Telangana | హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో రాష్ర్టానికి పెట్టుబడులు వెల్లువలా వచ్చాయని ప్రభుత్వం ఘనంగా ప్రచారం చేసుకుంటున్నది. రూ.1.78 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయని ప్రచారం చేసుకుంటున్నది. అయితే.. గతేడాది కాంగ్రెస్ పాలన అనుభవాల దృష్ట్యా ఈ ఒప్పందాలు అమలవడంపై నిపుణులు పెదవి విరుస్తున్నారు.
ఇందుకు నిరుడు దావోస్ పెట్టుబడులే ఉదాహరణ. నిరుడు జనవరిలో జరిగిన దావోస్ సదస్సుకు సీఎం రేవంత్ బృందం వెళ్లిన సంగతి తెలిసిందే. మొత్తం రూ.40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. కానీ, ఏడాది గడిచినా అందులో ఏ ఒక్కటీ అమలు కాలేదు, ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేదు. అంటే వాటిలో ఏ ఒక్క కంపెనీ కూడా ఇప్పటివరకు కార్యకలాపాలు ప్రారంభించలేదన్నమాట. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సైతం చెప్పుకోవడానికి భారీగానే ఉన్నాయని, కానీ ఎప్పుడు అమల్లోకి వస్తాయో ప్రభుత్వమే స్పష్టత ఇస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.
‘దావోస్‌లో జరిగే ఎంవోయూలన్నీ.. మీ రాష్ట్రంలో పెట్టుబడి పెడుతున్నామని చెప్పడానికి మాత్రమే. ఎంవోయూ చేసుకున్నంత మాత్రాన ఇస్తామని ఎక్కడా లేదు’ అని నిరుడు డిసెంబర్ 6న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. దీనిని బట్టి ఎంవోయూ చేసుకున్నంత మాత్రాన కంపెనీలు వచ్చినట్టు కాదన్నమాట. కంపెనీలతో తరచూ సంప్రదింపులు జరుపుతూ ఉంటేనే అవి కార్యరూపంలోకి వస్తాయని చెప్తున్నారు. అయితే.. గతేడాది దావోస్‌లో జరిగిన ఎంవోయూల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదని, ఉద్యోగాలు కల్పించలేకపోయిందని, ఇది ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనుమానాలు కలిగిస్తున్నదని పలువురు విమర్శిస్తున్నారు.
పైగా ఈ ఏడాది చెప్పుకొంటున్న కంపెనీల్లో స్కైరూట్ (రూ.500 కోట్లు), మేఘా ఇంజినీరింగ్ (రూ.15 వేల కోట్లు), కంట్రోల్ ఎస్ డాటా సెంటర్స్ (రూ.10 వేల కోట్లు) హైదరాబాద్‌కు చెందినవని, ఇక్కడ చేసుకోవాల్సిన ఒప్పందాలను గొప్పల కోసం దావోస్‌లో చేసుకున్నారని విమర్శిస్తున్నారు. జేఎస్‌డబ్ల్యూ వంటివి గతంలోనూ ఒప్పందాలు చేసుకున్నాయని, వాటినే మళ్లీ చేసుకున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది దావోస్ పెట్టుబడులు కార్యరూపం దాల్చడంపై అనుమానాలున్నాయని నెటిజన్లు చెప్తున్నారు.
గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రపంచ దిగ్గజ కంపెనీ ఫాక్స్‌కాన్ అప్పటి సీఎం కేసీఆర్‌తో సమావేశమై రాష్ట్రంలో సుమారు రూ. 500 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం చేసుకున్నది. అంతేకాదు, ఒప్పందం ప్రకారం ప్రభుత్వం భూమి కేటాయించడం, కంపెనీ ఏర్పాటు పనులు చకచకా జరిగిపోయాయి. అలాగే, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌లో కిటెక్స్ సంస్థ సైతం సుమారు రూ.1,500 కోట్ల పెట్టుబడికి రెండేళ్ల క్రితం ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని వెంటనే కంపెనీ ఏర్పాటుకు సంబంధించి పనులు ప్రారంభించింది.
వచ్చే మార్చిలోగా ఉత్పత్తి ప్రారంభించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తున్నది. ఇదే కంపెనీ సీతారాంపూర్‌లో సైతం మరో కంపెనీని ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకున్నది. అక్కడ కూడా కంపెనీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. గత కేసీఆర్ ప్రభుత్వం కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడమే కాదు, వాటిని వాస్తవరూపం దాల్చే విధంగా కృషిచేసింది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. సింగపూర్, దావోస్ పర్యటనలను ముగించుకొని శుక్రవారం ఉదయం ఆయన హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. మూడు రోజులపాటు దావోస్‌లో జరిగిన చర్చల్లో రూ.1,78,950 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం ప్రకటించింది. 20 కంపెనీలతో అవగాహనా ఒప్పందాలు (ఎంవోయూ) కుదిరినట్టు వెల్లడించింది. వీటి ద్వారా సుమారు 47,550 ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం తెలిపింది. అమెజాన్ రూ.60 వేల కోట్ల భారీ పెట్టుబడి ప్రకటించగా.. విప్రో, ఇన్ఫోసిస్ కంపెనీలు విస్తరణ ప్రణాళికలు ప్రకటించాయి.
సన్ పెట్రో కెమికల్స్ రూ.45,500 కోట్ల పెట్టుబడితో భారీ పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్తు, సోలార్ విద్యుత్తు ప్రాజెక్టుల ఏర్పాటుతోపాటు నాగర్‌కర్నూలు, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో ప్లాంట్ల ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నది. కంట్రోల్ ఎస్ సంస్థ రూ.10 వేల కోట్లతో డాటా సెంటర్ క్లస్టర్, మేఘా ఇంజినీరింగ్ సంస్థ పంప్డ్ స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టుకు రూ.15 వేల కోట్లు, టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ డాటా సెంటర్ ఏర్పాటుకు రూ.15,000కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చాయి. హెచ్‌సీఎల్ టెక్ సెంటర్ హైటెక్ సిటీలో క్యాంపస్ ఏర్పాటుకు, విప్రో గోపన్‌పల్లి క్యాంపస్‌లో కొత్త ఐటీ సెంటర్ ఏర్పాటుకు, ఇన్ఫోసిస్ పోచారం ఐటీ క్యాంపస్‌లో కొత్త సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి.