హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర రాబడిని పెంచడంలో ఘోరంగా విఫలమైన రేవంత్రెడ్డి సర్కారు.. అందినకాడికి అప్పులు తెచ్చి తెలంగాణ ప్రజలపై మోయలేని భారం మోపుతున్నది. ఆదాయానికి, వ్యయానికి మధ్య పెరుగుతున్న అగాధాన్ని పూడ్చేందుకు పరిమితికి మించి భారీగా రుణాలు సమీకరిస్తున్నది. ఆ క్రమంలో తాజాగా మంగళవారం రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నిర్వహించిన బాండ్ల వేలంలో పాల్గొని మరో రూ.2,300 కోట్ల అప్పు తెచ్చింది. ఇందులో 17 ఏండ్ల కాలపరిమితితో 7.60% వార్షిక వడ్డీకి రూ.500 కోట్లు, 23 ఏండ్ల కాలపరిమితితో 7.59% వడ్డీకి రూ.800 కోట్లు, 28 ఏండ్ల కాలపరిమితితో 7.58% వడ్డీకి రూ.1,000 కోట్లు సమీకరించింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఇప్పటి వరకు ఒక్క రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచే రూ.68,300 కోట్ల అప్పు తెచ్చినట్టయింది. ఇది ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం రాష్ట్ర బడ్జెట్లో ప్రతిపాదించిన రూ.54,009 కోట్ల వార్షిక రుణ సమీకరణ లక్ష్యం కంటే 26% అధికం.
కాగ్ లెక్కల ప్రకారం.. ఈ ఏడాది నవంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అంచనాల్లో 30% ఆదాయాన్ని మాత్రమే సాధించింది. అప్పులు మాత్రం 107 శాతానికి చేరాయి. డిసెంబర్ 23 నాటికి ఈ అప్పులు 126 శాతానికి పెరిగాయి. ఆదాయం మాత్రం 50% కూడా దాటలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ.71,400 కోట్ల రుణాలు సమీకరించుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇందులో మంగళవారం నాటికే రూ.68,300 కోట్ల అప్పులు పుచ్చుకున్న రేవంత్రెడ్డి సర్కారు.. మిగతా రూ.3,100 కోట్ల రుణాలను సైతం జనవరి నెలాఖరులోపే సమీకరించే అవకాశాలున్నాయి. బడ్జెటేతర (నాన్-ఎఫ్ఆర్బీఎం) రుణాలను సైతం రేవంత్రెడ్డి సర్కారు అడ్డగోలుగా తెస్తున్నది. ఈ ఏడాది డిసెంబర్ 2 నాటికి ఈ రుణాలు దాదాపు రూ.2.4 లక్షల కోట్లకు పెరిగాయి. ఇందులో కంచె గచ్చిబౌలి భూములపై తీసుకున్న రూ.10,000 కోట్లు, వివిధ పట్టణ స్థానిక సంస్థల ద్వారా తీసుకున్న రూ.12,000 కోట్ల రుణాలతోపాటు దాదాపు రూ.5,000 కోట్ల హడో రుణాలు ఉన్నాయి.
