(పిన్నింటి గోపాల్) హనుమకొండ, మే 31(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసి ప్రజల అభ్యున్నతికి పాటుపడాల్సిన కాంగ్రెస్ సర్కార్.. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. భయపెట్టడం, వేధించడమే లక్ష్యంగా పెట్టుకొని ఒక్కో వర్గంపై కక్ష గట్టినట్టు ప్రవర్తిస్తున్నది. రైతులు, ప్రతిపక్ష నేతలే గాక సొంత పార్టీ మంత్రులనూ వదిలిపెట్టని రేవంత్ సర్కార్.. ప్రశ్నించిన ప్రతి వర్గాన్నీ టార్గెట్ చేస్తున్నది. ప్రభుతాన్ని నిలదీస్తే బెదిరించడమే గాక కేసులు బనాయిస్తూ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నది. అంతేగాక ప్రభుత్వంతో సంబంధం లేకుండా పనులు చేసుకుంటున్న వారిని ముఖ్యనేత వదలడం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అడిగినందుకు కళాశాలల యాజమాన్యాల నోరుమూయించింది.
రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన రియల్ ఎస్టేట్ రంగాన్ని బెదిరింపులతో చెప్పుచేతల్లోకి తెచ్చుకున్నది. ఇక ప్రభుత్వ భూములు, చెరువుల కబ్జాలను తొలగించేందుకు తెచ్చామని చెబుతున్న హైడ్రా పూర్తిగా రియల్ వ్యాపారులను బెదిరించడమే లక్ష్యంగా పెట్టుకున్నది. ముఖ్యనేత బృందాన్ని కలిసిన వారిని తప్ప మిగిలిన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు హైడ్రా ఓ వేధింపుల అడ్డాగా మారింది. ఆ తర్వాత తనను గుర్తించలేదనే కారణంతో తెలుగు సినీ పరిశ్రమలోని మెజారిటీ వర్గాన్ని తీవ్రంగా వేధిస్తున్నది. ఇండస్ట్రీలోని ఇద్దరుముగ్గురు పెద్దలను తీవ్రస్థాయిలో వేధించి తన వద్ద వచ్చేలా కేసుల పెట్టి మాట వినేలా చేసుకున్నది. వీళ్లే కాదు.. పోలీసులు, టీచర్లు అన్ని వర్గాలపైనా బెదిరింపులు, వేధింపుల వ్యూహాన్నే ముఖ్యనేత అమలుచేస్తూ అడ్డూఅదుపు లేకుండా వ్యవహరిస్తున్నది.
పేద పిల్లలకు ఉచితంగా ఉన్నత చదువులు చెప్పినందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద ప్రైవేట్ కాలేజీలకు నిధులను చెల్లించాలి. 2008 నుంచి అమలవుతున్న ఈ పథకాన్ని నీరుగార్చేందుకు ముఖ్యనేత బెదిరింపుల వ్యూహాన్ని అమలుచేశారు. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలను బెదిరించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ వర్గాల విద్యార్థులకు ఉచితంగా ఇంజినీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, లా వంటి ఖరీదైన చదువులు దక్కకుండా చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ఏటా సుమారు 14లక్షల మంది విద్యార్థులకు రూ.2,500 కోట్లు అవసరం. కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లింపులు నిలిపివేయడంతో రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ప్రభుత్వం దాదాపు రూ.10వేల కోట్లు బకాయి పడింది. భారీగా నిధులు పెండింగ్‌లో ఉండటంతో కాలేజీల నిర్వహణ భారమై.. నిధుల చెల్లింపులు జరగకుంటే కాలేజీలను మూసి వేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నదని యాజమాన్యాలు తేల్చిచెప్పాయి.
ప్రభుత్వ తీరుకు నిరసనగా తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించాయి. పరిస్థితి చక్కదిద్దేందుకు యాజమాన్యాలకు దశలవారీగా చెల్లింపులు చేసేలా ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ముఖ్యనేత వద్దకు వ్యవహారాన్ని తీసుకువెళ్లింది. చెల్లింపులు అవసరం లేకుండా ముఖ్యనేత ఎప్పటిలాగే బెదిరింపులు, వేధింపుల వ్యూహాన్ని అమ లు చేశారు. యాజమాన్యాలే లక్ష్యంగా అన్ని రకాల కేసులు నమోదు చేసి కాలేజీల ప్రతిష్ఠ దిగజారేలా చేస్తామని హెచ్చరికలు చేశారు. 2026-27 విద్యా సంవత్సరానికి ట్యూషన్ ఫీజులను విద్యార్థులకే చెల్లిస్తామని, కాలేజీలతో సంబంధం లేదని పేర్కొన్నారు. కాలేజీలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోవాలని తేల్చిచెప్పారు. పేద విద్యార్థులను పెద్ద చదువులకు దూరం చేయడంతోపాటు రూ.10వేల కోట్ల బకాయిలను చెల్లించకుండా కాలేజీలను ఇబ్బంది పెట్టేందుకు ఇలా చేశారని యాజమాన్యాలు ఆందోళన వ్యక్తంచేశాయి.
ముఖ్యనేత బెదిరింపులు, వేధింపుల రాజకీయం నుంచి ఎవరికీ మినహాయింపు ఉండటం లేదు. రాజకీయాలతో సంబంధం ఉన్న వారు కాలేజీ యాజమాన్యంలో భాగస్వాములు ఉంటే వారికీ వేధింపులు తప్పడం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులను పూర్తిగా నిలిపివేయడంతో పాటు అనుమతులు, రెన్యువల్ విషయాల్లో వేధింపులకు గురిచేస్తున్నారు. రాజకీయాలతో సంబంధం ఉన్న యాజమాన్యాల జాబితాను సిద్ధం చేసి వారి కాలేజీలకు మనుగుడ లేకుండా చేస్తామని ముఖ్యనేత బృందం హెచ్చరిస్తున్నది. అధికార యంత్రాంగానికి ఈ జాబితా ఇచ్చి ఇంజినీరింగ్, మెడికల్, ఫార్మసీ కోర్సుల నిర్వహణలో ఏటా షెడ్యూల్ ప్రకారం రావాల్సిన అనుమతుల జారీ విషయంలో ఇబ్బందులు పెడుతున్నారు. ప్రతిపక్ష నేతల విషయంలో వేధింపుల రాజకీయం మరింత ఎక్కువగా ఉంటున్నది.
హైదరాబాద్ మహానగరంలోని ప్రభుత్వ భూముల రక్షణ, చెరువుల పరిరక్షణ ప్రధాన లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రా పూర్తిగా పేదలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. బుల్డోజర్తో నిత్యం పేదల ఇండ్లను కూల్చడమే పనిగా పెట్టుకున్నది. ముఖ్యనేత నచ్చని, మెచ్చని రియల్ వ్యాపారులను టార్గెట్ చేయడమే లక్ష్యంగా హైడ్రా పని చేస్తున్నది. బీఆర్ఎస్ హయంలో ప్రపంచ స్థాయి నగరంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ ఇప్పుడు నిత్యం బుల్డోజర్ కూల్చివేతలకు కేంద్రంగా మారింది. హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ రంగాన్ని ముఖ్యనేత స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దశాబ్దాలుగా ఈ రంగంలో ఉన్న వారిలో నచ్చని వారి జాబితాను ముఖ్యనేత బృందం సిద్ధం చేసింది. ఈ జాబితాలోని వారి భూములు, నిర్మాణాల వివరాలు సేకరించడం.. వేధించడం, బెదిరించడం కోసమే హైడ్రా పనిచేస్తున్నది. ఏండ్లుగా ప్రముఖ సంస్థలుగా ఉన్న వాటిని లొంగదీసుకునేందుకు తన వ్యూహాన్ని హైడ్రా ద్వారా అమలుచేస్తున్నారు. ముఖ్యనేత కుటుంబంలోని వారే హైడ్రా ఈ ప్లాన్‌ను స్వయంగా అమలుచేస్తున్నారు.
ప్రభుత్వం బాధ్యతగా నిర్వహించాల్సిన విషయాలను గుర్తుచేసిన ప్రభుత్వ టీచర్లపైనా ముఖ్యనేత స్వయంగా భయపెట్టిన పరిస్థితులు ఉన్నాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవులు, కమ్యుటేషన్ బెనిఫిట్స్, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు, జీపీఎఫ్ బకాయిలు, పీఆర్సీ అమలు చేయాలని ప్రభుత్వానికి గుర్తుచేసిన ఉపాధ్యాయులపై ముఖ్యనేత తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తే వేధింపులు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ స్కూళ్లలో కంటే ప్రైవేట్ స్కూళ్లలోనే నాణ్యమైన విద్య అందుతున్నదని ప్రభుత్వ టీచర్లను హేళన చేశారు.
అధికారంలోకి వచ్చి ఏడాదైనా తనను గుర్తించడంలేదనే ఆక్రోశంతో ముఖ్యనేత.. సినిమా పరిశ్రమపైనా వేధింపుల వ్యూహాన్ని అమలు చేయడం మొదలుపెట్టారు. అందరినీ భయపెట్టేందుకు మొదటగా అగ్రహీరో నాగార్జున కుటుంబానికి చెందిన నిర్మాణాన్ని కూల్చేశారు. ఆ తర్వాత అదే హీరో కుటుంబ సభ్యులపై మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆమెపై అన్ని వర్గాల్లో విమర్శలు వచ్చాయి.

ఈ వ్యవహారాన్ని ముఖ్యనేత అనుకూలంగా మార్చుకున్నారనే విమర్శలున్నాయి. అల్లు అర్జున్ను ఓ వేడుకలో తన పేరు ప్రస్తావించలేదని ముఖ్యనేత తీవ్రస్థాయిలో వేధించారు. సంధ్య థియేటర్లో తొక్కిలాట ఘటనను ఆసరా చేసుకుని బెయిల్ వచ్చినా అల్లు అర్జున్ను ఒకరోజు జైలులో ఉండేలా చేశారనే విమర్శలు ఉన్నాయి. నాగార్జున, అల్లు అర్జున్‌ల ఉదంతం ద్వారా సినిమా రంగం మొత్తానికి సంకేతాలు పంపారనే చర్చ జరిగింది.
ప్రభుత్వం విధిగా ఇవ్వాల్సినవి ఇవ్వకుండా ఇబ్బందిపెట్టినా ఏం మాట్లాడొద్దనే ధోరణితో ముఖ్యనేత వేధింపుల పాలన సాగుతున్నది. తెలంగాణలో ఏక్ పోలీస్ విధానాన్ని అమలుచేయాలని, విధుల వేళల్లో మార్పులు చేసి వారానికి ఓ సెలవు(వీక్లీ ఆఫ్) ఇవ్వాలనే డిమాండ్‌తో స్పెషల్ పోలీస్ బెటాలియన్ కానిస్టేబుళ్లు, వారి కుటుంబాలు చేసిన నిరసనపైనా ముఖ్యనేత వేధింపుల విధానాన్నే అమలు చేశారు. సివిల్ పోలీసుల తరహాలోనే బెటాలియన్ కానిస్టేబుళ్లకు సమాన హోదా, సెలవులు, డ్యూటీ ఉండాలని సహేతుకమైన డిమాండ్‌పైనా ముఖ్యనేత ఉక్కుపాదం మోపారు.

వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించాలనే విజ్ఞప్తిని పట్టించుకోకుండా వారిపై, వారి కుటుంబ సభ్యులపై వేధింపులకు పాల్పడ్డారు. ఉన్నతాధికారుల కుటుంబాల్లో పనులు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన వారిపై కేసులు నమోదు చేయించి అరెస్టులు చేయించారు. బెటాలియన్ కానిస్టేబుళ్లు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేయడం సహించలేని ముఖ్యనేత ఏకంగా 39 మందిని సస్పెండ్ చేయించారు. పోలీసుల భార్యలపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయించి అరెస్టు చేశారు. పోలీసులపై, వారి కుటుంబ సభ్యులపై పెట్టిన కేసుల విషయంలో పునరాలోచన చేయకుండా ఇంకా భయపెట్టేలానే వ్యవహరిస్తున్నది.