హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): సచివాలయం ఎదుట రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తామన్న ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. ఉమ్మడి రాష్ట్ర సచివాలయంలో తెలుగుతల్లి విగ్రహం ఉన్నచోట తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు అదే అసలైన ప్రతీక అవుతుందని గతంలో కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకున్నది. అయితే ఆ ప్రతిపాదిత స్థలంలో రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆక్షేపించింది. తెలంగాణ తల్లి విగ్రహం మినహా మరేది అక్కడ ఏర్పాటు చేసినా ఊరుకునేది లేదని హెచ్చరించింది. తెలంగాణ మేధో సమాజం కూడా సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకింది.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ప్రతీకలో ప్రధానమైన తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు విషయంలో రేవంత్‌రెడ్డి ప్రజాభీష్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మేధావులు, కవులు, కళాకారులు, పాత్రికేయులు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీకి లేఖ రాశారు. ప్రధానప్రతిక్షమే కాకుండా రాష్ర్టాన్ని సాధించిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్న వ్యతిరేకత, మరోవైపు తెలంగాణ బుద్ధిజీవుల నుంచి వస్తున్న విమర్శల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు మంగళవారం రేవంత్‌రెడ్డి నష్టనివారణ చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటిదాకా ‘జై తెలంగాణ’ అనని, తెలంగాణ తల్లిని తలవని రేవంత్‌రెడ్డికి తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు ఆగమేఘాలపై ఒకటికి రెండుసార్లు సచివాలయంలో స్థల పరిశీలన చేశారు.
అల్టిమేటం జారీ చేసిన 24 గంటల్లోనే
తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు విషయంలో ప్రభుత్వానికి బీఆర్ఎస్ అల్టిమేటం జారీచేసిన 24 గంటల్లోనే రేవంత్ సర్కారు దిగొచ్చింది. మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయ ప్రాంగణాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో కలిసి వేర్వేరుగా రెండుసార్లు స్థల పరిశీలన చేశారు. రేవంత్‌రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజుల్లోనే జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ విభాగం మాజీ ప్రొఫెసర్ నేతృత్వంలో కమిటీ వేశారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా విగ్రహ ఏర్పాటు ఊసేలేదు. ఇపుడు బీఆర్ఎస్ హెచ్చరికల నేపథ్యంలో సర్కారులో చలనం వచ్చింది.