హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ నియామకాల్లో సొమ్మొకరిది.. సోకొకరిది.. అన్న సామెతను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీశ్‌రెడ్డి ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో ఉద్యోగ నియామకాలను పూర్తిచేస్తే, నేడు నియామక పత్రాలను అందజేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి తానే ఇచ్చినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు.
నియామక పత్రాలు అందజేసే పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి బూతుపురాణం వల్లెవేస్తూ కాలక్షేపం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నూతన ఉద్యోగులకు బూతుపురాణం సిలబస్‌ను నేర్పుతున్నట్టుగా ఉన్నదని మండిపడ్డారు. కేసీఆర్‌ను తిట్టడానికి, కొత్త ఉద్యోగులకు బూతులు నేర్పడానికే అనే రీతిలో సీఎం మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. నియామక పత్రాలు ఇచ్చిన ప్రతీసారి అభ్యర్థులను ప్రత్యేక బస్సులు పెట్టి జిల్లాల నుంచి పిలిపిస్తున్నారని సతీశ్‌రెడ్డి పేర్కొన్నారు. వారికి బూతులు వల్లెవేస్తూ సీఎం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.