CM Revanth Reddy | హైదరాబాద్, ఆగస్టు 1(నమస్తే తెలంగాణ) : ‘తిట్టేందుకు నోరు.. తిరిగేందుకు కాలు’ అన్నట్టున్నది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరు. ఏడాదిన్నర కాలంలో పాలనాపరంగా, సంక్షేమం పరంగా పెద్దగా చేసిందేమీ లేకపోయినా, ఒక్క విషయంలో మాత్రం రికార్డు సృష్టించారని విమర్శలు వినిపిస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. శనివారం ఏఐసీసీ లా, హ్యూమన్ రైట్స్ అండ్ ఆర్టీఐ ఆధ్వర్యంలో ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగే కాంక్లేవ్‌లో పాల్గొననున్నారు. శనివారం మళ్లీ హైదరాబాద్ చేరుకుంటారు. ఇది ఆయనకు 50వ ఢిల్లీ పర్యటన కావడం విశేషం. వాస్తవానికి ఇది రేవంత్‌రెడ్డికి 51వ ఢిల్లీ పర్యటన. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మరణించిన సందర్భాన్ని మినహాయించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. తద్వారా ఇలా ఏడాదిన్నర కాలంలోనే 50 సార్లు హస్తిన చుట్టూ ప్రదక్షిణలు చేసిన తొలి సీఎంగా రేవంత్‌రెడ్డి రికార్డు నెలకొల్పాడంటూ రాజకీయ విశ్లేషకులు ఎద్దేవా చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కన్నా రాజకీయ ప్రయోజనాలకే రేవంత్‌రెడ్డి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాడని, ఇందుకు ఢిల్లీ పర్యటనలే నిదర్శనమని స్పష్టం చేస్తున్నారు. ‘దేశంలో తక్కువకాలంలో ఎక్కువసార్లు ఢిల్లీ టూర్లు చేసిన ముఖ్యమంత్రిగా మావాడు రికార్డు సృష్టించబోతున్నాడు’ అని అధికార పార్టీ నేతలే సెటైర్లు వేసుకుంటున్నారు. ఈసారి పర్యటనతో రేవంత్ స్వర్ణోత్సవాలను జరుపుకొంటారని సోషల్ మీడియాలో సైటర్లు పేలుతున్నాయి.
సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనల్లో 80 శాతానికిపైగా పార్టీ పెద్దలను కలిసేందుకు వెళ్లారని టూర్ షెడ్యూల్ స్పష్టం చేస్తుంది. ఎక్కే విమానం, దిగే విమానం తప్ప ఇప్పటి వరకు రాష్ర్టానికి రేవంత్‌రెడ్డి కొత్తగా సాధించుకొని తెచ్చింది ఏమీలేదని విమర్శిస్తున్నారు. కనీసం పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని కూడా విస్తరించుకోలేకపోతున్నాడని కాంగ్రెస్ వర్గాలే చెప్తున్నాయి. 50 సార్లు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసినా అధిష్ఠాన పెద్దలు రేవంత్‌రెడ్డిని కనీసం దగ్గరికి తీసుకోవడం లేదని పేర్కొంటున్నారు. రాహుల్‌గాంధీ కొన్నినెలల తర్వాత మొన్న చేయి కలిపారని, సమావేశానికి రాలేనని సోనియాగాంధీ లేఖ రాశారని, ఆ మాత్రానికే ‘ఆస్కార్, నోబెల్’ రేంజ్లో నటించారని ఎద్దేవా చేస్తున్నారు. మొత్తంగా పార్టీ పెద్దలను కలిసినా, తన గురువును కలిసినా, విదేశీ నేతలను కలిసినా సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ సురక్షిత స్థావరం అయ్యిందని విమర్శిస్తున్నారు.
రేవంత్‌రెడ్డి టూర్ల వెనుక అర్థం, పరమార్థం స్వప్రయోజనమేనని కాంగ్రెస్ సీనియర్లు, రాజకీయ విశ్లేషకులు తేల్చిచెప్తున్నారు. దానిని కప్పిపుచ్చేందుకు రాష్ట్ర అభివృద్ధి పేరుతో ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రులను కలుస్తున్నారని పేర్కొంటున్నారు. ఈ కలయికలోనూ లోగుట్టు వేరే ఉన్నదని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు 50సార్లు ఢిల్లీకి వెళ్లగా, ఇందులో ప్రధాని మోదీని, బీజేపీ నేతలను కలిసిన సందర్భాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. కొన్నిసార్లయితే రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కన్నా, బీజేపీ పెద్దలే మిన్న అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని అసలు కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. తన మీద అధిష్ఠానం గుర్రుగా ఉన్నదని, వాళ్లను కలిసేందుకు వెళ్తున్నానని ఇక్కడి నుంచి బయలుదేరుతున్నారని, తీరా ఢిల్లీకి వెళ్లాక అటుదిక్కు కూడా చూడకుండా నేరుగా ప్రధానిని, అమిత్‌షాను కలిసిన సందర్భాలు అనేకం ఉన్నాయని ఉదహరిస్తున్నాయి. ‘మోదీ బీజేపీ వాళ్లకు అపాయింట్మెంట్ ఇస్తారో లేదో తెలియదు కానీ మావోడికి మాత్రం ఎప్పుడంటే అప్పుడు అపాయింట్మెంట్ దొరుకుతుంది’ అని ఢిల్లీ కాంగ్రెస్‌లోని ఒకవర్గం నేతలు గుసగుసలాడుతున్నారు.
రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న రోజుల కన్నా బయటే ఎక్కువగా ఉన్నారన్న చర్చ జరుగుతున్నది. ఆయన ఏడాదిన్నర కాలంలో 50 సార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చారని, సగటున రెండు రోజులు గడిపారని చెప్తున్నారు. దీనికితోడు అమెరికా, దక్షిణ కోరియా, ఇంగ్లాండ్, దావోస్, జపాన్ తదితర దేశాల పర్యటనలకు వెళ్లారని ప్రతిసారి కనీసం వారం రోజుల నుంచి రెండు వారాల దాకా అక్కడే ఉన్నారని గుర్తు చేస్తున్నారు. ఇక పొరుగున ఉన్న కేరళ, మహారాష్ట్ర, హర్యానా తదితర రాష్ర్టాల్లో ఉప ఎన్నికల ప్రచారాల కోసం వారం రోజులు గడిపి వచ్చారని, గుజరాత్లో పార్టీ మీటింగ్ కోసం వెళ్లారని గుర్తుచేస్తున్నారు. ఇవన్నీ తీసివేస్తే రాష్ట్రంలో ఉన్నది, సచివాలయానికి వచ్చిన కాలం లెక్కగడితే 100-150 రోజులకు మించదని ఓ సీనియర్ అధికారి తెలిపారు.