Revanth Reddy | హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): జపాన్ పర్యటనకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అక్కడ వరుస సమావేశాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. పర్యటనలో అప్పుల వేటలో పలువురు పెద్దలతో సమావేశాలు నిర్వహించిన ఆయన శనివారం ఓ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. జపాన్ తెలుగు సమాఖ్య ‘తెలుగు వెలుగుల పండుగ సంబరాలు’ పేరుతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రకృతి మనల్ని క్షమిస్తదా? ఈ రోజు మీ టోక్యో నగరం పొల్యూషన్ఫ్రీ సిటీ. మన దగ్గర ఢిల్లీలో పొల్యూషన్తోటి పార్లమెంట్, స్కూళ్లు, గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ మూసేసిన్రు. అంతపెద్ద నగరాన్ని నిర్మించుకున్న తర్వాత కేవలం కాలుష్యం వల్ల ఢిల్లీ నగరమే స్తంభించే పరిస్థితుంటే మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదా? హైదరాబాద్ నగరాన్ని కూడా మనం కాలుష్యమైన నగరంగా అట్లే వదిలేద్దామా? అని అన్నారు. రేవంత్‌రెడ్డి మాటలపై సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చ జరుగుతున్నది.
మీరే కొట్టి… మీరే ఏడుస్తరా?
జపాన్ తెలుగు సమాఖ్య సమావేశంలో రేవంత్‌రెడ్డి ప్రసంగం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అత్త రెండు చేతులను విరగ్గొట్టిన కోడలు… అత్తకు నేను కాకపోతే ఇంకెవరు సేవ చేస్తరు..? నాకు బాధ్యత లేదా..! అన్నదట.. ఈ సామెత చెప్పినట్టే ఉంది.. సీఎం రేవంత్‌రెడ్డి తీరు అంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. నవ్విపోదురుగాక నాకేంటి…. అన్నట్టుగానే రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారు అని మండిపడుతున్నారు. ఇదేమి ఇచ్ఛంత్రముళ్లా అని పేర్కొంటూ కొందరు నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ మాటలు నిన్నమొన్న ఎవరో ఎక్కడో మాట్లాడినట్టు ఉందే…! అని గుర్తుచేసుకుంటున్నారు.
ఇలాగేనా హైదరాబాద్‌ను కాపాడుకునేది?
ప్రకృతి క్షమిస్తుందా? అని రేవంత్‌రెడ్డి సంధించిన ప్రశ్నపైనా నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. హైదరాబాద్‌కు ఆక్సిజన్ అందించే పచ్చదనాన్ని పారిశ్రామిక అభివృద్ధి పేరిట కాలరాయడం దారుణమని, పాలకులు భవిష్యత్తుకు అందించే వారసత్వ సంపద ఇదేనా? అని పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు… ప్రతిపక్షాలనేతలు ప్రశ్నిస్తున్నారు.
ఢిల్లీ ఉదాహరణ జపాన్‌లో గుర్తొచ్చిందా?
ఇటీవల కంచగచ్చిబౌలిలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సాగించిన అటవీ, పర్యావరణ విధ్వంసం పర్యవసానాలు ఎలా ఉంటాయో వివరించేందుకు ఢిల్లీలోని కాలుష్యం తీవ్రతను పర్యావరణవేత్తలు ఉదహరించారు. దేశరాజధానిలోనే ప్రశాంతమైన గాలి పీల్చుకునే అవకాశం లేకుండాపోయిందని, పర్యావరణ విధ్వంసమే ఇందుకు కారణమని చెప్పారు. పార్లమెంట్, స్కూళ్లు, గవర్నమెంట్ ఆఫీసులు కూడా మూసివేసే పరిస్థితి వచ్చిందని, తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని కూడా ఢిల్లీలా కాలుష్యకాసారంగా మారుస్తుందా? అడవిని నరికివేయడం ఏంటని సీఎం రేవంత్‌రెడ్డిని నిలదీశారు. జనం ఏవైతే ప్రశ్నలు సంధించారో.. ఇప్పుడు రేవంత్‌రెడ్డి అవే ప్రశ్నలను జనాలకు వేశారని.. మరి సమాధానం ఎవరు చెప్పాలని నెటిజన్లు నిలదీస్తున్నారు. ప్రజలు, పర్యావరణవేత్తలు, ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పలేదు? పర్యావరణ విధ్వంసం, వన్యప్రాణి విషాదంపై ప్రశ్నించిన వాళ్లపై కేసులు పెడుతున్నారు. హంతకులే సంతాపం తెలిపినట్టు.. కొట్టినవాడే ఏడ్చినట్టు… ప్రజలు అడిగిన ప్రశ్నలనే… జనాలను రేవంత్ అడిగితే ఏమనుకోవాలి? అని సోషల్ మీడియాలో జనాలు వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నారు. నూరు ఎలుకలు తిన్నపిల్లి తీర్థయాత్రలకు పోయినట్టు రేవంత్‌రెడ్డి వైఖరి ఉందని మండిపడుతున్నారు. ప్రవచనాలు ఆపి… పర్యావరణాన్ని కాపాడే పని చూడాలని హితవు పలుకుతున్నారు.
విధ్వంసం మీరే చేసి.. విలువలు మీరే చెప్తారా?
ఇటీవల రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కంచగచ్చిబౌలిలోని 129 ఎకరాల అడవిని మూడు రోజుల్లో నేలమట్టం చేసిన విషయాన్ని నెటిజన్లు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. అడవి కాస్తా మైదానంగా మారిన దృశ్యాలు పర్యావరణ ప్రేమికులను, నగరవాసులను నిర్ఘాంతపోయేలా చేశాయని… సగటు ప్రజలను కలచివేశాయని పేర్కొంటున్నారు. కాంక్రీట్ జంగల్‌గా మారిపోతున్న నగరాల్లో ఓ చెట్టు నీడ కనిపించడమే పెద్ద ఊరట అని, అటువంటిది.. అంతటి అడవిని ఎంతలా కాపాడుకోవాలి కదా అని చెప్తున్నారు. పర్యావరణంపై ప్రేమ ఉంటే అడవిని ఎందుకు నరికివేశారని నిలదీస్తున్నారు.