రాష్ట్రం కాని రాష్ట్రం! ప్రాంతం కాని ప్రాంతం! చుట్టూ కొండలు, కోనలు, లోయలు! హైదరాబాద్ నుంచి 2000 కిలోమీటర్ల దూరం! ఏడాదిలో 9 నెలలు మంచుతో కప్పబడి ఉండే ప్రాంతం! టూ వీలర్ వెళ్లేందుకూ రోడ్లుండవు! సమీపంలోనే పాకిస్థాన్ సరిహద్దు! అడుగడుగునా వివాదాలు, అడ్డంకులు.. ప్రతికూల
పరిస్థితులతో రెండు దశాబ్దాలుగా ఒక్క జల విద్యుత్తు ప్రాజెక్టు కూడా కట్టలేని దుస్థితి!
ప్రజల ఆందోళనలకు తోడు నవరత్న హోదా గల ఎన్టీపీసీ సైతం అక్కడ ప్రాజెక్టులు సాధ్యం కావని చెప్పింది. మోసర్ బేయర్ అనే కంపెనీ ఒప్పందం కుదుర్చుకొని తీరా వదిలించుకునేందుకు నానా తంటాలు పడింది. ఈ ప్రాజెక్టులు సాంకేతికంగా, ఆర్థికంగా సాధ్యం కావన్న వాదనలను ఆ రాష్ట్ర హైకోర్టు కూడా సమర్థించింది.
ఇన్ని అభ్యంతరాలు.. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ విద్యుత్తు ప్లాంట్లు కట్టేందుకు తెలంగాణ సర్కారు హిమాచల్‌కు పరుగులు పెడుతున్నది. ఆ రాష్ట్రంలో హడావుడిగా సెలి, మియార్‌లో రూ.6200 కోట్లతో రెండు 510 మెగావాట్ల ప్లాంట్లు కట్టేందుకు ఎంవోయూ కుదుర్చుకున్నది. ఈ ఒప్పందం తెలంగాణ పాలిట గుదిబండగా మారనున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Congress Govt | హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకోకుండానే రేవంత్ సర్కారు హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్తు ప్రాజెక్ట్‌లు చేపట్టేందుకు ఉబలాటపడుతున్నది. దీని వెనుక చీకటి దందా దాగి ఉన్నదని విద్యుత్తు రంగ నిపుణులే ఆరోపిస్తున్నారు. ఇది విద్యుత్తు రంగంలో భారీ కుంభకోణం కానున్నదని, కోట్లాది రూపాయలను కొల్లగొట్టడమే ధ్యేయంగా ఈ ప్లాంట్లను తెరపైకి తెచ్చారనే చర్చ జరుగుతున్నది. ఈ ప్రాజెక్ట్‌ల పేరిట ప్రజాధనాన్ని మళ్లించడం.. దానికి అభివృద్ధి అన్న ట్యాగ్ తగిలించడం.. అక్కడి నుంచి కావాల్సిన వారి ఖాతాల్లోకి కమీషన్లు, పర్సంటేజీలు చేరిపోవడమనే భారీ దందా ఇందులో దాగి ఉన్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టుల పేరిట రూ.50 కోట్ల ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలున్నాయి. పైగా ఈ ప్రాజెక్ట్‌లకు జెన్కో బోర్డు ఆమోదం తెలుపలేదు. ఫీజిబిలిటీ రిపోర్ట్ లేదు. డీపీఆర్ రూపొందించలేదు. కానీ జెన్కో ఖాతా నుంచి రూ. 26 కోట్లు డ్రా చేశారు. ఈ రెండు ప్రాజెక్టులను తమకు అనుకూలమైన ఓ కాంట్రాక్టర్‌కు గంపగుత్తగా కట్టబెట్టబోతున్నారని విద్యుత్తు సంస్థల్లో చర్చ నడుస్తున్నది. ఈ ప్రాజెక్టులు ఆచరణ సాధ్యంకావంటూ చాలారు జువులున్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం.
సెలి పవర్ ప్లాంట్‌ను చేపట్టబోయి మోసర్ బేయర్ కంపెనీ చేతులు కాల్చుకున్నది. మొదట ఈ కంపెనీయే సెలిలో 340 మెగావాట్ల జల విద్యుత్తు కేంద్రం ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్నది. ఒప్పందం ప్రకారం అప్‌ఫ్రంట్ ప్రీమియంగా రూ. 64 కోట్లను కంపెనీకి చెల్లించింది. డీపీఆర్‌ను రూపొందించారు. ఇప్లిమెంటేషన్ అగ్రిమెంట్ (ఎల్వోఏ) కూడా కుదిరింది. కానీ ప్రాజెక్ట్ ముందుకు కదల్లేదు. రోడ్డు మార్గం లేకపోవడం, ఆనకట్ట ఎత్తు (డ్యామ్) పెంచడంతో ముంపు వంటి సమస్యలున్నట్టు సర్కారు దృష్టికి తీసుకెళ్లింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో తాము నిర్మాణం చేపట్టలేమని చేతులెత్తేసింది. హిమపాతం కారణంగా ప్రాజెక్ట్ నిర్మాణ సామగ్రి, పరికరాలు, యంత్రాలను తరలించడం అసాధ్యమన్న కారణాలను చూపించింది.
సాంకేతికంగా, ఆర్థికంగా ఈ ప్రాజెక్ట్ ఆచరణ సాధ్యంకాదని మోసర్ బేయర్ కంపెనీ తేల్చింది. రూ.64 కోట్లను వడ్డీతో పాటు తమకు చెల్లించాలంటూ మోసర్ బియర్ కంపెనీ న్యాయపోరాటం చేసింది. ఈ వివాదం హిమాచల్ హైకోర్టుకు చేరింది. సెలి హైడ్రో పాజెక్ట్ సాంకేతికంగా, ఆర్థికంగా ఆచరణ సాధ్యంకాదన్న మోసర్ బేయర్ కంపెనీ వాదనను ఆ రాష్ట్ర హైకోర్టు సమర్థించింది. ఆయా మొత్తాన్ని మోసర్ బేయర్‌కు చెల్లించాలని తీర్పునిచ్చింది. అయినా కోర్టు తీర్పును హిమాచల్ సర్కారు లెక్కచేయలేదు. మళ్లీ వివాదం కోర్టుమెట్లెక్కగా ఆలస్యం కారణంగా పరిహారాన్ని రూ. 150 కోట్లకు పెంచడమే కాకుండా, పిటిషన్ దాఖలు చేసినప్పటి నుంచి 7శాతం వడ్డీతో పాటు చెల్లించాలని తీర్పునిచ్చింది. అయినా హిమాచల్‌లోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. కోర్టు తీర్పును ఖాతరు చేయలేదు. దీంతో ఢిల్లీలోని హిమాచల్భవన్ ఆస్తులను అటాచ్ చేయాలని, వేలం వేయాలని 2024 నవంబర్ 19న ధర్మాసనం తీర్పును వెలువరించింది.
సెలి ప్రాజెక్ట్ ప్రాంతంలో ఏడాదిలో 7 – 9 నెలలు మంచుతో కప్పి ఉంటుంది. పదే పదే వరదలు, హిమపాతాలు నిర్మాణ పనులకు ప్రధాన అడ్డంకిగా మారాయి. ప్రాజెక్ట్ కేటాయింపు సమయంలో లీన్ సీజన్లో 15శాతం నీటిని మాత్రమే విడుదల చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత లీన్ సీజన్లో నాలుగు నెలల పాటు 20శాతం నీటిని విడుదల చేయాలని మార్చారు. అదనపు నీటి విడుదల వల్ల నికర విద్యుత్తు ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో 12శాతం ఆదాయం తగ్గిపోతుందని మోసర్ బేయర్ ఆందోళన వ్యక్తంచేసింది. పైగా ప్రాజెక్ట్ టారిఫ్ యూనిట్ విద్యుత్తుకు రూ.9గా నిర్ధారించారు. సోలార్ ప్లాంట్ల టారిఫ్ యూనిట్‌కు రూ. 2.50గా ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ సెలి ప్రాజెక్ట్ ఏ కోణంలోనూ ఆర్థికంగా లాభదాయకం కాదని మోసర్ బేయర్ తేల్చేసింది.
విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణంలో ఎన్టీపీసీ పేరెన్నికగల సంస్థ. మోసర్ బేయర్ కంపెనీ తర్వాత ఎన్టీపీసీ వంతు వచ్చింది. 2019లో సెప్టెంబర్‌లో ఎన్టీపీసీ 520 మెగావాట్ల జలవిద్యుత్తు ప్లాంట్లను నెలకొల్పేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా సెలిలో 400, మియార్‌లో 120 మెగావాట్ల ప్లాంట్లను నిర్మించాలి. బిడ్డింగ్ లేకుండా నామినేషన్ పద్ధతిలో హిమాచల్ సర్కారు ఈ ప్రాజెక్ట్‌ను ఎన్టీపీసీకి అప్పగించింది. హిమాచల్ ప్రభుత్వం వరుసగా విద్యుత్తు ఉత్పత్తిపై 11, 18, 30శాతం విద్యుత్తును రాయల్టీగా డిమాండ్ చేసింది. 40 ఏండ్ల తర్వాత ప్రాజెక్టును రాష్ట్రానికే అప్పగించాలని షరతు విధించింది. ఈ షరతులకు ఎన్టీపీసీ అంగీకరించలేదు. మూడేండ్ల తర్వాత ఎన్టీపీసీ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగింది.
హిమాచల్‌లో జల విద్యుత్తు ప్రాజెక్టుల నిర్మాణం ఒక అడుగు ముందుకు, పది అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. కాంగ్రెస్ సర్కారు 22 జల విద్యుత్తు ప్లాంట్లను నిర్మించతలపెట్టింది. వీటిలో చినాబ్ నదిపై లాహౌల్, స్పితి జిల్లాల్లో 595 మోగావాట్ల సామర్థ్యం గల 9 హైడల్ ప్రాజెక్ట్‌లున్నాయి. సట్లెజ్ నది బేసిన్లో 169 మెగావాట్ల సామర్థ్యం గల 8 హైడల్ ప్రాజెక్టులున్నాయి. రావి నదిపై నాలుగు పవర్ ప్లాంట్లు కాగా వీటి సామర్థ్యం 55 మెగావాట్లే. బియాస్ నదిపై 9 మెగావాట్ల మరో జల విద్యుత్తుకేంద్రాన్ని నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే రెండు దశాబ్దాల్లో తండి, బార్దంగ్, మియార్, తిండి, సెలి, రియోలి గ్రామాల్లో ఏడు హైడ్రో పవర్ ప్లాంట్ల నిర్మాణానికి పూనుకోగా, ఈ 20 ఏండ్ల కాలంలో ఒక్క ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభంకాలేదు. స్థానికులు అడ్డుకోవడం, వ్యతిరేకించడం వల్ల ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదు.
ప్రస్తుతం హిమాచల్ ఆర్థిక పరిస్థితి వెంటిలెటర్‌పై ఉందని నిపుణులు చెప్తున్నారు. 10 గ్యారెంటీల పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఆ రాష్ర్టాన్ని దివాలా దిశగా నడిపిస్తున్నది. 2లక్షల మంది ఉద్యోగులకు, 1.5లక్షల పెన్షనర్లకు కనీసం జీతాలివ్వలేని దుస్థితిలో పాలన సాగిస్తున్నది. 86వేల కోట్ల అప్పులు. రెవెన్యూ లోటు 2.6శాతం, విత్తలోటు 5.6శాతంతో కొనఊపిరిపై కొట్టుమిట్టాడుతున్నది. తమ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నదని ముఖ్యమంత్రే ప్రకటించారు. ఉచిత పథకాలతో దివాలా తీశామని స్పష్టంచేశారు. మంత్రుల జీతాలు, టీఏ, డీఏలు కట్‌చేశారు. ఇలాంటి రాష్ట్రంతో మనం దోస్తీ కట్టడం అంత శ్రేయస్కరం కాదన్న అభిప్రాయం నిపుణుల్లో వ్యక్తమవుతున్నది.
సెలి, మియార్ జల విద్యుత్తు ప్రాజెక్ట్‌లతో హిమాచల్‌కు ఏటా రూ. 2,500కోట్ల నుంచి 3వేల కోట్ల ఆదాయం వస్తుందని ఆ రాష్ట్ర సీఎం అసెంబ్లీలో ప్రకటించారు. అంటే ఆదాయం హిమాచల్‌కు.. నష్టమేమో మనకన్న మాట. విద్యుత్తు ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) 60- 70శాతం మించదు. 510 మెగావాట్లల్లో ఉత్పత్తి అయ్యేదే 340 మెగావాట్లు. దీంట్లో 30శాతం హిమాచల్‌కే పోతే మనకు వచ్చేదెంత? హిమాచల్ నుంచి మనకు కరెంట్ అందే వరకు ట్రాన్స్మిషన్ నష్టాలు.. ట్రాన్స్మిషన్ చార్జీలు మొత్తంగా చూస్తే ఈ పాజెక్ట్లు తెలంగాణ పాలిట శాపంగా మారే ప్రమాదం లేకపోలేదని.. పెట్టిన రూ. 6,200 కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనన్న వాదనలున్నాయి. ఇక క్లౌడ్‌బరస్ట్, డ్యామ్బ్రస్ట్లతో ప్రజల ప్రాణాలు పోతున్నాయని, ప్రజలను కాపాడేందుకే జల విద్యుత్తు ప్రాజెక్ట్‌లు కడుతున్నామని హిమాచల్ సీఎం ఓ సందర్భంలో ప్రకటించారు. మరీ డ్యామ్ బరస్ట్ జరిగితే పవర్‌ప్లాంట్ కూలిపోతే తెలంగాణ సొమ్ములు నీటిపాలుకావా? ఇలాంటి వివాదాస్పద ప్రాజెక్ట్‌లు ఎవరి కోసం. ఎందుకోసమని విద్యుత్తు రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
ఒప్పందం ప్రకారం అప్ ఫంట్ ప్రీమియం కింద జెన్కో రూ. 26కోట్లను చెల్లించింది. మరో రూ.26 కోట్లను ఈ నెలాఖరులోగా చెల్లించాల్సి ఉంది. అంటే మొత్తంగా రూ. 52కోట్లను హిమాచల్‌కు తెలంగాణ జెన్కో చెల్లించాలి. ఈ ప్లాంట్ల నిర్మాణం పూర్తయ్యాక మొదటి పన్నెండేండ్లు 12 శాతం, ఆ తర్వాత పద్దెనిమిదేండ్లు 18శాతం, పదేండ్ల పాటు 30శాతం విద్యుత్తు హిమాచల్‌కు తెలంగాణ జెన్కో పూర్తి ఉచితంగా ఇవ్వాలి. 40 ఏండ్ల తర్వాత రెండు ప్లాంట్లను హిమాచల్‌కే అప్పగించాలి. ప్లాంట్ నిర్మిత ప్రాంతంలో అభివృద్ధికి రూ.93 కోట్లు ఇవ్వాలి. మొత్తం ఉత్పత్తిలో 1శాతం కరెంట్‌ను స్థానికులకు ఉచితంగా ఇవ్వాలి. భూ నిర్వాసితులకు 100 యూనిట్ల చొప్పున కరెంట్‌కు సమానమైన సొమ్మును ఇవ్వాలనే షరతు ఉందట. ఎన్టీపీసీ సహా ఇతర సంస్థలేవైనా విద్యుత్తు ప్లాంట్లను నిర్మిస్తే, రాయల్టీ కింద ఆ రాష్ర్టానికి 12శాతం కరెంట్‌నే ఇవ్వాల్సి ఉండగా, తెలంగాణ జెన్కో మాత్రం 12, 18, 30శాతం విద్యుత్తును రాయల్టీగా ఇచ్చేందుకు అంగీకరించింది. అంటే 30శాతం పోతే తెలంగాణకు వచ్చేదెంత? ఈ ప్లాంట్లపై సమగ్ర అధ్యయనం చేయకముందే ముందుకెళ్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
హిమాచల్ ప్లాంటపై ఒప్పందం కుదిరినా ప్లాంట్ల నిర్మాణానికి ఓ దశాబ్దం పట్టే అవకాశమున్నది. డీపీఆర్ తయారీకే మూడేండ్లు పడుతుందని అంచనా. కావాలంటే మరో ఏడాది పొడగించుకునే అవకాశమున్నది. ప్లాంట్ల నిర్మాణానికి నాలుగేండ్లు, విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభానికి నాలుగేండ్లు పట్టనుంది. అంటే మొత్తంగా 510 మెగావాట్ల కోసం 11 ఏండ్లు తెలంగాణ వేచిచూడాలి. అది కూడా రూ.6,200 కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత. ఇక ఉద్యోగాలు అక్కడి వాళ్లకే ఇవ్వాలి. టెక్నికల్, మినిస్ట్రీరియల్ స్టాఫ్ నంతా అక్కడివారినే రిక్రూట్ చేసుకోవాలి. అంటే ఇన్ని కోట్లు పెట్టిన తర్వాత ఒక్క ఉద్యోగం కూడా మనోళ్లకు రాదన్నమాట.
మన రాష్ట్రంలో దుమ్ముగూడెంలో 400 మెగావాట్ల జల విద్యుత్తు ప్లాంట్ నిర్మాణానికి గతంలోనే అనుమతులొచ్చాయి. డీపీఆర్ సైతం సిద్ధమయ్యింది. ప్లాంట్ నిర్మించుకునేందుకు వీలుగా ఇరిగేషన్‌శాఖ పైపులైన్లు వేసింది. మన రాష్ట్రంలో నిర్మించుకోవాల్సిన ప్రాజెక్ట్‌ను వదిలిపెట్టి, హిమాచల్‌ప్రదేశ్‌కు పరుగులు పెట్టడం పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రం బయట ప్లాంట్‌ను నిర్మించడం ఇదే తొలిసారి. ఏదైనా ప్లాంట్‌ను నిర్మించే ముందు ఓ ఏజెన్సీ ద్వారా ఫీజుబిలిటీ రిపోర్ట్‌ను తయారుచేస్తారు. ఆ తర్వాత డీపీఆర్‌ను రూపొందిస్తారు. జెన్కో బోర్డు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. రామగుండంలో నిర్మించే 800 మోగావాట్ల ప్లాంట్ విషయంలో ఈ ప్రక్రియనంతా పాటించారు. కానీ హిమాచల్ ప్లాంట్ల విషయంలో ఇవేవి జరగలేదు. ఇంత తొందరపాటు ఎందుకునే ప్రశ్నలొస్తున్నాయి. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో రివర్స్‌పంపింగ్ ద్వారా విద్యుత్తును అతి తక్కువ ఖర్చులో ఉత్పత్తి చేసుకునే వీలుంది. వీటిని పక్కనపెట్టి, హిమాచల్‌లో ప్లాంట్ కోసం ప్రాకులాడటం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
సెలి, మియార్ ప్రాజెక్ట్‌లను నామినేషన్ పద్ధతిపై టీజీ జెన్కో కేటాయించినా.. రెండు ప్రాజెక్ట్‌లను ఓ కంపెనీకి అప్పగించేందుకు రంగం సిద్ధమయ్యిందట. ఓ మూడు కంపెనీలు పోటీపడుతున్నాయి. ఇప్పటికే ఓ కంపెనీ రూ. 50కోట్ల ముడుపులను ప్రభుత్వ పెద్దలకు సమర్పించిందట. ఇక సదరు కంపెనీకే ఈ రెండు ప్రాజెక్ట్‌లను అప్పగించడం లాంఛనమేనట. ఇదిలా ఉండగా ఇటీవలే ప్రై వెరియేషన్ (అంచనాల పెంపు) నిబంధనలను ఎత్తివేశారు. అంటే మొదట అంచనా వ్యయం ఒకటిగా చూపించి ఆ తర్వాత ఎంతైనా పెంచుకునే ప్రమాదం లేకపోలేదు. ముందుగా ఈ రెండు ప్రాజెక్ట్‌లకు ఫీజిబిలిటీ రిపోర్ట్ తయారుచేయాల్సి ఉంటుంది. ముందు కన్సల్టెంట్‌ను నియమిస్తారు. కన్సల్టెంట్‌కు కొంత దోచిపెడతారు. ఆ తర్వాత డీపీఆర్ తయారీ ఇదో నాటకం. ఆ తర్వాత నచ్చిన కంపెనీలకు అప్పగించడం. ఈ మధ్యలో హిమాచల్‌కు రాకపోకలు. స్పెషల్ ఫ్లైట్స్, ప్రత్యేక రాచ మర్యాదలు. మొత్తంగా ప్రజల సొమ్ములను సులువుగా దోచేద్దామనే పక్కా స్కెచ్‌తోనే ఒప్పందానికి శ్రీకారం చుట్టినట్టు జెన్కో ఇంజినీర్లు ఆరోపిస్తున్నారు.
ప్రతిపాదిత సెలి ప్రాజెక్ట్ స్థలం వరకు అప్రోచ్ రోడ్డులేదు. ప్రధాన ప్రాంతాలైన సన్సారి – కిల్లర్, తిరోట్ -తండిలను అనుసంధానించేందుకు రోడ్డుమార్గం లేదు. భారీ యంత్రాలు, నిర్మాణ సామగ్రిని రవాణా చేసే పరిస్థితులు లేవు. ఈ రోడ్డు 2023లో పూర్తి కావాల్సి ఉన్నా, ఇప్పటి వరకు కాలేదు. బీఆర్వో అధికారుల కథనం ప్రకారం ఈ రోడ్డు డీపీఆర్ తయారీ మాత్రమే పూర్తయ్యింది. ఇంకా కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించలేదు. భూసేకరణకు అనుమతులు సైతం రావాల్సి ఉంది. దాదాపు ఏడేండ్లుగా ఈ రోడ్డు నిర్మాణంలో పురోగతి లేదు. ఇలాంటప్పుడు తెలంగాణ జెన్కో ఎలా పనులు చేపట్టగలుగుతుంది. నిర్మాణ సామగ్రి ఎలా తరలిస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.
విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణంపై కాంగ్రెస్ నేతల వ్యవహారం రెండు నాల్కల ధోరణిని తలపిస్తున్నది. ఇందుకు సెలి, మియార్ ప్రాజెక్ట్‌లే తార్కాణంగా నిలుస్తున్నాయి. గతంలో కేసీఆర్ సర్కారు భదాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్లను నామినేషన్ పద్ధతిపై నవరత్న కంపెనీ అయిన బీహెచ్ఈఎల్కు అప్పగించింది. దీనిని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. ఓపెన్ టెండర్లకు ఎందుకెళ్లలేదని ప్రశ్నించారు. ఏవో అక్రమాలు జరిగాయని గొంతు చించుకున్నారు. అధికారంలోకి రాగానే విద్యుత్తు విచారణ సంఘాన్ని వేశారు. కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ పెద్దలు హిమాచల్‌ప్రదేశ్‌లోని రెండు ప్లాంట్లను నామినేషన్ పద్ధతిపై టీజీ జెన్కోకు అప్పగించారు. అప్పుడు కేసీఆర్ చేస్తే తప్పు.. కాంగ్రెస్ పాలకులు చేస్తే ఒప్పు అయ్యింది? కేసీఆర్ సర్కారు టెండర్లకు ఎందుకెళ్లలేదో ఇప్పుడు బోధపడిందో ఏమో మళ్లీ ఇప్పుడు నామినేషన్ పద్ధతికే జైకొట్టారు. పైగా యాదాద్రి నిర్మాణ వ్యయంపైనా విమర్శలు చేశారు. వైటీపీఎస్ను ఒక మెగావాట్‌కు 7.6 కోట్లకు కేసీఆర్ సర్కారు అప్పగిస్తే. జల విద్యుత్తు ప్లాంట్లను ఒక మెగావాట్‌కు 11.92 కోట్లు ఖర్చుపెడుతుండటం గమనార్హం.
Agitation
జల విద్యుత్తు ప్రాజెక్ట్‌లపై స్థానిక ప్రజలు, సామాజిక కార్యకర్తలు, పర్యావరణవేత్తలు పోరుబాట పట్టారు. 2025 జనవరి 13న స్థానిక ప్రజలు ఏకంగా ఆయుధాలు చేపట్టి రోడ్డెక్కారు. 828 మెగావాట్ల సామర్థ్యం గల 22 జల విద్యుత్తు కేంద్రాలను ప్రకటించగానే జనం ఆందోళనలకు పిలుపునిచ్చారు. కుల్లు, చంబా, కిన్నౌర్, లాహోల్, స్పితి, సిమ్లా జిల్లాల్లో చేపట్టిన హైడ్రో ప్రాజెక్ట్‌ను నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతతో జిస్పా డ్యామ్‌పై 300 మెగావాట్ల హైడ్రో పవర్‌ప్లాంట్ పనులు 15 ఏండ్లుగా ప్రారంభించలేని పరిస్థితులున్నాయి. ఈ ప్లాంట్లు హిమనీ నదాలు (ఘనీభవించిన నదులు), జీవవైవిధ్యానికి, ఎకో సెన్సిటివ్ జోన్‌కు గొడ్డలి పెట్టుగా పర్యావరణ వేత్తలు అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులను తెలంగాణ ఎలా పూర్తి చేస్తుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
-కొంటు మల్లేశం