ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్‌రెడ్డి ఇప్పటికి 55 సార్లు ఢిల్లీ వెళ్లారు. ప్రతిసారీ కేంద్రం నుంచి నిధులు తేవడానికే వెళ్తున్నట్టు చెప్పుకొచ్చారు. అవసరమైతే ఇంకో వందసార్లయినా వెళ్తానని కుండబద్దలు కొట్టారు. కేంద్రం-రాష్ట్రం సంబంధాలు బడేభాయ్-చోటేభాయ్ తరహాలో ఉండాలని చెప్తూ వచ్చారు. తీరా ఏమైంది? రెండేండ్లుగా రాష్ర్టానికి రావాల్సిన 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు రూ.మూడువేల కోట్లు తగ్గినయ్! అంటే కేటాయింపుల్లో ఒక్క పైసా తెలంగాణకు కేంద్రం విదిల్చలేదు. కేసీఆర్ హయాంలో కేంద్రంతో కొట్లాడుతూనే రూ.1,400 నుంచి 1,850 కోట్ల వరకు ఏటా తెచ్చుకున్నది రాష్ట్రం. మరి, ఇప్పుడేమైంది? ఎందుకిలా?
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): రేవంత్‌రెడ్డి సర్కారు నిర్లక్ష్యం కారణంగా 15వ ఆర్థిక సంఘం నిధుల కేటాయింపుల్లో రాష్ర్టానికి తీరని అన్యాయం జరుగుతున్నది. నిధుల మంజూరులో భారీగా కోత పడుతున్నది. 2020-21 నుంచి 2025-26 వరకు రూ.9,048 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇందులో కూడా కేవలం రూ.6,051.18 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావస్తున్నా స్థానిక సంస్థల ఎన్నికలు జరుపకపోవడం వల్ల రెండేండ్లలో 15 ఆర్థిక సంఘం రూ.2,991 కోట్ల మేరకు కోత పెట్టింది. అంటే రేవంత్‌రెడ్డి చేతకానితనం వల్ల రాష్ర్టానికి ఫైనాన్స్ నిధుల్లో 33 శాతానికిపైగా నష్టం వాటిల్లింది. ఇది రాష్ట్ర గ్రామ పంచాయతీల ప్రగతిపై ప్రతికూల ప్రభావం చూపింది. రైతులు, గ్రామీణ మహిళలు, పిల్లల ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలకు విఘాతం కలిగించింది.
తెలంగాణ రాష్ట్రం.. దేశంలో అత్యధిక జీడీపీ పెరుగుదల కలిగిన రాష్ట్రాల్లో ఒకటి. దేశానికి ఆదాయం అందించే టాప్ ఐదు రాష్ర్టాల్లో తెలంగాణ కూడా ఉన్నది. దేశంలోని 28 రాష్ట్రాలకు 15వ ఆర్థిక సంఘం గత ఐదేండ్లలో రూ. 2,97,555 కోట్లు కేటాయించి రూ.2,37,129 కోట్లు విడుదల చేసింది. ఇందులో రాష్ట్ర వాటా రూ. 6,051 కోట్లు (కేవలం 2.55 శాతం) కావడం గమనార్హం. గ్రామీణ ప్రజలకు రోడ్లు, నీరు, విద్యుత్తు, ఆరోగ్య సౌకర్యాలు అందించాలంటే కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు కీలకం. కానీ, తెలంగాకు ఆర్థిక సంఘం కేటాయించే నిధులు, మంజూరులోనూ తీరని అన్యాయం చేస్తున్నది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకా రం.. దేశవ్యాప్తంగా గ్రామీణ స్థానిక సంస్థలకు (రూరల్ లోకల్ బాడీస్) రూ.2,97,555 కోట్లు కేటాయించింది. కానీ, తెలంగాణకు మాత్రం నిధుల కేటాయింపుతోపాటు విడుదలలోనూ అన్యాయం జరుగుతున్నది.
దేశ చరిత్రలో తెలంగాణది భౌగోళికంగా 11వ స్థానం. జనాభా పరంగా 12వ స్థానం. దేశ జీడీపీలో తెలంగాణది పెద్ద న్న పాత్రని కేంద్రమే పార్లమెంట్లో అంగీకరించింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల్లో వాటా మాత్రం అందులో 10వ వంతు కూడా పెరగలేదు. ఇప్పుడు తెలంగాణకు 5వ ఆర్థిక సంఘం నిధు లు కూడా 2.55 శాతం దగ్గరే నిలిచిపోయాయి. 2024-25కు 1,514 కోట్లు కేటాయించబడినా, ఇంకా ఒక పైసా కూడా రిలీజ్ కాలేదు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడం వల్లేనని కేంద్రం చెప్తున్నది. 2025-26 మార్చిలో రూ.1,477 కోట్లు కేటాయించినా హోల్డ్‌లో పెట్టింది. ఇలా రాష్ట్రానికి మొత్తం రూ.3,000 కోట్లు నష్టానికి దారితీసింది. గ్రామీణ రోడ్లు, నీటి సరఫరా, స్వచ్ఛతా కార్యక్రమాలు ఆగిపోయాయి.
కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోవడంతో రాష్ట్రంలోని 12,733 గ్రామాల్లో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. రోడ్లు, డ్రైనేజీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మహిళా శక్తీకరణ కార్యక్రమాలు అందుబాటులో లేకపోవడం వల్ల గ్రామీణ ప్రజలు కష్టాల్లో పడ్డారు. మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ వంటి వెనుకబడిన జిల్లాల్లో నీటి సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఇది తెలంగాణకు ఎదురైన ఆర్థిక సమస్య కాదని, తీరని అన్యాయమని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. కేంద్రం పెండింగ్ నిధులు వెంటనే రిలీజ్ చేయాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికలు సకాలంలో నిర్వహించి, ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు మరింత వెనుకబడతాయని, ఇది రాష్ట్ర ప్రజలకు మరింత అన్యాయం చేయడమే అవుతుందని హెచ్చరిస్తున్నారు.


