Revanth Reddy | హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): రేవంత్రెడ్డి సర్కారు. ఈ వారం మరో రూ.3,500 కోట్లు అప్పు తీసుకున్నది. మంగళవారం నిర్వహించిన ఈ-వేలంలో రాష్ట్ర ఆర్థికశాఖ పాల్గొని అప్పు తీసుకున్నట్టు ఆర్బీఐ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కాంగ్రెస్ సర్కారు రూ.17,400 కోట్ల రుణ సమీకరణ చేసింది. రెండో త్రైమాసికం లో రూ.12,000 కోట్లు రుణం తీసుకుంటామని ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపించింది. అయితే, ఒక్క జూలైలోనే రూ.8.500 కోట్లు సేకరించింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు నెలలు కూడా గడవకముందే ఆర్బీఐ నుంచి రూ.25,900 కోట్లు అప్పు తెచ్చింది.
సర్కారు చేసిన అప్పు రూ.2.8 లక్షల కోట్లు
జూలై ఒకటో తేదీ నాటికే రూ.2,00,900 కోట్లు అప్పలుచేసిన ప్రభుత్వం.. ఈ నెలలో సుమారు మరో రూ.7,000 కోట్ల రుణ సమీకరణ చేసింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. రేవంత్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన 2023 డిసెంబర్ నుంచి మార్చి 2025 వరకు 1.66 లక్షల కోట్లు అప్పు తెచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జూలై ఒకటి వరకు ఎఫ్ఆర్బీఎం పరిధిలో రుణాలు రూ.18,900 కోట్లు తీసుకున్నది. ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాకుండా కార్పొరేషన్ల ద్వారా మరో రూ.16,000 కోట్ల రుణం తీసుకున్నది. ఈనెలలో మరో రూ.7,000 కోట్ల అప్పు సమీకరించింది. మొత్తం కలిపితే ఇప్పటివరకు కాంగ్రెస్ సర్కారు చేసిన అప్పు 2.7 లక్ష కోట్లుగా తేలింది.