Revanth Reddy | హైదరాబాద్, మార్చి10 (నమస్తే తెలంగాణ): కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లు ల చెల్లింపుల కోసం మంత్రులు 20% కమీషన్ తీసుకుంటున్నారనే ఆరోపణలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఖండించకపోవడం చర్చనీయాంశంగా మారింది. సోమవారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు సమర్పించిన అనంతరం రేవంత్‌రెడ్డి సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. మంత్రులు 20% కమీషన్ తీసుకొని కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారనే ఆరోపణలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు రేవంత్‌రెడ్డి బదులిస్తూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టు బిల్లులు చెల్లించకపోవడం వల్లనే తాము ఇప్పుడు చెల్లించాల్సి వస్తున్నదని చెప్పారు. కానీ, తమ మంత్రులు 20% కమీషన్లు తీసుకోవడంలేదని మాత్రం ఖండించకపోవడం గమనార్హం.
మీరు ఢిల్లీకి ఎక్కే ఫ్లైట్, దిగే ఫ్లైట్తోనే సరిపోతున్నదంటూ కేటీఆర్ చేసిన ఆరోపణలను విలేకరులు ప్రస్తావించగా.. రేవంత్‌రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. తాను వచ్చాకే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం 39 సార్లు కాదు అవసరమైతే, 99 సార్లు ఢిల్లీకి వెళ్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్తో సంబంధం వల్లే భట్టి విక్రమార్క సమావేశానికి బీజేపీ రాలేదని ఆరోపించారు. బీసీ కులగణనతో సామాజిక న్యాయం జరిగిందని, తాము చేసిన కులగణన వల్లే ఇవాళ అన్నీ పార్టీలు బీసీలకు ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చాయని వ్యాఖ్యానించా రు. కాంగ్రెస్‌లో చేరిన నాటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న విజయశాంతికి ఎమ్మెల్సీ టికెట్ ఎలా ఇచ్చారని అడిగిన ప్రశ్నకు రేవంత్‌రెడ్డి ఎలాంటి సమాధానం చెప్పలేకపోయారు. ఆమె పదవి గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదని దాటవేశారు.