నీళ్లు.. అనేది తెలంగాణ ఉద్యమ ప్రథమ నినాదం.. దాన్ని సాక్షాత్కరింపజేసిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదిన్నరేండ్లపాటు సాగునీటి రంగానికి తన ప్రభుత్వంలో అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో కరువుతో కునారిల్లిన తెలంగాణలో కరువు అనే మాటే వినిపించవద్దనే మహత్తర లక్ష్యంతో, తెలంగాణ సోయితో, అనేక ప్రణాళికలను రూపొందించి అమలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో నిర్మించి, అనేక ప్రాజెక్టులను పూర్తి చేసి, రాష్ట్ర సాగునీటి రంగ ముఖచిత్రాన్నే మార్చేశారు.
దశాబ్దాలుగా తరలిపోయిన కృష్ణా, గోదావరి నీళ్లను తెలంగాణ బీళ్లకు మళ్లించారు. రైతుల చిరకాల స్వప్నాన్ని సాకారం చేశారు. తద్వారా బీఆర్ఎస్ పాలన రాష్ట్ర సాగునీటిరంగంలో స్వర్ణయుగంగా నిలిచింది. తెలంగాణ సాగునీటి రంగం ఓ కొలిక్కి చేరుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పరిస్థితి మొత్తం తలకిందులైంది. రాష్ట్ర సాగునీటి రంగ అభివృద్ధి కుంటుపడింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ తెలంగాణ జీవధార అయిన కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగానే పడావు పెట్టింది. ప్రాధాన్యతగా ఎంచుకున్న ప్రాజెక్టుల పనులకు సైతం దిక్కులేకుండా పోయింది. చివరిదశలో ఉన్న ప్రాజెక్టులను కూడా పూర్తి చేయకుండా పనులు నిలిపివేసింది. వెయ్యి రోజుల్లో ఒక్క ప్రాజెక్టుకూ అనుమతులు సాధించకపోగా, డీపీఆర్‌లను వాపస్ తీసుకువచ్చింది. ఇన్చార్జీలు, విరమణ పొందిన అధికారులతో పాలన కొనసాగిస్తున్నది. అన్నింటికీ మించి రాష్ట్ర జలహక్కులను పొరుగురాష్ర్టాలకు తాకట్టుపెడుతున్నది. హక్కుగా రావాల్సిన కృష్ణా, గోదావరి జలాలను పొరుగు రాష్ర్టానికి ధారాదత్తం చేస్తూ తెలంగాణ రైతాంగం నోటికాడి బుక్కను ఎత్తగొట్టింది.
మోసం-1
దోని సప్పుడే గానీ..
‘దోని సప్పుడే గానీ దొయ్యపారింది లేదు’ అనేది నానుడి. ప్రస్తుతం రాష్ట్రంలోని సాగునీటి రంగం పరిస్థితి అచ్చం అలానే తయారైంది. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు సాగునీటిరంగానికి సంబంధించి అనేక హామీలు గుప్పించింది. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికింది. కానీ ప్రభుత్వమే ప్రాధాన్యతగా ఎంచుకున్న వాటికి కూడా దిక్కులేకుండా పోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని వాగ్దానం చేసింది. ప్రాధాన్యతా క్రమంలో ‘ఏ’ కేటగిరీలోని 6 ప్రాజెక్టులను 2025 మార్చినాటికి పూర్తిచేసి మొత్తంగా 5.84 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది.
అలా ఏటా 6 లక్షల చొప్పున ఐదేండ్లలో 30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందిస్తామని బీరాలు పలికింది. కానీ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 50,111 ఎకరాలకు, 2025-26లో మరో 50,413 ఎకరాల ఆయకట్టుకు నీరందించినట్టు ప్రభుత్వ గణాంకాలే చెప్తున్నాయి. అంటే వెయ్యిరోజుల పాలనలో 10.21 లక్షల ఎకరాలకు గాను సాధించింది లక్ష ఎకరాలే కావడం గమనార్హం. అంటే లక్ష్యంలో 10 శాతం మాత్రమే చేరుకున్నది. మరోవైపు 30 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని విధించుకున్న లక్ష్యాన్ని సైతం 15.26 లక్షలకే కుదించుకున్నది.
మోసం-2
కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్ష

అధికారంలోకి వచ్చింది మొదలు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్ష సాధిస్తున్నది. మేడిగడ్డలో ఒక్క పిల్లరు ఘటనను సాకుగా చూపి విచారణలకే పరిమితమైంది. గోదావరి బేసిన్‌లోని ప్రధాన రిజర్వాయర్లేవీ ఈ సీజన్లో నిండలేదు. మరోవైపు ప్రాణహిత నుంచి మేడిగడ్డ మీదుగా ఇప్పటివరకు దాదాపు 300 టీఎంసీలకుపైగా జలాలు దిగువకు తరలిపోయాయి. ఆ జలాలను ఎత్తిపోసేందుకు కావాల్సిన వ్యవస్థలన్నీ సిద్ధంగానే ఉన్నాయి. కన్నెపల్లి పంపులను ఆన్‌చేస్తే ప్రాణహిత జలాలను ఒడిసిపట్టవచ్చు. తద్వారా రైతాంగానికి సాగునీటిని అందించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకు కావాల్సిన నీటిసరఫరా వ్యవస్థ మొత్తం సిద్ధంగా ఉన్నది. నీటిని ఎత్తిపోసుకోవచ్చని విశ్రాంత ఇంజినీర్లు, సాగునీటిరంగ నిపుణులు సైతం ప్రభుత్వానికి సూచించారు. నీటినిర్వహణ, ఎత్తిపోతల అంశం పూర్తిగా రాష్ట్రప్రభుత్వానిదేనని ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) సైతం తేల్చిచెప్పింది. అయినా రేవంత్ ప్రభుత్వం పంపులను ఆన్ చేయకుండా మొండికి పోయి క్రాప్‌హాలిడే ప్రకటించింది. జలాలను దిగువకు వదిలేస్తున్నది.
మోసం-3
చెరువుల గండ్లూ పూడ్చలే
రాష్ట్రంలోని పలు సాగునీటి ప్రాజెక్టులు, ఆనకట్టలు, కాలువలకు సంబంధించి చేపట్టిన మరమ్మతులు, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) పనులు అడుగు కూడా కాంగ్రెస్ పాలనలో ముందుకు పడని దుస్థితి. ప్రాజెక్టుల్లో సత్వరమే చేపట్టాల్సిన ఎమర్జెన్సీ పనులను చిన్న కాంట్రాక్టర్లు నిర్వహిస్తుంటారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఓఅండ్ఎం పనులు మందకొడిగా సాగుతున్నాయని క్షేత్రస్థాయి ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు స్పష్టంచేస్తున్నారు.
జూరాల ప్రాజెక్టు గేట్లకు సంబంధించి రోప్ వైర్లు తెగిపోయిన ఘటన మరువక ముందే.. మంజీరా ప్రాజెక్టు ఆఫ్రాన్ దెబ్బతిన్న ఘటన వెలుగుచూసింది. ఇటీవలే పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయింది. ఇవే కాదు రేలంపాడు, కుమ్రం భీం తదితర మరికొన్ని ప్రాజెక్టులపైనా రిపోర్టులు వచ్చినా ప్రభుత్వంలో చలనం లేకుం డా పోయింది. నిరుడు కురిసిన భారీ వర్షాలతో అనేక చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయి. ప్రాజెక్టుల స్లూయిస్‌లు, గేట్లు దెబ్బతిన్నాయి. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల మెయింటెనెన్స్ పనులు నిర్వహించాల్సి ఉన్నది. ఆయా ప్రాజెక్టుల మరమ్మతులకు రూ.200 కోట్లతో అంచనాలు రూపొందించారు. కానీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకొన్నారు. వెయ్యిరోజుల కాంగ్రెస్ పాలనలో కనీసం చెరువుల గండ్లను కూడా పూడ్చని దుస్థితి నెలకొన్నది.
మోసం-4
పాలమూరు-రంగారెడ్డిపై వివక్ష

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు సాగు, తాగునీటిని అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం 2015లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేసింది. 90 టీఎంసీల జలాలను ఎత్తిపోయడం ద్వారా పాలమూరులో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, దాదాపు 1,234గ్రామాలకు తాగునీరివ్వడం లక్ష్యం. ప్రాజెక్టును 18 ప్యాకేజీలుగా విభజించి పనులను ప్రారంభించింది. 65.17 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 5 రిజర్వాయర్ల (నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండాపూర్) పనులు దాదాపుగా పూర్తి చేసింది. నార్లాపూర్ నుంచి ఏదులకు నీటిని తరలించే 8 కిలోమీటర్ల కాలువలో 2.5 కిలోమీటర్ల మేర పనులు మాత్రమే అప్పటికి పెండింగ్‌లో ఉన్నాయి.
ఆ కొద్దిపాటి పనులు పూర్తిచేస్తే నార్లాపూర్ నుంచి కరివెన వరకు జలాలను తరలించేందుకు కావాల్సిన అన్నిపనులు అప్పటికే పూర్తయ్యాయి. కానీ కాంగ్రెస్ వచ్చాక ఎక్కడి పనులను అక్కడే పడావు పెట్టింది. తొలుత సాగునీటి కాలువల టెండర్లను రద్దు చేసింది. ఆ తర్వాత కొద్దిపనులను పూర్తిచేయకుండా, నిధులివ్వకుండా, కనీసం మోటర్లు ఆన్ చేసేందుకు కరెంటు బిల్లులను కూడా చెల్లించకుండా ప్రాజెక్టును పడావు పెడుతూ వస్తున్నది. అదేమంటే ‘నీటిని ఎత్తి ఎక్కడపోయాలె’ అని ప్రశ్నించింది. విచిత్రంగా అదే ప్రభుత్వం ఇటీవల వెట్న్ నిర్వహించింది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో చేపడుతున్న కొడంగల్- నారాయణపేట లిఫ్ట్‌కు మాత్రం నిధుల వరద పారిస్తూ, ఇబ్బడిముబ్బడిగా అంచనాలను పెంచుతూ పనులు కొనసాగిస్తున్నది.
మోసం-5
ఒక్క ప్రాజెక్టు అనుమతీ రాలే పాత అనుమతులు సైతం వాపస్
అనుమతులు వచ్చినవి: 0, డీపీఆర్ వెనక్కి వచ్చినవి: 3
ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధిత కేంద్ర సంస్థల నుంచి అనుమతులు తప్పనిసరి. రాష్ట్ర జలహక్కులకు అవి శ్రీరామరక్ష. కాంగ్రెస్ వచ్చేనాటికి బీఆర్ఎస్ ప్రభుత్వం గోదావరి, కృష్ణా బేసిన్లను కలుపుకొని మొత్తంగా 11ప్రాజెక్టుల డీపీఆర్‌లను కేంద్రానికి సమర్పించింది. అందులో కాళేశ్వరంతోపాటు, చిన్నకాళేశ్వరం, చౌటుపల్లి హనుమంతరెడ్డి, చనాక-కొరాట, గూడెం ఎత్తిపోతలు, మోడికుంటవాగు ప్రాజెక్టుల అనుమతులను విజయవంతంగా తీసుకొచ్చింది. కాంగ్రెస్ వచ్చేనాటికి కేంద్రం వద్ద సీతమ్మసాగర్ మల్టీపర్పస్, సమ్మక్కసాగర్, పాలమూరు రంగారెడ్డి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వార్ధా ప్రాజెక్టు, కాళేశ్వరం 3వ టీఎంసీకి సంబంధించిన డీపీఆర్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. అందులో సీతమ్మసాగర్ ప్రాజెక్టు తుది అనుమతులు ఇటీవల వచ్చాయి. అందులోనూ కాంగ్రెస్ చేసిన కృషి ఏమీలేదు. ఇక మిగతా వేటికీ అనుమతులు రాకపోగా, పాలమూరు, వార్ధా, కాళేశ్వరం 3వ టీఎంసీ డీపీఆర్‌ను సీడబ్ల్యూసీ ఏకంగా తిప్పిపంపింది. ఛత్తీస్‌గఢ్ నుంచి ఎన్వోసీ తీసుకువస్తే సమ్మక్కసాగర్ బరాజ్ అనుమతులు వచ్చే అవకాశమున్నా కనీసం అదీ కాంగ్రెస్ సర్కార్ సాధించడం లేదు.

మోసం-6
జలహక్కులకూ తీరని విద్రోహం
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం 90 టీఎంసీల జలాలను కేటాయించింది. 7 కేంద్ర విభాగాల నుంచి అనుమతులూ సాధించింది. కాంగ్రెస్ నిర్లక్ష్యంతో చివరి దశలో డీపీఆర్‌ను సీడబ్ల్యూసీ పక్కన పెట్టింది. ప్రాజెక్టుకు కేటాయించిన 90 టీఎంసీల జలాలను సైతం ఇటీవల కాంగ్రెస్ సర్కార్ 45 టీఎంసీలకే కుదించింది. కేవలం 45 టీఎంసీలతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులివ్వాలని కోరుతూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. సర్కార్ తప్పుడు నిర్ణయాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిలదీయడంతో కాంగ్రెస్ వెనుకడుగు వేసింది. ప్రాజెక్టుకు 90 టీఎంసీలతో అన్ని అనుమతులను సత్వరమే ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీలో ఏకీగ్రీవంగా తీర్మానించింది. రాజీవ్‌భీమా లిఫ్ట్ స్కీమ్‌కు 20 టీఎంసీల నికర జలాల కేటాయింపు ఉన్నది. రేవంత్‌రెడ్డి సర్కార్ సాగునీటికి అందుబాటులో ఉన్న 16.94 టీఎంసీల్లో 7.33 టీఎంసీలను కోత విధించింది. ఆ జలాలను నారాయణపేట- కొడంగల్ లిఫ్ట్‌కు కేటాయించింది. వెరసి భీమా నీటి కోటా 10 టీఎంసీల కంటే తక్కువకే పరిమితమైంది.
మోసం-7
ఇన్చార్జుల పాలనలో ఇరిగేషన్
ఇరిగేషన్‌శాఖ మొత్తంగా ఇన్చార్జు లు, ఏపీ స్థానికత ఉన్న అధికారుల కనుసన్నల్లోనే కొనసాగుతున్న పరిస్థితి. ఇరిగేషన్‌శాఖలో ఎలాంటి ఎక్స్టెన్షన్లను ఇవ్వబోమని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో ఆ హామీకి మడతేసింది. అందుకు విరుద్ధంగా ఎక్స్టెన్షన్లను కొనసాగిస్తూ, ఇన్‌చార్జులతోనే నిర్వహిస్తున్నది. సీనియర్ ఇంజినీర్లకు తీరని ద్రోహాన్ని తలపెడుతున్నది. దీనివల్ల అనేక మంది సీనియర్ ఇంజినీర్లు నష్టపోతున్నారు. ఈఈ, ఎస్ఈ, సీఈలుగానే ఉద్యోగ విరమణ పొందుతున్నా రు. ఇప్పటికీ ఏఈఈ నుంచి డీఈఈ, డీఈఈ నుంచి ఈఈకి సంబంధించి ప్రమోషన్ల ప్రక్రియ పూర్తికాలేదు. అనేక చోట్ల సీనియర్లను వదిలి జూనియర్లకు ఇన్చార్జీ బాధ్యతలను ప్రభుత్వం కట్టబెట్టింది.
మోసం-8
సమీక్షలకే సర్కార్ పరిమితం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిసహా, సాగునీటిశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రులు జిల్లాల వారీగా, ప్రాజెక్టులవారీగా సమీక్షల మీద సమీక్షలు చేస్తున్నారే తప్ప ఆచరణలో నిధులు మాత్రం విడుదల చేయడం లేదు. బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయిన సదర్మాట్ బరాజ్‌ను ప్రారంభించాలని ఏడాదిన్నర క్రితం నిర్ణయించినా ఇప్పటికీ ప్రారంభించలేదు. ఎస్సెల్బీసీ క్షేత్రస్థాయి పరిస్థితులపై అధ్యయనం చేయకుండానే పనులను మొదలుపెట్టగా, ఆ వెంటనే సొరంగం కూలిపోయింది. 8 మంది కార్మికులు గల్లంతయ్యారు. ఇప్పటికీ ఆరుగురి మృతదేహాలను కూడా కాంగ్రెస్ సర్కార్ బయటకు తీసుకురాలేదు.
మోసం-9
మన నీళ్లు పొరుగు రాష్ర్టానికి ధారాదత్తం

వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో సాధించిన మరో ఘనత ఏందంటే తెలంగాణ జలాలను పొరుగు రాష్ర్టానికి ధారాదత్తం చేయడం. రాష్ట్ర ఏర్పాటు నుంచీ నాగార్జున సాగర్ డ్యామ్ తెలంగాణ, శ్రీశైలం డ్యామ్ ఏపీ నియంత్రణలో ఉన్నాయి. ఆ ప్రాజెక్టుల నిర్వహణ, మరమ్మతులు, నీటి విడుదల పనులను ఆ రాష్ర్టాలే పర్యవేక్షిస్తున్నాయి. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు అర్ధరాత్రి వేళ అప్రజాస్వామికంగా ఏపీ సర్కార్ నాగార్జున సాగర్ డ్యామ్‌పైకి సాయుధ బలగాలతో తరలివచ్చింది. అక్కడి సీసీ కెమెరాలను ధ్వంసం చేసి, సాగర్ కుడికాలువ హెడ్‌రెగ్యులేటరీ, 13వ నంబర్ వరకు ఉన్న గేట్లను ఆక్రమించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కేంద్ర జల్‌శక్తి శాఖ జోక్యం చేసుకొని సాగర్ డ్యామ్‌పై సీఆర్పీఎఫ్ బలగాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నది.
సాగర్ కుడివైపు హెడ్‌రెగ్యులేటరీ, గేట్ల నిర్వహణను ఏపీ రాష్ట్రమే సొంతంగా కొనసాగించుకుంటున్నది. ఇష్టారీతిన సాగర్ నుంచి కృష్ణా జలాలను తరలించుకు పోతున్నది. డ్యామ్‌ను తిరిగి స్వాధీనం చేసుకోకుండా రేవంత్ సర్కార్ చోద్యం చూస్తున్నది. ఏపీ మాత్రం సాగర్ నుంచి సైతం కృష్ణా జలాలను ఇష్టారీతిన మళ్లించుకుంటున్నది. ఇటీవల కూడా కుడికాలువ గేట్లను తెరిచి నీళ్లు ఎత్తుకుపోయింది. కృష్ణా జలాల వినియోగంలో ట్రిబ్యునల్ కేటాయింపులు పూర్తయ్యేవరకూ 50:50 నిష్పత్తిలో వినియోగించుకుంటామని నాటి బీఆర్ఎస్ సర్కార్ పట్టుబడుతూ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ 66:34 శాతానికి అంగీకరించింది. 19వ కేఆర్ఎంబీ మీటింగ్‌లో సంతకం చేసి తెలంగాణ చేస్తున్న 50:50 నిష్పత్తి డిమాండ్‌కు మంగళం పలికింది.
మోసం-10
కర్ణాటక ప్రాజెక్టులకు ఎన్వోసీ
కర్ణాటక ఇప్పటికే తుంగభద్ర డ్యామ్ దిగువన సాగునీటి అవసరాలకు లిఫ్టులు, తాగునీటి అవసరాల పేరుతో సీడబ్ల్యూసీ, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అనుమతులు లేకుండా పంప్‌హౌస్‌ల నిర్మాణాలను చకచకా చేపడుతున్నది. ఆర్డీఎస్ ఆనకట్టకు ఎగువన దాదాపు 100 మీటర్ల పరిధిలోనే కురిడి డ్రింకింగ్ లిప్టును దాదాపు రూ.85 కోట్లతో చేపడుతున్నది. తుంగభద్రకు వచ్చే వరదల సమయంలో ఆర్డీఎస్ బ్యాక్ వాటర్ నుంచి 60 రోజుల పాటు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం లక్ష్యం. ఆర్డీఎస్కు 15 కి.మీ ఎగువన చిక్కాలపర్వి వద్ద రూ.397.50 కోట్లతో 2.5 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో రోడ్డు కమ్ బరాజ్ నిర్మాణానికి కర్ణాటక సిద్ధమైంది.
ఇక ఆర్డీఎస్ దిగువన రాయచూరు జిల్లాలోని చికమంచాల సమీపంలో బ్రిడ్జి కమ్ బరాజ్ 5 టీఎంసీలతో కట్టాలని నిర్ణయించింది. మొత్తంగా రెండు బరాజ్‌ల ద్వారా 7.5 టీఎంసీలు, కురిడి లిఫ్ట్ ద్వారా మరో 2 టీఎంసీలు వినియోగించుకునేందుకు పనులు చేస్తున్నది. ఆర్డీఎస్ను ప్రశ్నార్థకంగా మార్చే ఈ ప్రతిపాదనలను వ్యతిరేకించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు భిన్నంగా, గుట్టుగా ఎన్వోసీ (నిరభ్యంతర పత్రం) జారీ చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌కు సాగునీటిని అందించేందుకే ఆర్డీఎస్ను పణంగా పెట్టారనే ఆరోపణలున్నాయి.
మోసం-11
‘నల్లమలసాగర్’కూ రేవంత్ సై!
ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా గోదావరి జలాలను చెరబట్టేందుకు చేపడుతున్న పోలవరం-బనకచర్ల లింకు ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం బేషరతుగా వ్యతిరేకించాల్సింది పోయి చర్చలకు ఉత్సాహం చూపుతున్నది. గోదావరి- కావేరి లింకు ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు రేవంత్ సర్కార్ మొదటి నుంచీ వంత పాడుతున్నది. తొలుత వెయ్యి టీఎంసీలు రాసిస్తే ప్రాజెక్టుకు అభ్యంతరం తెలుపబోమని రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రకటించారు. ఆ తర్వాత ప్రాజెక్టుపై చర్చించేందుకు బాబుకు ఆహ్వానం పలికారు. కేంద్రమంత్రి నేతృత్వంలో చర్చలకు హాజరవడమేగాక, ప్రాజెక్టుపై వివాదాల పరిష్కారానికి కమిటీ ఏర్పాటుకు అంగీకారం తెలిపి వచ్చారు. గుట్టుగా చర్చలు కొనసాగిస్తున్నారు. ఈ నెలలోనూ కీలక చర్చలు కొనసాగనుండగా, ఒప్పందాలకు సిద్ధమైనట్టు విశ్వసనీయ సమాచారం.
మోసం-12
అంతర్రాష్ట్ర జలవిభాగం అస్తవ్యస్తం
ప్రాజెక్టుల పనులకు సంబంధించి సాగునీటిశాఖ పరిధిలోని అంతర్రాష్ట్ర జలవిభాగం అత్యంత కీలకమైంది. నీటి కేటాయింపులు, అనుమతుల సాధన, న్యాయ సమస్యలు, వాటి పరిష్కారం, పొరుగు రాష్ర్టాలతో సంప్రదింపుల అంశాల్లో కీలకభూమిక పోషిస్తుంది. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తున్నది. కృష్ణా ట్రిబ్యునల్‌లో కీలకమైన వాదనలు కొనసాగుతుంటే అవసరమైన నిధులు, సహాయక సిబ్బందిని కూడా సకాలంలో అందివ్వడం లేదని వాపోతున్నారు.
సాగునీటిశాఖకు, అంతర్రాష్ట్ర విభాగానికి సంబంధించి టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ (టీఏసీ)అత్యంత కీలకం. రాష్ట్ర జలహక్కులను పరిరక్షించడం, అందుకు భంగం కలిగేలా పొరుగు రాష్ర్టాలు చేపట్టే ప్రాజెక్టులను నిలువరించేందుకు సలహాలు, సూచనలు ఇవ్వడంలో ఈ కమిటీ అత్యంత క్రియాశీలకంగా పనిచేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఆ కమిటీని నియమించలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇంటర్‌స్టేట్ వ్యవహారాల్లో హైడ్రాలజీ నిపుణులు అత్యవసరం. కానీ ప్రభుత్వం ఇప్పటికీ నియమించలేదు. డీపీఆర్‌ల తయారీ, అనుమతుల సాధనకు, సీడబ్ల్యూసీ లేవనెత్తే అభ్యంతరాలకు సహేతుకమైన వివరణలు ఇచ్చేందుకు ఆ రంగంలో నిపుణుడు అత్యవసరం. బీఆర్ఎస్ హయాంలో అందుకోసం ప్రత్యేకంగా కన్సల్టెంట్‌ను నియమించింది. కానీ కాంగ్రెస్ వచ్చాక ఉన్న కన్సల్టెంట్‌ను తొలగించింది.

మోసం-13
చెక్‌డ్యామ్‌ల పేల్చివేత !
కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యపూరిత వైఖరి వల్లే ఎస్సెల్బీసీ టన్నెల్ కూలిపోయింది. 43.93 కి.మీ ఎస్సెల్బీసీ సొరంగం పనులను శ్రీశైలం ముఖద్వారం నుంచి (ఇన్లెట్) అంటే దోమలపెంట నుంచి, మరోవైపు నల్లగొండ జిల్లా మన్యవారిపల్లె నుంచి టన్నెల్ తవ్వకాన్ని గతంలో ప్రారంభించారు. ఇన్‌లెట్‌లో 13.95 కి.మీ వద్ద 8 మీటర్ల షియర్ జోన్ (వదులైన భూమి) ఉండి భారీ సీపేజీ వస్తున్నది. ప్రమాదకరమైన జోన్ గతంలోనే గుర్తించారు. పూర్తిస్థాయిలో అధ్యయనం చేయించి, నిపుణుల సూచనల మేరకు నివారణ చర్యలు చేపట్టి, సొరంగం పనులను నిర్వహించాల్సి ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అవేవీ చేయకుండా పేరు కోసం హడావుడిగా పనులను చేపట్టింది. దీంతో భారీ సీపేజీ రావడంతోపాటు, అంచనాలు తప్పి సొరంగం కుప్పకూలించింది.
ఫలితంగా 8 మంది కార్మికులు మృతిచెందారు. ప్రస్తుతం టీబీఎం (టన్నెల్ బోరింగ్ మిషన్) విధానంలో కాకుండా, డీబీఎం (డ్రిల్లింగ్ అండ్ బోరింగ్) మెథడ్‌లో పనులను చేపట్టారు. ఫలితంగా ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగింది. ఖమ్మం జిల్లా సీతమ్మసాగర్ ప్రాజెక్టులో భాగంగా రూ.100 కోట్లతో రాజీవ్ లింక్ కెనాల్‌ను నాణ్యత లేకుండా నిర్మించారు. ఫలితంగా కాలువ ఎక్కడికక్కడ కూలిపోతున్న దుస్థితి. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయినా ఇప్పటికీ చర్యలు శూన్యం. ఇక కాంగ్రెస్ వెయ్యిరోజుల పాలనలో వాగులు గుల్లయ్యాయనే చెప్పాలి. ఇసుక దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతున్నది. కరీంనగర్ జిల్లా, జమ్మికుంట మండలం తనుగుల వద్ద మానేరుపై నిర్మించిన చెక్‌డ్యామ్ బాంబులతో పేల్చివేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వంగూరులో చెక్‌డ్యామ్‌ను కూల్చివేశారు. రాష్ట్రంలోని మానేరు, మున్నేరు, ఆకేరు, పాలేరు, స్వర్ణ, పెద్దవాగు, కూడవెల్లి, చలివాగు, నారింజవాగు, బొగ్గులవాగు తదితర అనేక వాగులపై చెక్‌డ్యామ్‌ల్లో ఇసుకను ఇష్టారీతిన తవ్వుతూ వాటి నిర్మాణాలకే ఎసరు తెస్తున్నారు.