తెలంగాణ ఇమేజ్.. నేషనల్ లెవల్లో మరోసారి డ్యామేజ్ అయ్యింది. కేసీఆర్ పదేండ్ల పాలనలో జాతీయ స్థాయిలో తెలంగాణ ఓ ఐకానిక్ స్టేట్‌గా నిలిచింది. అయితే, అప్పులపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలతో తెలంగాణ పరపతి మరోసారి గాలిలో కలిసినట్లయింది. దీన్ని ధ్రువపరుస్తూ.. జాతీయ స్థాయిలో ఏ పత్రికను తిరిగేసినా, ఏ మీడియా చానళ్లను చూసినా తెలంగాణ పేరుప్రతిష్టలను దెబ్బతీసే వార్తలే కనిపిస్తున్నాయి.
Revanth Reddy | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ) : ‘రాష్ట్రం ఆర్థికంగా బాగాలేదు. ఎవడూ బజార్ల నమ్ముతలేడు. ఢిల్లీకి పోతే.. వీడు వస్తే చెప్పులూ ఎత్తుకపోయేటట్టున్నడని ఎవరూ అపాయింట్మెంట్ ఇస్తలేరు’.. ఇదీ సోమవారం సీఎం రేవంత్ నోటి నుంచి వచ్చిన పలుకులు. ‘నేను ఏం మాట్లాడుతున్నా? ఇలా మాట్లాడితే ఏమైతది?’ అన్న ఆలోచన కూడా సీఎంకు లేనట్టు కనిపిస్తున్నది. అందుకే, తెలంగాణ ఆర్థికస్థితిని మరోసారి బజారునపెట్టారు. సీఎం నోటి వెంట ఇలాంటి అనాలోచిత వ్యాఖ్యలు ఇలా వచ్చాయో లేదో.. అలా జాతీయ మీడియా అందుకున్నది. మొన్నటివరకూ తెలంగాణ ప్రగతిని వేనోళ్ల కొనియాడిన నేషనల్ మీడియా.. ఇప్పుడు అదే తెలంగాణను విఫల రాష్ట్రంగా అభివర్ణిస్తున్నది.
తలసరి ఆదాయానికి, జీఎస్డీపీ పెరుగుదలకు, పారిశ్రామికాభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు, కొత్త కంపెనీల రాకకు, ఐటీ ఎగుమతులకు, ఉపాధి అవకాశాలకు.. ఇలా అటు ఆర్థిక క్రమశిక్షణకు, ఇటు సంక్షేమ పథకాలకు తెలంగాణ చిరునామాగా మారిందంటూ కేసీఆర్ పాలనా కాలంలో నిన్నమొన్నటి వరకూ జాతీయ మీడియా తెలంగాణను ప్రశంసించింది. అయితే ఇప్పుడు అదే మీడియాలో ‘తెలంగాణ దివాలా’, ‘తెలంగాణ ఇన్ ఫైనాన్షియల్ క్రైసిస్’ అనే రీతిన పుంఖానుపుంఖాలుగా వార్తలు ప్రసారం అవుతున్నాయి. ‘కటాకట్ ఫాలౌట్ ఇన్ తెలంగాణ’ అంటూ టైమ్స్ నౌ ఓ ప్రత్యేక కార్యక్రమాన్నే ప్రసారం చేసింది. అప్పులకు సంబంధించి సీఎం రేవంత్ సోమవారం చేసిన అనాలోచిత వ్యాఖ్యలే దీనికి కారణమని ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ దివాలా తీసిందన్నట్టు సాక్షాత్తూ ముఖ్యమంత్రే చెబితే రాష్ర్టానికి పెట్టుబడులు ఎలా వస్తాయని? ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు క్షీణించవా? అంటూ ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ సర్కారును నమ్మి ఎవరూ రుణాలు ఇవ్వబోరని, కొత్త పెట్టుబడుల మాట అటుంచితే, ఉన్నవే వెళ్లిపోవచ్చని హెచ్చరిస్తున్నారు.
తెలంగాణ ఆర్థిక పరిస్థితిని తక్కువ చేస్తూ రాష్ట్ర పరపతిని బజారుకీడ్చడం ముఖ్యమంత్రికి ఇదేమీ తొలిసారి కాదు. గత మార్చిలో జాతీయ మీడియా ‘ఇండియా టుడే’ కాంక్లేవ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఈ తరహా వ్యాఖ్యలే చేశారు. ‘ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు ఇవ్వడానికే కష్టపడుతున్నాం. డీఏ గురించి అడగొద్దు’ అంటూ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ప్రకటించడం, ఆర్బీఐ నుంచి చేబదులు తీసుకొంటున్నట్టు ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో మీడియాలో కలకలం సృష్టించాయి. ఒక్క ఏడాదిలోనే తెలంగాణలో ఈ పరిస్థితులు దాపురించడం ఏమిటంటూ టైమ్స్ గ్రూప్, ఇండియా టుడే వంటి ప్రఖ్యాత చానల్స్ చర్చా కార్యక్రమాలను ప్రసారం చేశాయి. తెలంగాణలో ఆర్థిక సంక్షోభం పెచ్చరిల్లిందంటూ హిందుస్థాన్ టైమ్స్, న్యూస్ 18, టైమ్స్ నౌ, డెక్కన్ హెరాల్డ్, బిజినెస్ టుడే ప్రత్యేక కథనాలు ప్రసారం చేశాయి. ఇప్పుడు రేవంత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి జాతీయ మీడియాలో హెడ్లైన్లుగా మారి తెలంగాణ ప్రతిష్టను మసకబారేలా చేశాయి.
తెలంగాణ ఆర్థికస్థితి బలహీనంగా ఉన్నది. ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖున జీతాలు చెల్లించడానికి కూడా ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. డీఏ చెల్లింపులపై పట్టుబట్టవద్దని ఉద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి రూ.4 వేల కోట్లను చేబదులుగా రుణం తీసుకొన్నాం. – గత మార్చిలో అసెంబ్లీ సాక్షిగా..
ఎన్నికల బరిలోకి దిగాక వెనుకబడకుండా ఉండాలంటే పరుగెత్తాల్సిందే. ఈ క్రమంలోనే హామీలిచ్చాం. ప్రభుత్వం తరఫున కనీసం రూ.500 కోట్లను కూడా మౌలిక వసతులకు, పెట్టుబడులకు ఖర్చు చేయలేని పరిస్థితి ఇప్పుడు నెలకొన్నది.
రాష్ట్రం ఆర్థికంగా బాగాలేదు. ఎవడూ బజార్ల నమ్ముతలేడు. ఢిల్లీకి పోతే వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోయేటట్టున్నడని ఎవరూ కూడా అపాయింట్మెంట్ ఇస్తలేరు. రాష్ట్ర ప్రతినిధులను.. బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నరు. నన్ను కోసినా రూ.18,500 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం లేదు. దీన్ని ఎట్లా పంచుదామో చెప్పుండ్రి.
తొలిరోజు నుంచీ సీఎం రేవంత్ దృష్టి తెలంగాణ ఆర్థికాభివృద్ధిపై కాకుండా కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయాలన్న దానిపైనే ఉన్నది. ఈ క్రమంలోనే అప్పులపై ఆయన తరచూ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. తన వ్యాఖ్యల వల్ల మార్కెట్లో తెలంగాణ పరపతి దిగజారుతున్నదన్న విషయాన్ని కూడా ఆయన గుర్తించట్లేదు. ఇది తెలంగాణ ప్రజానీకానికి కూడా నష్టమే.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడం కోసమే సీఎం రేవంత్‌రెడ్డి దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడు. సీఎం హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు సిగ్గుచేటు. కాంగ్రెస్ పాలనలో మంత్రుల ఆదాయం పెరుగడంతోనే రాష్ట్ర ఆదాయం తగ్గి అసలు సమస్య తలెత్తింది. అప్పులతో ఏర్పడిన తెలంగాణ రాష్ర్టాన్ని మాజీ సీఎం కేసీఆర్ ఆదాయం తెచ్చేలా పాలన చేశారు. ఇప్పడు ఓ పక్క మాఫియాలా మారి రాష్ట్ర ఆదాయం లూటీ చేసి ఢిల్లీకి మూటలు మోస్తుండగా, మరోపక్క పదవి కోసం సీఎం, లంచాల కోసం మంత్రులు పోటీపడి సంపాదిస్తున్నారు.
పాలన చేతగాకే సీఎం రేవంత్‌రెడ్డి అప్పులతో రాష్ట్రం దివాలా తీసిందని అబద్ధాలు చెప్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు ఓట్ల కోసం ఆరు గ్యారెంటీలంటూ బాండ్ పేపర్లు ఇచ్చి, ఇప్పుడు పచ్చి దగా చేస్తున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడుగుతున్న ఉద్యోగులను బెదిరించడం దుర్మార్గం. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ‘నన్ను కోసుకొని తింటరా’ అని మాట్లాడడం సిగ్గుచేటు. ఇప్పటికైనా మేల్కొని ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి.
ఏపీ సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ డైరెక్షన్లో సీఎం రేవంత్‌రెడ్డి యాక్షన్ చేస్తున్నారు. రేవంత్‌రెడ్డిది టీడీపీ వారసత్వం, బీజేపీ జవసత్వం. రాష్ర్టాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగానే ప్రభుత్వం ఆర్థికంగా ‘దివాలా’ తీసిందంటూ రేవంత్ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. హైదరాబాద్‌కు వచ్చే పెట్డుబడులను అమరావతికి మళ్లించేందుకు రేవంత్ ద్వారా చంద్రబాబు స్కెచ్ వేశారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ ఆదాయం గణనీయంగా పెరిగింది. అన్ని రంగాలు బలోపేతమై ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. సర్కారు మారగానే ప్రభుత్వ ఆదాయం ఎందుకు, ఎలా తగ్గింది.
తెలంగాణను దివాలా రాష్ట్రంగా చిత్రీకరించిన సీఎం రేవంత్‌రెడ్డిపై రాజద్రోహం కేసు పెట్టాలి. ప్రజలు, ఉద్యోగులకు మధ్య సీఎం విభేదాలు సృష్టించి తన్నుకు చావండని సలహాలు ఇస్తున్నాడు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక, పాలన చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది. దేశం ముందు తెలంగాణ పరువు తీస్తున్న రేవంత్‌రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎన్నికల ముందు ఉద్యోగులను రెచ్చగొట్టి, అధికారంలోకి వచ్చాక వారిని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టారు.
కేసీఆర్ పదేండ్ల పాలనలో బంగారమైన తెలంగాణ.. రేవంత్ 18 నెలల పాలనలో బంజరెట్లయింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు ముఖ్యమంత్రిని కోయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్సోళ్ల జేబులు కోస్తే చాలు. ఏడాదిన్నరగా కమీషన్ల పేరిట ఖజనాకు చిల్లుపెట్టి దోచుకున్న కోట్లాది కాసులు వడగండ్ల వానలాగా రాలుతాయి. రేవంత్‌రెడ్డి ఢిల్లీ పెద్దలకు పంపిన మూటలు, అక్కడి పెద్దల జేబులు కోస్తే కాసులు కుంభవృష్టిలాగా కురుస్తాయి. ఈ 18 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ తెర్లయిందంటే ఏదో మతలబు ఉన్నదని ప్రజలు ఆలోచించాలి.
సీఎంగా రేవంత్‌రెడ్డికి పాలన చేతగాకపోతే అమరవీరుల విగ్రహం ముందు ముక్కు నేలకు రాసి, ఆ పదవి నుంచి దిగిపోవాలి. లేదంటే సరైన సమయంలో ప్రభుత్వానికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారు. అప్పుల పేరుతో ఇప్పటికైనా రాష్ట్ర పరువు, ప్రతిష్టలను తక్కువ చేయొద్దు. బాధ్యత గల పదవిలో ఉండి ఆత్మగౌరవం దెబ్బతినేలా మాట్లాడటం సరికాదు. ఇప్పటికైనా అవగాహన పెంచుకోవాలి. మోసపూరిత విధానాలను విడనాడాలి.
ప్రభుత్వాన్ని నడపడం చేతనైతలేదని సీఎం రేవంత్‌రెడ్డి మాటలతోనే తేటతెల్లమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఖేల్ ఖతం.. దుకాణం బందైనట్టు తేలిపోయింది. సీఎం వ్యాఖ్యలతో ప్రభుత్వం ఉంటుందా? ఉండదా? అనే అనుమానాలు తెలంగాణలో వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే తమ భవిష్యత్తు ఏమిటనే డైలమాలో పడిపోయారు. సమస్యను ఎలా పరిష్కరించుకుంటామో చెప్పకుండా, తెలంగాణ రాష్ట్రం పరువుపోయేలా చేశారు. సీఎం మాట్లాడిన తీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. 420 హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని హామీ ఎలా ఇచ్చారు.
రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికవర్గాలతోపాటు పెన్షనర్లను కూడా సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా అవమానిస్తున్నారు. బకాయిలు చెల్లించడానికి కూడా డబ్బుల్లేవని చెప్తున్నారు. ఏ పథకం నిలిపివేసి హైదరాబాద్‌లో అందాల పోటీలు నిర్వహిస్తున్నారు? హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ కారు రేస్ నిర్వహిస్తే తప్పు కానీ, అందాల పోటీలు నిర్వహిస్తే తప్పు లేదా? మా డబ్బులు మాకిమ్మంటే ఇబ్బంది ఏమిటి? ఇక ఉపేక్షించేది లేదు. మరో జేఏసీ ఏర్పాటుచేసి, ఉద్యమానికి శ్రీకారం చుడుతాం.
ఇన్నేండ్ల నా ఉద్యోగ, రాజకీయ అనుభవంలో ఎందరో ముఖ్యమంత్రులను చూశాను. కానీ, ఇలాంటి సీఎంను మాత్రం జన్మలో చూడలేదు. ఉద్యోగులను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. బోనస్ అడిగామా? మాకు రావాల్సిన డబ్బులనే కదా అడుగుతున్నది. దానికే సీఎం ఉద్యోగులకు వ్యతిరేకంగా మాట్లాడటం సబబు కాదు. ఇక నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వైఖరిని సీరియస్‌గానే తీసుకుంటాం.
కాంగ్రెస్ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నాం. సంక్షేమ పథకాలకు తాము వ్యతిరేకం కాదు. ఉద్యోగుల హకుల పరిరక్షణ కోసం చట్టబద్ధంగా మాట్లాడే హకు తమకూ ఉన్నది. ప్రభుత్వం ఈ కుభేర్ పెండింగ్ బిల్లులను తక్షణమే క్లియర్ చేయాలి. పెండింగ్ డీఏలను విడుదల చేయాలి, పీఆర్సీ నివేదికను రూపొందించి 51శాతం ఫిట్‌మెంట్‌ను అమలు చేయాలి. ఉద్యోగ ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్)ను సమర్థవంతంగా అమలు చేయాలి.
కుటుంబం అంటూనే ఉద్యోగులను బజారున పడేయడం సరికాదు. ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ కోసం 14 నెలలుగా ఎదురు చూస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో క్లియర్ చేస్తామని చెప్పిన సీఎం ఇప్పుడు మాట మార్చి ప్రజల్లో ఉద్యోగులను పలచన చేయడం విచారకరం. ముఖ్యమంత్రి హోదాలో ఉండి చర్చలు, సంప్రదింపుల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి తప్పా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఉద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంటే వెంటనే క్యాబినేట్ సబ్ కమిటీ లేదా ముఖ్యమంత్రి జేఏసీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి సమస్యలు పరిష్కరించాలి.
సీఎం రేవంత్‌రెడ్డిని లేనిది అడిగామా? గొంతెమ్మ కోర్కెలేమైనా కోరామా? మాకు న్యాయబద్ధంగా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్లే కదా అడుగుతున్నాం. జీపీఎఫ్ ద్వారా మేము జమ చేసుకున్న మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. మాకు రావాల్సిన పీఆర్సీ, డీఏలు అడుగుతున్నాం. దానికే కాల్చుకుతిన్నా.. కోసుకుని తిన్నా.. డబ్బుల్లేవు అంటూ సీఎం వ్యాఖ్యానించడం ఏమిటి? సీఎం రేవంత్‌రెడ్డిని వదిలిపెట్టేది లేదు. వారిని పక్కకు జరిపే అవకాశాలను పరిశీలిస్తున్నాం.
రాష్ట్ర ఏర్పాటులో ఉద్యోగుల పాత్రలను తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ గుర్తించారు. ఆనాడు కేసీఆర్ 73 శాతం ఫిట్మెంట్ ఇచ్చారని, ప్రత్యేక ఇంక్రిమెంట్ కూడా విడుదల చేసి ఉద్యోగులపై ఎనలేని అభిమానాన్ని చాటుకున్నారు. కానీ, కాంగ్రెస్ పాలనలోనే చిన్నచూపు చూస్తున్నారు. ఎన్నికల మ్యానిఫెస్టో హామీలైన పీఆర్సీ, డీఏ అడిగిన పాపానికి ప్రభుత్వ ఉద్యోగులను విలన్లుగా చిత్రీకరించడం ఎంతవరకు సబబు. ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలలో సీఎం రేవంత్‌రెడ్డి ఏ ఒక్కటీ అమలు చేయలేదు. ఉద్యోగులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను సీఎం రేవంత్‌రెడ్డి ఉపసంహరించుకోవాలి. లేకుంటే ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదు.