Telangana | హైదరాబాద్, మార్చి30 (నమస్తే తెలంగాణ) : ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణం కంటే ముందే రేవంత్ సరారు మందుబాబులకు,మద్యం వ్యాపారులకు మత్తెక్కించే కబురు చెప్పింది. తెలంగాణ గ్రామీణ జిల్లాల్లో 25 కొత్త బార్ అండ్ రెస్టారెంట్ల ఏర్పాటుకు అనుమతిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ఎక్సై జ్ కమిషనర్ హరికిరణ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. హైదరాబాద్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ కోడ్ అమలులో ఉండటంతో, కోడ్ ముగిసిన తర్వాత జీహెచ్ఎంసీ పరిధిలోని బార్లకు నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించారు. జనాభా ప్రాతిపదికన బార్ లైసెన్స్ ఫీజు నిర్ధారించారు.
మహబూబ్నగర్, మెదక్ జిల్లాల్లో రూ.30 లక్షలు, మిగతా జిల్లాల్లో రూ.42 లక్షల చొప్పున బార్ లైసెన్స్ ఫీజు ఫిక్స్ చేశారు. దరఖాస్తు ఫీజు రూ.లక్షగా ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ లక్ష రూపాయలు తిరిగి ఇవ్వబోమని నోటిఫికేషన్లో పేర్కొన్నది. ఏప్రిల్ 26 వరకు దరఖాస్తుల ఆఖరు తేదీ అని, అప్పటి వరకు ఆన్లైన్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని అబారీ శాఖ నోటిఫికేషన్లో వెల్లడించింది. ఒకో బారుకు ఒకటి కంటే ఎకువ దరఖాస్తులు వస్తే లకీ డ్రా ద్వారా ఎంపిక చేస్తారు.
మద్యం విక్రయాల ద్వారా రోజుకు సగటున రూ.120 కోట్ల ఆదాయం సమకూరుతున్నది. ఎక్సైజ్, వ్యాట్ ఆదాయం కలుపుకొని నెలకు రూ రూ.3600 కోట్లు సమకూరుతున్నది. ఈ ఆదాయాన్ని సగటున రోజుకు రూ.170 కోట్ల చొప్పున నెలకు రూ.5100 కోట్లకు పెంచాలని ఎక్సైజ్ శాఖకు ప్రభుత్వం టార్గెట్ పెట్టినట్టు ఆ శాఖ సీనియర్ అధికారుల్లో చర్చ నడుస్తున్నది. ఇందులో భాగంగానే ఇటీవల బీర్ల ధరలను పెంచిన ప్రభుత్వం త్వరలోనే బ్రాందీ, విస్కీ ధరల పెంపునకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కొత్తగా మరి కొన్ని 2బీ బార్లతో పాటు, ఎలైట్ బార్లకు కూడా అనుమతులు ఇవ్వాలని నిర్ణయించింది.