చార్మినార్, డిసెంబర్ 13 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) రాష్ట్రంలోని వేలాది మంది క్రీడాకారులతో ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారు. కెరీర్‌ను పణంగా పెట్టి ఆటే శ్వాసగా సాధన చేస్తున్న యువ క్రీడాకారులను గాలికొదిలేసి, తన ‘ఆట’కోసం మాత్రం రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు క్రీడా యూనివర్సిటీ, క్రీడాకారులకు ప్రోత్సాహం, ఒలింపిక్స్, కామన్వెల్త్ గ్రేమ్ నిర్వహిస్తామంటూ ఊదరగొట్టి ఇప్పుడు ఆ ముచ్చటే మాట్లాడడం లేదు. తన సరదాలు తీర్చుకునేందుకు ప్రభుత్వ ఖజానా నుంచి కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారుగానీ, ఏండ్ల తరబడి నిరీక్షిస్తున్న నైపుణ్యాలు కలిగిన క్రీడాకారుల జీవితాలను పట్టించుకోవడమే మానేశారు.
క్రీడల మంత్రి, ఫుట్‌బాల్ ఆటగాడిని అని చెప్పుకుంటున్న సీఎం స్పోర్ట్స్ అథారిటీని గాలికొదిలేశారు. ఫుట్‌బాల్ ఆటగాడు మెస్సీని తీసుకొచ్చిన రేవంత్ క్రీడా శిక్షకుల జీతాలు, క్రీడాకారుల వసతి, క్రీడా పరికరాలపై కనీసం దృష్టి సారించలేదు. ఒక్కరోజు ఆటకు వెచ్చిస్తున్న రూ.100 కోట్లు అథారిటికీ మంజూరు చేస్తే మెరికల్లాంటి వేలాది క్రీడాకారులను తీర్చిదిద్దవచ్చని సీనియర్ క్రీడాకారులు, క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో కోచ్‌లకు నెలకు రూ.43 వేల వేతనం ఇవ్వగా, ఆటగాడైన సీఎం రేవంత్ దానిని సగానికి తగ్గించి రూ.26 వేలు ఇస్తున్నారు. అదైనా సక్రమంగా ఇస్తున్నాడా అంటే అదీ లేదని, మూడు నెలలుగా జీతాలు లేవని కోచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలకు కోత పెట్టిన సీఎం మిత్రులతో ఆడేందుకు మాత్రం వందల కోట్లు ఖర్చు చేయడం, క్రీడాపరికరాలు, క్రీడాకారుల గురించి పట్టించుకోకపోవడంపై కోచ్‌లు తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 48 క్రీడాసంఘాలు, 160 మంది కోచ్‌లు, నగర పరిధిలో 57 మంది కోచ్‌లు క్రీడాకారుల అభ్యున్నతికి యత్నిస్తుంటే ప్రభుత్వం మాత్రం వారి అవసరాలను కూడా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
ఆరు నెలల కిందట గచ్చిబౌలిలో రేవంత్ ఆడిన రెండు ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు రూ.100 కోట్లు ఖర్చు చేయడం, ఈ నెల 13న అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఆటగాడు మెస్సీతో ఉప్పల్ లో ఫుట్‌బాల్ ఆడేందుకు మరో వంద కోట్లు ఖర్చు చేసిన సీఎం రాష్ట్రక్రీడా రంగాన్ని మాత్రం గాలికొదిలేశారని విమర్శిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర క్రీడాకారులు పతకాలు సాధించేందుకు సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటానంటూ మాటలు చెప్పిన రేవంత్ వాటిని పక్కకు నెట్టి క్రీడారంగాన్ని నీరుగారుస్తున్నాడని కోచ్‌లు వాపోతున్నారు.
మాకు వచ్చే రూ.43 వేల జీతాన్ని ఆరు నెలల కిందట సగానికి తగ్గించారు. కొద్దిపాటి జీతాన్నీ సకాలంలో ఇవ్వకపోవడంతో కుటుంబాలు గడవడం ఇబ్బందిగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కోచ్‌లపై వివక్ష కొనసాగుతున్నది. సీఎం మెప్పు కోసం అథారిటీ అధికారులు కోట్లు ఖర్చు చేస్తున్నారు. మాకు వేతనంఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు.
– వాహెద్ అలీ, తైక్వాండో శిక్షకుడు