సంధికాలపు వాతావరణం విచిత్రంగా ఉంటుంది. రాత్రంతా చలి చంపేస్తుంది. మధ్యాహ్నం వేసవిని తలపించేలా.. ఎండ మండిపోతుంది. ఇక సాయంత్రాల్లో ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఒకేరోజులో ఇన్ని వాతావరణ మార్పులను తట్టుకోవడం శరీరానికి కష్టమవుతుంది. ఫలితంగా, పలు ఆరోగ్య సమస్యలు పలకరించే ప్రమాదం ఉంది.
ఉష్ణోగ్రతల్లో అకస్మాత్తుగా వచ్చే మార్పుల వల్ల రోగకారక వైరస్లు వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఫలితంగా.. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఫ్లూ లాంటి వైరల్ జ్వరాలు విజృంభిస్తాయి. అందుకే, ఉదయం, రాత్రి సమయాల్లో చలిగా ఉన్నప్పుడు.. గోరువెచ్చని నీరు తాగాలి. దీనివల్ల గొంతు ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఉసిరి, నిమ్మరసం, నారింజ వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇక మధ్యాహ్నం ఎండల వల్ల శరీరం అధిక నీటిని కోల్పోతుంది.
బాడీ డీహైడ్రేషన్‌కు గురై.. అలసట, తలనొప్పి లాంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి, దాహమైనా కాకపోయినా.. తగినన్ని నీళ్లు తీసుకోవడం మంచిది. వాతావరణ మార్పుల వల్ల జీర్ణక్రియ కూడా మందగిస్తుంది. అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. దీని బారి నుంచి తప్పించుకోవాలంటే.. ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఓవైపు చలి గాలులు, మరోవైపు ఎండలతో చర్మం కూడా పొడిబారుతుంది.
స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజర్, కొబ్బరి నూనె లాంటిది అప్లయి చేసుకుంటే.. చర్మం మృదువుగా ఉంటుంది. ఇక మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉంటున్నదని అప్పుడే ఏసీలు, కూలర్ల జోలికి వెళ్లొద్దు. దీనివల్ల శరీర ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. ఇది తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుంది. కాబట్టి, ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్టుగా.. మధ్యాహ్నం వేసవి కోసం, రాత్రికి శీతాకాలపు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.