హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): ‘షాబాద్ మారణకాండపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాధ్యత వహించాలి. వైకారియస్ లయబిలిటీ సూత్రం ప్రకారం ఆయనపై చర్యలు ఉండాలి’ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ప్రజాధనంతో విలాసవంతమైన భవనాల్లో ఉంటూ, కనీసం మహిళలు, చిన్నారుల భద్రతను పర్యవేక్షించలేకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఈ ఘటన ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని, పోలీస్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ అమానుషం జరిగిందని ఆదివారం ఎక్స్ వేదికగా ఆరోపించారు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులు.. సీఎం రేవంత్‌రెడ్డి బందోబస్తులోనా? లేదా భూ దందాల పర్యవేక్షణలోనో? బిజీగా ఉన్నారా? అని నిలదీశారు.
‘ఈ కేసులో నిందితుడిని వెంటనే అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు ఎందుకు హాజరుపర్చలేదు? అతడిని అరెస్టు చేయకుండా నిరోధించిన కారణాలేంది’ అని ప్రశ్నించారు. బాధితురాలు, ఆమె తల్లి, మామ వాంగ్మూలాలను 164 సీఆర్పీసీ ప్రకారం మెజిస్ట్రేట్ ఎందుకు నమోదు చేయలేదని పేర్కొన్నారు. నిందితుడికి బెయిల్ ఇస్తున్నట్టు బాధితురాలు, ఆమె తల్లి, మామకు తెలిపారా?, నిందితుడి బెయిల్ రద్దు చేయించడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ సలహా ఎందుకు తీసుకోలేదు? అని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనపై స్పందించిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, బాధ్యతారహితంగా వ్యవహరించిన సబ్ ఇన్స్పెక్టర్ టీ రమేశ్‌ను సస్పెండ్ చేశారని, కేవలం చార్జ్ మెమో జారీచేసిన షాబాద్ ఇన్స్పెక్టర్ బీ కంఠారెడ్డిని కూడా ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ నేతృత్వంలో నెలకు ఎన్నిసార్లు పోక్సో కేసులపై సమీక్షలు జరుపుతున్నారో? చెప్పాలని పేర్కొన్నారు.
పోక్సో కేసుల పర్యవేక్షణలో పోలీసుల విఫలం
పోక్సో కేసుల పర్యవేక్షణలో ఏసీపీ, డీసీపీ, చివరకు సీపీ, డీజీపీ స్థాయి పోలీస్ అధికారులు విఫలమయ్యారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. మహిళా భద్రతపై సమీక్షలు కేవలం కాగితాలకే పరిమితమా అని ప్రశ్నించారు. నిందితుడిని పట్టుకొన్న తర్వాత కేవలం జ్యుడీషియల్ కస్టడీకి పంపి, ఆ తర్వాత ‘దైవ కస్టడీ’ (ఎన్కౌంటర్) పేరుతో ప్రజాగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నం చేయడం పోలీసుల బాధ్యతారాహిత్యాన్ని కప్పిపుచ్చలేదని విమర్శించారు.