హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 68వసారి ఢిల్లీ పర్యటనకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో కలిసి బుధవారం బయల్దేరి వెళ్లారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు, డీలిమిటేషన్‌పై కేంద్ర ప్రభుత్వం గురువారం నుంచి మూడ్రోజులపాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎంపీలతో కలిసి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, పార్టీ పెద్దలను కలువనున్నారు.
అదేవిధంగా రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్‌రెడ్డి పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులతో కలిసి సీఎం హాజరుకానున్నారు. అనంతరం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం, కార్పొరేషన్ చైర్మన్ల భర్తీ తదితర అంశాలపై పార్టీ పెద్దలతో చర్చిస్తారని పార్టీ నేతలు ఒక ప్రకటనలో వెల్లడించారు.