Harish Rao | సిద్దిపేట, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దక్షిణాది రాష్ర్టాలు అంటే కేంద్రానికి, జాతీయ పార్టీలకు చిన్నచూపు అని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ, కర్ణాటక, ఏపీ, కేరళ, తమిళనాడు పోటీపడి అభివృద్ధి చెందటం కూడా ఓ విధంగా నష్టం కలిగిస్తున్నదని తెలిపారు. శనివారం సిద్దిపేటలోని పోలీస్ కన్వెన్షన్ హాల్లో ట్రస్మా ఆధ్వర్యంలో జరిగిన గురుపూజోత్సవంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘రాష్ట్రం నంబర్ వన్‌గా ఉన్నా నష్టాలు ఉన్నాయి. బాగాపనిచేయటం కూడా ఇబ్బందిగా మారుతుంది. ఆర్థికంగా ఫర్ క్యాపిటా ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్‌గా ఉండటం వల్ల కేంద్రం నుంచి నిధులు తక్కువగా వస్తాయి.
పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన చేస్తే సీట్లు తగ్గే ప్రమాదం ఉంటుంది. ఇక్కడి ప్రాంత ఎంపీ సీట్లు తగ్గితే మళ్లీ నార్త్ ఇండియన్ వాళ్లదే కేంద్రంలో పెత్తనం ఉంటుంది. ఇది ఆలోచించాల్సిన అంశం’ అని వివరించారు. వెనుకబడిన రాష్ర్టాలకు నిధులు ఇస్తామని కేంద్రం అంటుందని.. అలా బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ర్టాలకే ఎక్కువ నిధులు వెళ్తాయని వెల్లడించారు. కష్టపడి తెలంగాణను అభివృద్ధి చేసుకుంటున్నామని, తమ నిధులకు తమకు ఇవ్వాలని 16వ ఆర్థిక సంఘం సమావేశంలో తాను చెప్పినట్టు గుర్తుచేశారు. ఎంత సేపు వెనుకబడిన ప్రాంతాల్లో నిధుల కేటాయింపు ఎకువగా ఉంటే, తెలంగాణ పరిస్థితి ఎలా? అని ప్రశ్నించానని తెలిపారు.
‘ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ, ప్రైవేట్ టీచర్ల మధ్య తేడా చూపి ప్రైవేట్ టీచర్లను తక్కువచేసి మాట్లాడారు. అది దురదృష్టకరం. ఉపాధ్యాయుల అంశంలో సీఎంకు వివక్ష ఉండకూడదు. ప్రభుత్వానికి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు రెండు కండ్లు. ప్రైవేట్ ఉపాధ్యాయులు జీతాలు తక్కువ ఉండవచ్చు. కానీ, సామర్థ్యంలో తక్కువేమీ కాదు. ఒకరిని మెచ్చుకునే క్రమంలో ఇంకొకరిని కించపరిచే వ్యాఖ్యలు సీఎం రేవంత్‌రెడ్డి స్థాయి మనిషికి తగవు. ఎస్సీ,ఎస్టీ విద్యార్థులను ప్రభుత్వం చిన్నచూపు చూసింది. 10 నెలలైనా నిధులు రాలేదు. బెస్ట్ అవైలబుల్ సూల్ నిధులు వెంటనే విడుదల చేయాలి. ప్రభుత్వాలు చేయాల్సిన పనిని ప్రైవేట్ విద్యాసంస్థలు చేస్తున్నాయి.
రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో 34.50 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే, సర్కారు పాఠశాలల్లో 25.68 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని వివరించారు. ఇటీవల కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లోనూ పోటీ పెరిగిందని తెలిపారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ట్రస్మా నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, ట్రస్మా రాష్ట్ర, జిల్లా నాయకులతో పాటు సిద్దిపేట జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు పెద్దఎత్తున పాల్గొన్నారు.