HCU | హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎలాంటి సమస్యలొచ్చినా ఆదుకుంటామని రాహుల్‌గాంధీ ఇచ్చిన వాగ్దానానికి వ్యతిరేకంగా రేవంత్‌రెడ్డి సర్కార్ వ్యవహరిస్తున్నదని హెచ్‌సీయూ జేఏసీ ఆరోపించింది. హెచ్‌సీయూ పరిధిలోని 400 ఎకరాల భూముల వేలాన్ని ఆపాలని సీఎం రేవంత్‌రెడ్డికి సూచించాలని కోరుతూ ఆదివారం రాహుల్‌గాంధీకి ‘సేవ్ హెచ్‌సీయూ ల్యాండ్స్’ పేరుతో జేఏసీ బహిరంగ లేఖ రాసింది. రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న సమయంలో హెచ్‌సీయూను సందర్శించి యూనివర్సిటీ పరిరక్షణకు కాంగ్రెస్ తరఫున పాటుపడతామని రాహు ల్ ఇచ్చిన మాటకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నదని లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలకు పూర్తి వ్యతిరేకంగా రాష్ట్రంలో పా లన సాగుతున్నదని ఆరోపించారు. విద్యార్థులు, హెచ్‌సీయూ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భూముల వేలాన్ని ఆపేలా నిర్ణయించాలని రాహుల్‌గాంధీని కోరారు.
వ్యతిరేకిస్తున్న ప్రముఖులు
హెచ్‌సీయూ భూములను వేలం వేస్తామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రముఖులు, మేధావులు, స్వచ్ఛంద సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇటీవల ప్రముఖ సినీ దర్శకుడు నాగ్ అశ్విన్, ప్రొఫెసర్ హరగోపాల్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఎండగట్టారు. సామాజిక మాధ్యమాల్లో యూనివర్సిటీ విద్యార్థులకు మద్దతుగా పెద్దఎత్తున నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఆదివారం డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు యూనివర్సిటీని సందర్శించి భూములను ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించడానికి వీల్లేదని స్పష్టంచేశారు.
తరుణ్‌భాస్కర్ అసహనం
రేవంత్ సర్కార్‌పై ప్రముఖ టాలీవుడు దర్శకుడు తరుణ్‌భాస్కర్ అసహనం వ్యక్తంచేశారు. హెచ్‌సీయూ భూములను అమ్మేస్తున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పోస్టు చేశారు. దాన్ని నెటిజన్లు ఎక్స్‌లో పోస్టు చేయడంతో చర్చనీయాంశమైంది. ‘తెలంగాణ ప్రభుత్వం హెచ్‌సీయూ భూములను వేలం వేసి రూ.10 వేల కోట్లు సమీకరించడంపై సైబరాబాద్వాసులు నిరసన వ్యక్తం చేస్తున్నారు’ అని అందులో రాసి ఉండటం గమనార్హం.