హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): ఔటర్ రింగ్ రోడ్డులో టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (టీఓటీ)లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లో అందుకు తగిన ఆధారాలు చూపకపోవడంపై రాష్ట్ర హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసిన గడీల రఘువీర్‌రెడ్డిని ఆరోపణలకు ఆధారాలు ఏవి? అని ధర్మాసనం ప్రశ్నించింది.
సమాచార హకు చట్టం కింద అధికారుల నుంచి వివరాలు సేకరించారా? అని నిలదీసింది. పిల్ ఏ విధంగా దాఖలు చేశారని, మీరు ఏ హోదాలో పిటిషన్ వేశారని ప్రశ్నించింది. సామాజిక కార్యకర్త హోదాలో పిల్ దాఖలు చేసినట్టు జవాబు చెప్పడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. పిల్‌పై విచారణ అవసరం లేదని విచారణ ముగిస్తున్నామని చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్ కుమార్ ధర్మాసనం ప్రకటించింది. దేశంలో పిల్ దాఖలు చేసే విధానాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వ్యాఖ్యానించింది.