హైదరాబాద్, జూన్ 15(నమస్తే తెలంగాణ): రైతుల మేలు కోసం మాజీ సీఎం కేసీఆర్ చేసిన పనులు ఫలితాన్నిస్తున్నాయి. నాడు రైతులను సంఘటితం చేసేందుకు, వ్యవసాయ నూతన విధానాలను వారికి చేరవేసేందుకు ఆయన నిర్మించిన రైతు వేదికలు ఇప్పుడు వారికి మేలు చేస్తున్నాయి. ఇప్పుడా వేదికల్లో కాంగ్రెస్ సర్కారు పండగ చేస్తున్నది. 1,304 రైతు వేదికల్లో రైతునేస్తం కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శాస్త్రవేత్తలు, అధికారులు రైతులకు సాగు మెళకువలు, సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి సీఎం రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
బీఆర్ఎస్ హయాంలోనే ప్రారంభం
వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ సర్కారు గతంలోనే ప్రారంభించింది. తొలిదశలో 130 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాన్ని కల్పించింది. ప్రతి రైతు వేదికలో టీవీ, నెట్ కనెక్షన్ కల్పించి రైతులకు వీడియో సందేశం ద్వారా సూచనలు, సలహాలను అందించడం ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని 2,061 రైతువేదికల్లోనూ అమలు చేయాలని నిర్ణయించి కార్యాచరణ కూడా ప్రారంభించింది. అయితే అంతలోనే ఎన్నికలు రావడం, కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రావడంతో అది నిలిచిపోయింది. నాటి బీఆర్ఎస్ ప్రణాళికను ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు అమలు చేస్తున్నది.
పైసా లేకున్నా ఫంక్షన్ మాత్రం ఘనంగా
సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించబోయే రైతునేస్తం కార్యక్రమానికి సంబంధించి అన్ని రైతువేదికల్లో ఘనంగా ఏర్పాట్లు చేయాలని ఏఈవోలకు ఆదేశాలు వెళ్లాయి. ప్రతి రైతు వేదికలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, వందల సంఖ్యలో రైతులను సమీకరించాలని, వీడియో కాన్ఫరెన్స్ వీక్షించేలా టెంట్లు, కుర్చీలు ఏర్పాటు చేయాలని, కార్యక్రమానికి వచ్చిన రైతులకు తాగునీరు, టీ వంటి ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీచేశారు. అంతా బాగానే ఉన్నా ఇందుకోసం ఏఈవోలకు నయా పైసా కూడా ఇవ్వలేదు. నిధులు ఇవ్వకుండా ఏర్పాట్లు మాత్రం ఘనంగా ఉండాలంటే ఎలా అని ఏఈవోలు ప్రశ్నిస్తున్నారు. దీంతో స్పందించిన వ్యవసాయ శాఖ మొక్కుబడిగా ప్రతి రైతు వేదికకు రూ. 5 వేల చొప్పున కేటాయించినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి ఆదివారం రాత్రి సర్క్యులర్ జారీచేసింది. అయితే ఈ నిధులను ఎప్పుడు విడుదల చేస్తామనే అంశంపై మాత్రం స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. దీంతో సోమవారం నాటి ఖర్చులను ఏఈవోలే తమ జేబుల్లోంచి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రైతులకు ఒక వేదిక ఉండాలనే
గ్రామాల్లో రైతులను ఒక చోట చేర్చి వారికి వ్యవసాయ సంబంధిత అంశాలు వివరించేందుకు సరైన వేదిక కరువైంది. ఈ పరిస్థితుల్లో రైతులకు ఒక వేదిక కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా రైతువేదిక పేరుతో ప్రాంగణాల నిర్మాణాన్ని చేపట్టారు. ప్రతి ఐదువేల ఎకరాలను ఒక క్లస్టర్‌గా విభజించి ప్రతి క్లస్టర్‌కు ఒక రైతువేదిక చొప్పున 2,601 రైతు వేదికల్ని నిర్మించారు. ఒక్కో రైతు వేదిక కోసం రూ. 22 లక్షల చొప్పున రూ. 572 కోట్లు వెచ్చించారు. దీంతో పాటు ప్రతి క్లస్టర్‌కు ఒక ఏఈవోను నియమించి వ్యవసాయ సేవల్ని రైతులకు మరింత చేరువ చేసే ప్రయత్నం చేశారు.