హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ)/బన్సీలాల్‌పేట్: బీసీల పట్ల రేవంత్ సర్కారు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ విమర్శించారు. గాంధీ దవాఖానలో ఆమరణ దీక్ష కొనసాగిస్తున్న ఆజాది యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జకలి సంజయ్, హిందూ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల సిద్దేశ్వర్‌ను శనివారం వారు మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుతో కలిసి పరామర్శించారు.
కాంగ్రెస్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో వారు ఏడు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బీసీల పట్ల ఉన్న పక్షపాతానికి నిదర్శనమని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయించేందుకు బీసీలంతా అంతిమ పోరాటానికి సిద్ధం కావాలని బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాంయాదవ్ పిలుపునిచ్చారు.
రాత్రి సంజయ్ ఆరోగ్యం క్షీణించింది. వాంతులు, విరేచనాలతోపాటు స్లైన ఎక్కించిన కుడి చేతికి ఇన్ఫెక్షన్ సోకడంతో ప్రాణానికి ప్రమా దమన్న ఆందోళనతో ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. తెలంగాణ గౌడ సంఘం నేత జైహింద్‌గౌడ్, సోషల్ జస్టిస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పిడికిలి రాజు, వెంకట్‌గౌడ్, అవ్వారు వేణుకుమార్, కొంగర నరహరి పాల్గొన్నారు.