హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ) : రేవంత్‌రెడ్డి.. రాష్ట్ర ముఖ్యమంత్రా? తీవ్రవాదా? ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు అమలు ఏమయ్యాయని బాధ్యతగల ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ప్రశ్నిస్తే, కేసీఆర్‌ను, వారి కుటుంబాన్ని బూతుపురాణాలతో దండయాత్ర చేస్తున్నాడని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చి 700 రోజులైనా సీఎం రేవంత్‌రెడ్డి తీరులో ఏ మాత్రం మార్పు రాలేదు అని మండిపడ్డారు. ప్రజలకిచ్చిన హామీల గురించి అడిగితే సమాధానం చెప్పకుండా, బూతు పురాణం మొదలు పెట్టారంటూ ఆగ్రహించారు. కేసీఆర్‌ను, కేటీఆర్, హరీశ్‌రావులను తిడుతూ రాక్షసానందం పొందుతున్నారని నిప్పులు చెరిగారు. తన గురువు చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టునే రేవంత్ చదువుతున్నారని, ఆయన తెలంగాణను రావణకాష్టం కావాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక మానసికరోగిలా మారారని, జనాన్ని కరిచేలా ఉన్నారని కర్నె ప్రభాకర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని ఫూడ్యలిస్టు అని వ్యాఖ్యానించడంపై జానారెడ్డి సహా జీవన్‌రెడ్డి, వీహెచ్ హనుమంతరావు లాంటి సీనియర్ కాంగ్రెస్ నేతలు స్పందించాలని కోరారు. ఈ సీనియర్ నాయకులు చొరవ తీసుకుని, రేవంత్‌రెడ్డిని డాక్టరుకు చూపించాలని సలహా ఇచ్చారు. రేవంత్ చేష్టల వల్ల కాంగ్రెస్ పార్టీ 50 ఏండ్లు వెనక్కిపోయిందని, ఆయనే కాంగ్రెస్‌ను బొందపెట్టేలా ఉన్నారని ఆరోపించారు.
దేశంపైకి కసబ్ తుపాకీ పట్టుకుని వచ్చినట్టుగా, రేవంత్‌రెడ్డి తెలంగాణవాదులపైకి నాడు తుపాకీతో వచ్చారని ప్రభాకర్ గుర్తుచేశారు. ఈ సీఎం హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి మంచి లక్షణాలతో తిరిగి వస్తాడనుకుంటే, పిచ్చి ముదిరినట్టు ప్రవర్తిస్తున్నారని అని ఆరోపించారు. ముఖ్యమంత్రి నిర్వహించే అధికారిక సభల్లో కూడా కాంగ్రెస్‌కు ఓట్లు వేయాలని మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదని, దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కర్నె ప్రభాకర్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత బొమ్మర రామమూర్తి పాల్గొన్నారు.