హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరాన్ని సిగ్నల్ ఫ్రీ సిటీగా మారుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇందుకోసం అండర్‌పాస్, సర్ఫేస్, ఎలివేటెడ్ అనే మూడు విధానాలను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఆధునీకరణ, పట్టణీకరణతో భవిష్యత్‌లో మరిన్ని కొత్త సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో నిర్వహించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలపై చర్చించారు. ఈ సందర్భంగా అధికారులు కమిటీకి పలు అంశాలను వివరించారు.
తాగునీటి సరఫరా, పట్టణాభివృద్ధి, మూసీ పునరుజ్జీవంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్రం సహకరించేలా చొరవ చూపాలని కమిటీకి అధికారులు విజ్ఞప్తి చేశారు. అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రోడ్ల విస్తరణ, రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాల్సి ఉందని, మూడు భాగాలుగా రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. సమావేశంలో కమిటీ చైర్మన్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎంపీ చామల, సీఎస్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.