నాంపల్లి క్రిమినల్ కోర్టులు, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : కొవిడ్ విజృంభిస్తున్న సమయంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ధర్నాలు నిర్వహించినందుకు తిరుమలగిరి, మట్టంపల్లి, ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన 3 కేసుల్లో ఎగ్జామినేషన్ కోసం సీఎం రేవంత్రెడ్డి శనివారం ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. జడ్జి శ్రీదేవి ఆయనకు పలుప్రశ్నలు సంధించారు.
కొవిడ్ సమయంలో మాస్కులు ధరించకుండా గుంపులుగా పోరాదని పోలీసులు అడ్డుకున్నప్పటికీ బలవంతంగా వెళ్లారన్న అభియోగం నిజమేనా? అని జడ్జి ప్రశ్నించగా.. అబద్ధమని రేవంత్ బదులిచ్చారు. ఓయూ ప్రాంగణంలోకి అనుమతి లేదని పోలీసులు వారించినా దూసుకెళ్లారని అధికారి చేసిన ఫిర్యాదులో కూడా నిజం లేదని ఆయన చెప్పారు. 3 కేసుల్లో రేవంత్రెడ్డి సంతకాలు చేయగా, తదుపరి విచారణను ఫిబ్రవరి 4కు వాయిదా వేస్తున్నట్టు జడ్జి ప్రకటించారు. తదుపరి విచారణలో వాంగ్మూలాల నమోదుకు హాజరయ్యేలా ఫిర్యాదుదారుడితోపాటు సాక్షులకు సమన్లు జారీచేయాలని ఆదేశించారు.