హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ అధికారులకు అద్దె ప్రాతిపదికన వాహనాలు నడుపుతున్న తమను కాంగ్రెస్ సర్కారు పీడిస్తున్నదని వాహనాల యజమానులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో రూ.240 కోట్లు బాకీ పడిందని వాపోతున్నారు. ఈ క్రమంలో అద్దె ప్రాతిపదికన తిరిగే అన్ని వాహనాల సేవలను సోమవారం నుంచే నిలిపివేశారు. దీంతో అధికారులు సొంత వా హనాల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 4వేల వాహనాలు అధికారుల కోసం అద్దె ప్రాతిపదికన నడుస్తున్నాయి. ఒక్కో వాహనానికి నెలకు సుమారు రూ.35వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇలా సచివాలయంలోనే 50 వాహనాలు ఉన్నాయి. జిల్లాల్లో తిరిగే వాహనాల యజమానులకు 18నెలలుగా, సచివాలయంలో తిరిగే వాహనాల యజమానులకు 8నెలలుగా బిల్లులు క్లియర్ చేయలేదని తెలిసింది. నెలల తరబడి పేరుకుపోయిన బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ వాహనాల యజమానులంతా సచివాలయంలో సమావేశమయ్యా రు. బిల్లులు క్లియర్ చేసేవరకు వాహనాలు నడిపే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. ఇందుకోసం డ్రైవర్లు, వాహన యజమానులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు చేపడుతామని డ్రైవర్స్ అసోసియేషన్ ప్రతినిధులు హెచ్చరించారు.
ఏ ప్రభుత్వమైనా సకాలంలో బిల్లులు చెల్లించింది. ఎప్పుడైనా ఒకనెల ఆలస్యమైనా మరోనెల ఠంచన్‌గా డబ్బులు జమ చేసేది. కానీ కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత ఏడాదిన్నరగా డబ్బులు ఇవ్వడంలేదు. నా 30 ఏండ్ల డ్రైవింగ్ కెరియర్లో ఇలా జరగడం ఇదే మొదటిసారి. పిల్లల చదువులకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. గతంలో మాకు రేట్లు పెంచుతామని క్యాబినెట్లో ప్రకటించారు. నెలకు రూ.43వేలు ఇస్తామని మాట ఇచ్చారు. అది కూడా అతీగతీ లేదు.
-నర్సింగ్‌యాదవ్, డైవర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్