Revanth Reddy | హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణను రుణాల ఊబిలో దించుతున్న కాంగ్రెస్ సర్కారు.. తాజాగా మరో రూ.5 వేల కోట్ల రుణం తీసుకున్నది. రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) మంగళవారం నిర్వహించిన సెక్యూరిటీ బాండ్ల వేలంలో ఈ రుణాన్ని సమీకరించింది. ఇందులో 7.44% వార్షిక వడ్డీపై 22 ఏండ్ల కాలపరిమితితో రూ.1,500 కోట్లు, 23 ఏండ్ల కాలపరిమితితో రూ.1,000 కోట్లు, 24 ఏండ్ల కాలపరిమితితో రూ.1,000 కోట్లు, 26 ఏండ్ల కాలపరిమితితో రూ.1,500 కోట్లు తీసుకున్నది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం (2025-26)లో సగభాగం కూడా గడవక ముందే వార్షిక రుణ లక్ష్యంలో 87% అప్పులు తెచ్చినట్టయింది. దీనిపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్ నుంచి మొత్తం రూ.54,009 కోట్ల రుణాలు సమీకరిస్తామని రాష్ట్ర బడ్జెట్లో ప్రతిపాదించిన రేవంత్రెడ్డి సర్కారు.. తొలి రెండు త్రైమాసికాలు పూర్తికాకముందే ఆర్బీఐ నుంచి రూ.46,900 కోట్ల అప్పు తీసుకున్నది. దీంతో బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి (వచ్చే ఏడాది మార్చి 31 వరకు) రూ.7,109 వేల కోట్ల రుణాలను మాత్రమే సమీకరించాల్సి ఉన్నది.