Congress Govt | హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): పోలీసు స్థలాలపై రేవంత్ సర్కారు కన్ను పడింది. నగరం నడిబొడ్డు నుంచి ఆర్మ్డ్ రిజర్వు ఫోర్స్ హెడ్ క్వార్టర్స్‌ను తరలించే ప్రయత్నం జరుగుతున్నదన్న వార్తలు వినిపిస్తున్నాయి. గోషా మహల్‌లోని పోలీస్ స్టేడియాన్ని ఉస్మానియా దవాఖాన కోసం తీసుకుంటున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం, ప్రజా ప్రయోజనాలను బూచిగా చూపి మిగతా స్థలాలను కూడా తీసుకునేందుకు స్కెచ్ వేస్తున్నట్టు తెలిసింది. అంబర్‌పేటలో సిటీ పోలీసులకు సంబంధించిన సుమారు 200 ఎకరాలు, పాతబస్తీలోని పేట్లబురుజులో ఉన్న సిటీ ఆర్మ్డ్ రిజర్వు(కార్) హెడ్ క్వార్టర్స్‌కు సంబంధించిన సుమారు 40 ఎకరాలకుపైగా ఉన్న స్థలాలను కూడా ఖాళీ చేయించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఫోర్త్ సిటీ అభివృద్ధి పేరిట వీటన్నింటినీ అక్కడికి తరలించి, నగరంలోని స్థలాలను ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టేందుకు భారీ స్కెచ్ వేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
నగరంలో శాంతి భద్రతల సమస్యలు, ఇతరత్రా అల్లర్లు జరిగినప్పుడు నిమిషాల వ్యవధిలో రిజర్వు ఫోర్స్ దిగేలా గతంలోని ప్రభుత్వాలు నగరం నడిబొడ్డున ఆర్మ్డ్ రిజర్వు ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేశాయి. అంబర్‌పేటలోని సీపీఎల్ గ్రౌండ్లో పోలీస్ ట్రైనింగ్ కాలేజీ, స్పెషల్ ఆర్మ్డ్ రిజర్వు ఫో ర్స్, స్పెషల్ సివిల్ పోలీస్, రాచకొండ పోలీస్ కమిషనరేట్‌కు సంబంధించిన ఆర్మ్డ్ రిజర్వు ఫోర్స్, జిల్లా పోలీసు దవాఖాన, ఈస్ట్‌జోన్ డీసీపీ కార్యాలయం ఇలా పలు విభాగాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడున్న పోలీస్ ట్రైనింగ్ కాలేజీని మేడ్చల్‌కు పూర్తిస్థాయిలో తరలించి, దానికున్న 20 ఎకరాలను ప్రభుత్వం స్వాధీ నం చేసుకునేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమైనట్టు సమాచారం. ఇటు సిటీ ఆర్మ్డ్ ఫోర్స్, అటు రాచకొండ ఆర్మ్డ్ ఫోర్స్, స్పెష ల్ ఫోర్స్ ఇక్కడ ఉంటాయి. 1991కి ముందు నగరంలో మతకలహాలు భారీగా జరిగాయి. ఈ సమయంలో క్షేత్రస్థాయిలో పనిచేసే లా అండ్ ఆర్డర్ పోలీసులకు తోడుగా ఆర్మ్డ్ రిజర్వు ఫోర్స్ క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకుంటూ గొడవలను ఎప్పటికప్పుడు అదుపు చేసేవి. పేట్లబురుజు హెడ్ క్వార్టర్స్ ఓల్డ్‌సిటీలో ఉండడంతో పరిసర ప్రాంతాల్లో జరిగే గొడవలను అదుపు చేయడానికి అక్కడి నుంచి ఆర్మ్ డ్ రిజర్వు ఫోర్స్ వచ్చేది. 2003లో రంగారెడ్డి జిల్లాలో నుంచి శివారు ప్రాంతాలను కలుపుతూ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌ను ఏర్పాటు చేశారు, ఆ సమయంలో సైబరాబాద్ ఆర్మ్డ్ రిజర్వు ఫోర్స్‌కు అంబర్‌పేటలోని సీపీఎల్ గ్రౌండ్లో కొంత స్థలాన్ని కేటాయించారు. అంబర్‌పేట నుంచి అప్పుడు సైబరాబాద్ కమిషనరేట్‌లో ఏవైనా గొడవలు జరిగితే క్షణాల్లో ఇక్కడి నుంచి ఫోర్స్‌ను దింపేందుకు ఈజీగా ఉండేది. 2016లో సైబరాబాద్‌ను సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లుగా విభజించారు. అంబర్‌పేటలోని ‘కార్’ హెడ్ క్వార్టర్స్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ కిందకు వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం శాంతి భద్రతలను పటిష్ఠంగా నిర్వహించడంతో ఉమ్మడి కమిషనరేట్ల పరిధిలో ఎలాంటి మత కలహాలకు తావులేకుండా పోయింది.
మలక్‌పేట్‌లో ఉన్న హైదరాబాద్ రేస్‌క్లబ్‌ను కూడా ఫోర్త్‌సిటీ, శంషాబాద్ ప్రాంతానికి తరలించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. అయితే ఇందుకు రేస్‌క్లబ్ యాజమాన్యం అంగీకరించాల్సి ఉంటుంది. 1961లో హైదరాబాద్ రేస్‌క్లబ్ మలక్‌పేట్‌లో సుమారు 130 ఎకరాల వరకు భూమిని కొనుగోలు చేసింది. ఇక్కడ గుర్రపు పందేలు నిర్వహించడంతో పాటు శిక్షణ కూడా ఇస్తుంటారు. సిబ్బందికి క్వార్టర్స్ కూడా ఏర్పాటు చేసింది. క్రమంగా నగరం అభివృద్ధి చెందడంతో ఇప్పుడు నగరం నడిబొడ్డులోకి రేస్‌కోర్సు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ స్థలాన్ని ప్రభుత్వం తీసుకొని దీనికి బదులుగా మరో ప్రాంతంలో రేస్కోర్సుకు స్థలాన్ని కేటాయించాలని భావిస్తున్నది. ఈ స్థలం అభివృద్ధిని కూడా ప్రైవేటు సంస్థలకు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ప్రభుత్వం మాత్రం ఇక్కడ పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని చెప్తున్నప్పటికీ అసలు విషయం అదికాదని సమాచారం.