Telangana | హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : ఉగాది రోజున ప్రతి ఇంటా షడ్రుచుల మిళితమైన పచ్చడిని సేవిస్తూ ఆధ్యాత్మిక వాతావరణంలో గడిపే ప్రజలకు రేవంత్ సర్కారు మరో రుచిని చూపెట్టేందుకు సిద్ధమైంది. ఈ ఆర్థిక సంవత్సరం (2025-26)లో రూ.27,623.36 కోట్ల ఎక్సైజ్ ఆదాయం రాబట్టాలని బడ్జెట్లో ప్రకటించిన మేరకు సరిగ్గా పది రోజులు తిరక్క ముందే తొలి అడుగు వేసింది. గల్లా పెట్టె నింపుకోవడమే లక్ష్యంగా రాష్ట్రంలో 45 కొత్త బార్లకు అనుమతులిచ్చేందుకు నేడే ముహూర్తం పెట్టింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి తొలిదశలో 45 కొత్త బార్లకు లైసెన్స్‌లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు నేడు(ఉగాది రోజున) నోటిఫికేషన్ జారీ చేసేందుకు అన్ని లాంఛనాలు పూర్తిచేసింది. రాబడి ఎకువగా ఉన్న ప్రాం తాలను ప్రామాణికంగా తీసుకొని హెచ్ఎండీఏ పరిధిలో 20, గ్రామీణ ప్రాంతాల్లో 25 బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ‘నమస్తే తెలంగాణ’ కథనం చూసి ముఖ్యమంత్రి ఉగాది రోజు అని భావించి ఆపితే మినహా.. నూటికి నూరు శాతం నేడు నోటిఫికేషన్ విడుదలకు ఎక్సైజ్‌శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది.
రెండు నెలల్లో కొత్త బార్లు ఏర్పాటయ్యేలా విధివిధానాలు రూపొందించింది. దరఖాస్తు దాఖలుకు ఫీజు రూ.లక్షగా నిర్ణయించింది. ఒక బార్‌కు ఒకటి కంటే ఎక్కువ దరాఖాస్తులు వస్తే లాటరీ పద్ధతిలో లైసెన్స్‌లు కేటాయిస్తామని ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. ఇది తొలిదశ నోటిఫికేషన్ మాత్రమేనని, త్వరలో ఎలైట్ బార్లను కలుపుకొని దశల వారీగా మరిన్ని కొత్త బార్లకు అనుమతులు ఇచ్చే అవకాశం ఉన్నదని ఎైక్సైజ్ అధికారుల్లో చర్చ జరుగుతున్నది. వీటితోపాటు రాష్ట్రంలో భారీఎత్తున మైక్రో బ్రూవరీల ఏర్పాటును ప్రోత్సహించాలని, ఈ ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 మైక్రో బ్రూవరీలనైనా ఏర్పాటుచేయించాలని ప్రభుత్వం ఎక్సైజ్‌శాఖకు టార్గెట్ పెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 1,171 బార్లు నడుస్తున్నాయి. ఇవే కాకుండా 89 ఎలైట్బార్లతోపాటు హైదరాబాద్, శంషాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్‌లో 55 పబ్బులు కొనసాగుతున్నాయి. ఈ మొత్తం సంఖ్యను 1,500 వరకు పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు ఎక్సైజ్‌వర్గాలు పేర్కొంటున్నాయి.