హైదరాబాద్, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ): కేంద్రం వైఖరి వల్లే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో రెండు రోజులు ఉన్నా కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క యూరియా బస్తా కూడా అడగకపోవడం విమర్శలకు తావిస్తున్నది. ఎందరో మంత్రుల్ని కలిసిన రేవంత్‌రెడ్డి ఎరువుల మంత్రి జేపీ నడ్డాను కలవకపోవడం గమనార్హం. తాను కలిసిన ఇతర మంత్రుల వద్ద కూడా ఆ ప్రస్తావన తీసుకురాలేదు. రేవంత్‌రెడ్డికి రైతులపై ఉన్న ప్రేమ ఇదేనా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మంగళవారం జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం రేవంత్‌రెడ్డి సోమవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. మంగళ, బుధవారాల్లో అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు నిర్మలాసీతారామన్, నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్‌సింగ్‌లతో భేటీ అయ్యారు.
నిర్మలాసీతారామన్‌తో అప్పుల కోసం చర్చించగా, నితిన్ గడ్కరీతో ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి గ్రీన్‌ఫీల్డ్ రహదారి మంజూరు కోసం చర్చించారు. రాజ్‌నాథ్‌సింగ్‌తో గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం అవసరమైన భూమి కోసం చర్చించారు. కానీ ఎరువులు సరఫరా చేసే ఆ శాఖమంత్రి జేపీ నడ్డాను మాత్రం కలవలేదు. దీంతో రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రాధాన్యం కలిగిన అంశాలపైనే కేంద్ర మంత్రులను కలిశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంటే రేవంత్‌కి మాత్రం ఇవేవీ పట్టలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యూచర్ సిటీ ఇక్కడ రేవంత్‌రెడ్డికి ప్రాధాన్యాంశం కాగా, అక్కడ అమరావతి ఆయన గురువు చంద్రబాబుకు ప్రాధాన్యాంశం కావడం వల్లే అందుకోసం తహతహలాడుతున్నారని చెప్తున్నారు.
రాష్ట్రంలో రైతులు తిప్పలుపడుతున్నప్పటికీ రేవంత్‌రెడ్డి తనకు పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. యూరియా సంక్షోభం పతాకస్థాయికి చేరినప్పటికీ సీఎం సమీక్ష చేసిన దాఖలాలు లేవు. రైతు సమస్యలపై అప్పుడప్పుడు మాట్లాడటం తప్ప ప్రత్యేకంగా స్పందించిన సందర్భం లేదు. దీంతో సీఎంకు రాజకీయాలే ప్రాధాన్యంగా మారాయని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.