవికుమార్‌కు అసలు మహిళలంటేనే గౌరవం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డికి ఫస్ట్ టార్గెట్ నేనే. పోలీసులు చెప్తున్న మాట ఒక్కటే..నీకు ఎమ్మెల్యే గారితో పంచాయితీ ఏంది? నువ్వు ఊరు వదిలిపెట్టిపో. నీ ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికైనా కనిపించకుండా వెళ్లిపో. లేకపోతే నిన్ను ఎన్కౌంటర్ చేస్తం. అని బెదిరించిండ్రు.
– దుగ్గెంపూడి రంజిత్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం