హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి) : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల మీద రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీసీ హక్కుల ఉద్యమకారుడు, బీసీ కమిషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేస్తామంటున్న ఆర్డినెన్స్ న్యాయపరంగా నిలబడదని తేల్చిచెప్పారు. మొదట చట్టం, ఇప్పుడు ఆర్డినెన్స్ అని చెప్పడం మతిలేని పనిగా అభివర్ణించారు. ఇందులో బీసీలకు రిజర్వేషన్లు ఎగ్గొట్టాలనే రహస్య ఎజెండా ఉన్నదని విమర్శించారు. చట్టసభల్లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అంశాన్ని ప్రభుత్వం కోర్టుల్లోకి నెట్టి తప్పించుకోజూస్తున్నదని మండిపడ్డారు. కులగణన సర్వే, రాష్ట్రపతికి బిల్లులు, ఆర్డినెన్స్ ప్రకటన ఇలా ప్రతి దశలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా ఉన్నదని చెప్పారు. ఆర్డినెన్స్ ద్వారా పంచాయతీరాజ్ చట్టం-2018ని సవరిస్తామని చెప్పడం పచ్చి మోసమని, పీఆర్-18 యాక్ట్ సవరణ తర్వాతే ఆర్డినెన్స్ ద్వారా 42 శాతం బీసీ రిజర్వేషన్ కోటా అమలు చేయాల్సి ఉంటుందని వివరించారు. డెడికేషన్ కమిషన్‌లో నిపుణులైన సభ్యులు లేకుండా ఏకసభ్య కమిషన్ వేశామనడంలోనే కుట్ర దాగి ఉన్నదని ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టారు.
ఆర్డినెన్స్‌తో బీసీలకు న్యాయం జరుగుతదా?
న్యాయపరంగా నిలబడే దమ్ములేని ఆర్డినెన్స్ ఇది. అది తెస్తే బీసీ బిడ్డలు కోర్టుకు పోవడం గ్యారంటీ. కోర్టుకు పోతే ఈ ఆర్డినెన్స్ చెల్లుబాటు కాదు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రెండు బిల్లులను ఆర్టికల్ 31-సీ ప్రకారం రాజ్యాంగ పరిరక్షణ కోరుతూ రాష్ట్రపతి వద్దకు పంపిన ప్రభుత్వం, మళ్లీ అవే బిల్లుల అంశాన్ని తాత్కాలిక ఆర్డినెన్స్‌గా తేవడం నాన్సెన్స్. రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులు చట్టరూపం దాల్చకుండా విఘాతం కలిగించే ప్రమాదం ఉన్నది. జూలై 10న పొద్దున అసెంబ్లీని ప్రోరోగ్ చేసి.. సాయంత్రం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఆర్డినెన్స్ తేవాలని నిర్ణయించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. ఇది దొడ్డిదారి నిర్ణయం. ఆర్టికల్ 213 ప్రకారం అత్యవసర పరిస్థితుల్లో చట్టసభల సమావేశాలకు అవకాశం లేనప్పుడు గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకురావచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుకు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన మాట నిజమే. తీర్పు గౌరవించదగినదే. కానీ ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్యతను బట్టి, పరిస్థితులను బట్టి లార్జర్ బెంచ్‌ను ఆశ్రయించవచ్చు.. వాయిదా కోరవచ్చు. రాష్ట్రపతికి పంపిన బిల్లులు ఇంకా చట్టరూపం దాల్చలేదు. సమస్య తెగకుండా ఇప్పటికిప్పుడు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లను నిర్ధారించటం కష్టం. కాబట్టి కొంత సమయం కోసం గౌరవ హైకోర్టు ద్విసభ్య బెంచ్‌కు వివరించవచ్చు. కానీ రేవంత్ ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నమే చేయలేదు. లార్జర్ బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్లలేదు. ప్రభుత్వం ఎందుకు లార్జర్ బెంచ్ అప్పీల్‌కు పోలేదు? వాయిదా ఎందుకు కోరలేదు? రేవంత్‌రెడ్డి బీసీ ప్రజలకు సమాధానం చెప్పాలి.
మీరు బీసీ కమిషన్ చైర్మన్‌గా ఉన్నప్పుడే ప్రభుత్వం కులగణన ప్రణాళిక చేసింది.. ప్రభుత్వానికి మీరేమైనా సలహాలిచ్చారా?
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి 42 శాతం రిజర్వేషన్ల మీద కమిట్మెంట్ ఉంటే.. ఆ వర్గాల కోసమే పోరాటం చేస్తున్న మేము ఆయన వెంటే ఉండాలి కదా? కానీ బయటికి వచ్చి ఆయనను ఎందుకు ప్రశ్నించాల్సిన అవసరం వచ్చింది? మాకు సిద్ధాంతపరమైన, భావసారుప్యమైన వైరుధ్యమే తప్ప వేరే వ్యతిరేకత ఎందుకుంటుంది? 30 ఏండ్ల నుంచి చూస్తున్నారు.. మేం ఏనాడైనా సిద్ధాంత వైఖరికి భిన్నంగా ఉన్నామా? మా ఏజ్ గ్రూప్ నాయకుడు సీఎం అయ్యారని మేమంతా చాలా సంతోషపడ్డాం. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టిండు. ఎస్సీ డిక్లరేషన్ అన్నడు. ఎస్టీ డిక్లరేషన్ అంటే ఆయన సామాజిక స్పృహతో కొత్తతరం రాజకీయాలకు శ్రీకారం చుడతారని భావించాం. కానీ ఆ భ్రమలన్నీ పటాపంచలైనయి. ఆయనను చూశాక బీసీ కమిషన్ చైర్మన్‌గా నన్ను కనీసం రెన్యూవల్ చేయండి అని కూడా అడగలేదు.
అడగాలనిపించలేదు. ఆయన చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి. పదవిలో ఉండి పెదవులు మూసుకొని నా జాతికి అన్యాయం చేసేకంటే జాతి పక్షాన నిలబడాలని అనుకున్న. నిరుడు ఫిబ్రవరి 4న అసెంబ్లీ ఆమోదించిన కులగణన సర్వేను రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుందని పేర్కొంటూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అదే ఏడాది మార్చి 15న 26 జీవో ఇచ్చింది. సరిగ్గా ఆరు నెలలు తిరక్క ముందే మాట మార్చుతూ ప్రణాళిక విభాగం సర్వే చేస్తుందని జీవో 18 జారీ చేసింది. ఇక్కడో విషయం చెప్పాలి. జీవో 18 విడుదలకు ముందు ప్రభుత్వం భారీ కసరత్తే చేసింది. తెలంగాణ కంటే ముందు బీహార్‌లో ఇదే తరహా ప్రయోగం జరిగింది. సాధారణ పరిపాలన శాఖకు కులగణన సర్వే బాధ్యతలు అప్పగిస్తూ బీహార్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కులగణన పూర్తి చేసింది. కానీ ఈ కులగణనను పాట్నా హైకోర్టు కొట్టేసింది. విషాదం ఏమిటంటే బీహార్ అధికారులను మన ముఖ్యమంత్రి, మంత్రులు పిలిపించి మాట్లాడారు. ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులిచ్చింది? హైకోర్టు ఎందుకు కొట్టివేసింది? తదితర అనుమానాలను బీహార్ అధికారులతో చర్చించారు. ప్రణాళిక శాఖ ద్వారా సర్వే చేయించడం న్యాయ ప్రమాణాలకు విరుద్ధం, ఇలాంటి ప్రయోగాలు కోర్టుల్లో నిలబడవని ముఖ్యమంత్రి సహా మంత్రులంతా తెలుసుకున్న తర్వాత కూడా తిరిగి అదే బీహార్ ప్రభుత్వం తరహాలో ప్రణాళిక శాఖ ద్వారా సర్వే చేయించారు. ఇప్పుడు చెప్పండి. 42 శాతం బీసీ రిజర్వేషన్ల వెనుక ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టా? లేనట్టా?
తమిళనాడులో 50 శాతం మించి రిజర్వేషన్లు ఉన్నాయి కదా?
నిజమే.. తమిళనాడులో 50 శాతం మించి రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. తమిళనాడు చరిత్రలోకి తొంగి చూస్తే 1921 నుంచే అక్కడ బీసీ రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఏర్పడ్డ తర్వాత క్రమంగా రిజర్వేషన్లు పెంచుతూ వచ్చాయి. తమిళనాడులో కూడా 69 శాతం రిజర్వేషన్లను సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో నిలిపివేసింది. తర్వాత 1982లో అంబాశంకర్ కమిషన్ వేసింది. ఈ కమిషన్‌లో 21 మంది నిపుణులైన సభ్యులను తీసుకున్నారు. గణాంకాలు, సామాజిక, రాజకీయ, విద్య, ఆర్థిక స్థితిగతులు, కులాల కట్టుబాట్లు, అవలంబిస్తున్న మతాలు, ఆచారాలు, వృత్తులు, కట్టుబాట్లు, వ్యవహారాలపై అధ్యయనం చేయడానికి సుమారు 25 కమిటీలు వేశారు. ఇంటింటికీ సర్వే చేసి 5 కోట్ల జనాభా వివరాలను సమగ్రంగా, శాస్త్రీయంగా సేకరించారు. ఈ సర్వే ఫలితాలు సమగ్రమైనవా? కావా? పైలెట్ ప్రాజెక్టు కింద రీ సర్వేలు చేశారు. రెండున్నరేండ్లు అధ్యయనం కొనసాగింది. సింపోజియాలు, వర్క్‌షాపులు, సమావేశాలు నిర్వహించి స్టడీ చేశారు. కమిషన్‌తో తమిళనాడులో సామాజిక విప్లవమే వచ్చింది. బీసీలు, ఎంబీసీల వర్గీకరణ జరిగింది అప్పుడే.
మొదటి నుంచీ మీకు ఏకసభ్య కమిషన్‌పై ఎందుకు వ్యతిరేకత?
ఏకసభ్య కమిషన్ సమర్థనీయం కాదు. ఏకసభ్య కమిషన్ వేశామనడంలోనే కుట్ర దాగి ఉన్నది. నిష్ణాతులు, నిపుణులైన సభ్యులను కమిషన్‌లో పెట్టకపోవడమే రిజర్వేషన్ల అమలును నీరుగార్చే ప్రయత్నం. నిరుడు నవంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఒక కమిషన్‌ను నియమిస్తూ ఉత్తుర్వులు ఇచ్చారు. కానీ ఏకసభ్య కమిషన్ వేశారు. దానికి రిటైర్డ్ ఐఏఎస్ బూసాని వెంకటేశ్వర్రావును నియమించారు. ఆయనకు కుర్చీ కూడా లేదు. నిధుల్లేవు.. విధుల్లేవు. ఒక్కడు ఏం చేయగలడు? రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర అధ్యయనం చేయాలి. రాజకీయ వెనుకబాటుతనం, విద్య, ఉద్యోగ సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనాన్ని నిర్ధారించాలి. తులనాత్మక అధ్యయనం జరగాలి. ఇదంతా ఒక్కడితో అవుతుందా? రేవంత్‌రెడ్డి తీసిన డాటాను డెడికేటెడ్ కమిషన్‌కు ఇస్తే అది పనికి రాదు.
ఎక్స్‌ఫర్ట్స్‌తో కలిసి డెడికేటెడ్ కమిషన్ ప్రతి లోకల్ బాడీకి వెళ్లి సమగ్రంగా అధ్యయనం చేసి, గణన చేయాలి. నిరూపణ చేయాలి. అప్పటికీ పలు జిల్లాలు తిరిగి వచ్చినట్టుగా నలుగురి దగ్గర వినతి పత్రాలు తీసుకున్నట్టు ఉన్నది తప్ప వర్తమాన స్థితులకు అనుగుణంగా అధ్యయనం చేసి, మేధస్సు ఉపయోగించి నివేదిక రూపొందించినట్టు లేదు. బూసాని గ్రామీణ స్థానిక సంస్థల మీద మాత్రమే నివేదిక ఇచ్చారు. మరి పట్టణ స్థానిక సంస్థల నివేదిక ఎక్కడ ఉన్నది? కమిషన్ నివేదికలో 10 శాతమా? 20 శాతమా? 50 శాతమా? ఎంతైనా సూచించనివ్వు. ముందుగా ఏదో ఒక నివేదిక ఉంటే దాని మీద ప్రభుత్వం రిజర్వేషన్లు ఎంతైనా పెంచుకోవచ్చు. మీ దగ్గర నివేదికే లేనప్పుడు దాన్ని ఆమోదించకుండా బిల్లులో మాత్రం గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పడమనేది రాజ్యాంగ ప్రక్రియలను అపహాస్యం చేయడమే.
రేవంత్‌రెడ్డి ఇది చరిత్రాత్మక నిర్ణయమంటున్నారు? మీరేమో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటున్నారు?
ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నట్టు మాట్లాడటం కాదు.. నిబద్ధత, చిత్తశుద్ధి లేదు అని స్పష్టంగా చెప్తున్నా. అదే ఉంటే మా ఈ పోరాటాలెందుకు? మేమెందుకు ముఖ్యమంత్రికి ఎదురు నిలబడి పోరాడుతాం? నేను ప్రతికల్లో చూస్తున్నా. సీఎం రేవంత్‌రెడ్డి 47 సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను కలిశారు. వారి పార్టీ అధిష్ఠాన నేతలను కలిశారు. కానీ ఒక్కసారైనా రాష్ట్రపతిని కలిసి బీసీ బిల్లు ఆమోదించాలని అడిగారా? ఒక్కసారైనా అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీకి వెళ్లి బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదానికి ఏనాడైనా ఒత్తిడి తెచ్చాడా? చెప్పండి. బీసీల పట్ల ఆయన నిబద్ధత, చిత్తశుద్ధి ఏపాటిదో మనకు అర్ధం కావటం లేదా? సీఎం గారు మాకు బేషజాలు లేవు, 42 శాతం రిజర్వేషన్లకు మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నం అంటున్నారు. నోటి మాటల ద్వారా చెప్పటమే కానీ చేతలేవి? చెప్పటమేమో ఆర్భాటం.. చేసేదేమో శూన్యంగా కనబడుతున్నది.
ఇది సరైన వైఖరా? ప్రజాపాలనకు ఉండాల్సిన లక్షణాలు ఇవా? ప్రభుత్వం వైఖరి మాటలకు చేతలకు మధ్య పొంతన లేకుండా ఉంటే ఎట్లా? మీకు చిత్తుశుద్ధి ఉంటే స్వతంత్ర కమిషన్ వేసి ఎందుకు కులగణన సర్వే చేయించలేదు? ఇంత గంభీరమై సమస్యను ఏమాత్రం అనుభవం లేని ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో ఎలా సర్వే చేయించారు. ఒక జస్టిస్ ఈశ్వరయ్యనో.. జస్టిస్ చంద్రకుమార్నో.. లేకుంటే ఒక వకుళాభవరణం కృష్ణమోహన్రావునో.. ఒక చిరంజీవునో వేయాల్సి ఉండే. ఇలాంటి వాళ్లకు ఒక కమిట్మెంట్, ఒక వ్యవహారం ఉంటుంది. ఈ అంశంలో అనుభవం లేని, అవగాహన లేని వ్యక్తి భూసాని వెంకటేశ్వర్లుతో ఏక సభ్య కమిషన్ ఎందుకు వేశారు? నిపుణులతో కూడిన కమిషన్‌ను ఎందుకు వేయలేదు. సబ్జెక్టు ఎక్స్ఫర్ట్స్ను కమిషన్ సభ్యులుగా పెట్టాలి కదా.. శాస్త్రీయ అంశాలను ఎవరు రాయాలి? ఎవరో ఏదో రాస్తే సంతకం పెట్టడానికే ఏకసభ్య కమిషన్ వేశారా? ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఒక స్వతంత్ర కమిషన్ వేసి కుల గణన సర్వే సమగ్రంగా చేయించవచ్చు కదా! అఖిలపక్షాన్ని రాష్ట్రపతి వద్దకు తీసుకు వెళ్లవచ్చు కదా?
కులగణన ప్రక్రియలో లోపాలు ఉన్నాయంటున్నారా?
ప్రతి ప్రక్రియలో ప్రతి దశలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ఉదాసీన వైఖరిని చాలా స్పష్టంగా వ్యక్తపరుస్తున్నది. స్వతంత్ర కమిషన్ వేయదు.. కమిషన్‌లో నిపుణులను పెట్టదు. గోపిశెట్టి నిరంజన్ చైర్మన్‌గా ముగ్గురు సభ్యులతో శాశ్వత బీసీ కమిషన్ తెలంగాణలో ఉన్న ది. విద్యా, ఉద్యోగ రంగాలకు సంబంధించిన రిజర్వేషన్ల పెంపుదలపై వారి నుంచి సలహా తీసుకోకపోవడం, శాశ్వత నివేదిక కోరకపోవడం అనేది అతిపెద్ద లోపం. ఉన్నటువంటి బీసీ కమిషన్‌ను గాలికి వదిలేసి, బూసాని వెంకటేశ్వర్రావుతోనే మళ్లో ఏకసభ్య కమిషన్ వేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 27న జీవో నెంబర్ 1 ఇచ్చారు. ఆయన నివేదిక ఇచ్చినట్టు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు 4 రాసుకున్నరు. కానీ అది ఎక్కడ ఉన్నదో? దాని టీఓఆర్( టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్) ఎమిటో ? మనకు ఈ రోజు వరకు అందుబాటులో లేదు.
ఇప్పటి వరకు బయటపెట్టలేదు. పారదర్శకత లేకపోవడానికి కారణం ఏమిటి? ఇవన్ని చూస్తున్నప్పుడు రిజర్వేషన్లను అమలు చేయకూడదనే కుట్ర దాగి ఉన్నదని అనుమానించడంలో తప్పేముంది?. అధికారిక వెబ్సైట్లో ఉత్తర్వులు ఉండాలి కదా? ఒక వ్యక్తినే రెండు సార్లు వేస్తావు. రెండు నివేదికలు తీసుకుంటావు. ఆమోదించినం అని కూడా చెప్తారు. ప్రభుత్వం ఒకసారి ఆమోదించింది అంటే అది అధికారికంగా ధృవీకరించిన నివేదిక. దీనిని పబ్లిక్ డొమైన్లో ప్రజలకు అందుబాటులో పెట్టాలి. కానీ ఇప్పటి ఎందుకు పెట్టలేదు? ప్రతి దశలో లోపాలు తప్ప ఏమీ లేవు.కామారెడ్డి డిక్లరేషన్‌ను ఆర్భాటంగా ప్రకటించి ఇప్పుడెందుకు ఇట్ల చేస్తున్నది?
రెండు అంశాలున్నాయి. 42 శాతం ఎట్లా ఎగ్గొట్టాలనే ఒక నిగూఢమైన రహస్య ఎజెండా ఉన్నది. రెండోది ఓటమి భయం. స్థానిక ఎన్నికల్లో ఓడిపోతామనే భయం. ఒక్క కాంగ్రెస్ పార్టీ మినహా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధంగా లేకనే ఇవన్ని కృత్రిమంగా సృష్టిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు సర్వేలు చేయించి తెప్పించుకుంటున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామనే భయం పట్టుకున్నది. అందుకే కృత్రిమ సమస్యలు సృష్టిస్తున్నది. బీసీల కోసం చాలా చేశాం కానీ.. ప్రతిపక్షాలు కోర్టులో అడ్డంపుల్లలు వేశాయని, కోర్టు కొట్టేసిందని దొడ్డిదారి సింపతి కోసం పాకులాడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. సానుభూతితో ఎన్నికల్లో గెలవాలనే రాజకీయ స్వార్థపూరిత ఆలోచన చేస్తున్నది. మేం ఎంత ప్రయత్నం చేసినా.. ఎక్కడో ఒక చోట ఇబ్బంది ఏర్పడుతున్నది. రాష్ట్రపతి బిల్లులు ఆమోదించలేదు.. ఇక్కడ హైకోర్టు కొట్టేసింది. మమ్ములను ఏం చేయమంటరు? బీసీలను ఉద్ధరిద్దామని మాకూ ఉన్నది కానీ ఇన్ని అడ్డంకులు ఉన్నయని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిలబెట్టే ప్రయత్నం ఎంత మాత్రం లేదు.
తెలంగాణలో ఎలా జరిగింది?
తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పుకొంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణనకు చట్టబద్ధత ఉన్నదా? సర్వేలో ఏమైనా శాస్త్రీయత ఉన్నదా? ఇదేం లేకుండా ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ మాత్రం తెలంగాణలో అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా కులగణన సర్వే చేశారని చెప్పుకోవడం ఆశ్చర్యం అనిపించింది. ప్లానింగ్ డిపార్ట్మెంట్కు సర్వేచేసే అధికారమే లేదు.
ప్రభుత్వం రహస్య ఎజెండాలను అమలు చేసేందుకే ఈ సర్వే ఉపయోగపడుతుంది తప్ప జాతికి ఉపయోగం లేదు. ఇలాంటి సర్వేలకు విశ్వసనీయత ఉండదని భావించే ఆర్టికల్ 340 ప్రకారం సామాజికంగా వెనుకబడిన వర్గాల స్థితిగతులను ఆధ్యయనం చేసేందుకు కమిషన్, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్-1952 కింద స్వతంత్ర కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. కులాల వివరాలు, జనాభా గణాంకాలు, స్థితిగతులు, జీవన విధానం, చారిత్రక అంశాలను అధ్యయనం చేయాలి. ఒక వేళ అధికారులతో కమిషన్ వేయాలనుకుంటే స్టాటిస్టికల్ డాటా కలెక్షన్ యాక్ట్-2008 ద్వారా ఏర్పాటు చేయాలి. ఇంత స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తామే సర్వే చేస్తామని నిరుడు మార్చి15న జీవో 26 జారీ చేసింది. ఆరు నెలల తర్వాత మాట మార్చింది.