హైదరాబాద్, ఆగస్టు 7(నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాడి పడేశారు. ఇది తమ వల్ల కాదని పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఇటు రాష్ట్రంలో, అటు ఢిల్లీలో పన్నినవ్యూహాలేవీ పనిచేయకపోవడంతో దీనినుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటివరకు బీసీ రిజర్వేషన్లు సాధిస్తామంటూ గట్టిగా చెప్పిన ఆయన.. ఇప్పుడు తటపటాయిస్తున్నారు. గురువారం ఢిల్లీలో మీడియా సమావేశంలోనూ, చిట్చాట్లోనూ బీసీ రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. ‘బీసీ రిజర్వేషన్లపై మా ఆఖరి పోరాటాన్ని పూర్తిచేశాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అంతా పూర్తిచేశాం. ఇక బీజేపీ నిర్ణయం తీసుకోవాలి. ప్రధాని మోదీ చేతుల్లోనే బీసీ రిజర్వేషన్ నిర్ణయం ఉన్నది’ అంటూ నిస్సహాయత వ్యక్తంచేశారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరని పేర్కొన్నారు. రాజకీయాలతో రాష్ట్రపతికి సంబంధం లేదని వ్యాఖ్యానించారు.
బీసీ బిల్లుకు కేంద్ర ఆమోదం లభించకపోతే, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై ఆలోచిస్తామని చెప్పారు. స్థానిక ఎన్నికలను సెప్టెంబర్ 30వ తేదీలోపు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇక కాంగ్రెస్కు మరోసారి అధికారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మేమంతా దుప్పటి కప్పుకొని పడుకున్నా.. ప్రజలు రెండోసారి కాంగ్రెస్ను గెలిపిస్తారు’ అని వ్యాఖ్యానించారు. బీహార్ ఎన్నికలతోపాటే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు.