హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నది. ఎల్‌నినో ముప్పు పొంచి ఉన్నదని హెచ్చరిస్తున్నది. వారం క్రితమే ఈ మేరకు నివేదికలు విడుదల చేసింది. అప్రమత్తంగా ఉండాలని, నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డకు పరుగులు తీస్తున్నది. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాజెక్టును రెండున్నరేండ్లుగా బద్నాం చేసేందుకు ప్రయత్నించడమే కాకుండా మరమ్మతులు చేయకుండా వదిలేసిన రేవంత్‌రెడ్డి సర్కార్ ఇప్పుడు ఉరుకులు పరుగులు తీస్తున్నది. సమీక్షలు పెడుతూ, నెలాఖరుకల్లా టెస్టులు పూర్తి చేయాలంటూ హడావుడి చేస్తున్నది. మొత్తంగా ప్రాణహిత జలాలు, మేడిగడ్డ ఒక్కటే కరువు నివారణకు ఏకైక మార్గమని ప్రభుత్వం గుర్తించిందని స్పష్టమవుతున్నది.
వాతావరణ శాఖ హెచ్చరికలు
భారత వాతావరణ శాఖ ప్రతి ఏటా నైరుతి రుతుపవనాల (జూన్-సెప్టెంబర్) కాలంలో కురిసే సగటు వర్షపాతంపై రెండు దఫాలుగా ఏప్రిల్ రెండో వారం, మే ఆఖరున ముందస్తు అంచనా నివేదికలు విడుదల చేస్తుంది. ‘మాన్సూన్ మిషన్ ైక్లెమేట్ ఫోర్ కాస్ట్ సిస్టమ్’ (ఎంఎంసీఎఫ్ఎస్)తో సహా వివిధ ‘గ్లోబల్ ైక్లెమేట్ ప్రిడిక్షన్ సెంటర్ల’ నుంచి సేకరించిన ‘కపుల్డ్ గ్లోబల్ ైక్లెమేట్ మాడల్స్’ (సీజీసీఎం) ఆధారంగా రుతుపవనాల తీరును అంచనా వేస్తుంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా 2026లో రుతుపవనాల అంచనాకు సంబంధించిన నివేదికను ఈ నెల 13న విడుదల చేసింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎల్‌నినో ప్రభావం ఉంటుందని తెలిపింది. సాధారణంగా ఎల్‌నినో అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలాలు అసాధారణంగా వేడెకే ప్రక్రియ. ఈ మార్పు ప్రపంచ వాతావరణంపై ప్రభావం చూపుతూ.. భారతదేశ రుతుపవనాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఎల్‌నినో ఉన్న సంవత్సరాల్లో సాధారణంగా వర్షపాతం తగ్గి, ఎండలు ఎకువగా ఉంటాయి.
నీటికొరత, పంటల దిగుబడి తగ్గడం, భూగర్భ జలాల స్థాయి పడిపోవడం వంటి సమస్యలు తీవ్రంగా ఏర్పడుతాయి. కొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు కనిపిస్తాయి. గతంలో 2002, 2009 సంవత్సరాల్లో ఎల్‌నినో ప్రభావంతో దేశంలో తకువ వర్షపాతం నమోదైంది. ఆ సంవత్సరాల్లో ఎదురైన అనుభవాలు చూస్తే, ఎల్‌నినో ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థమవుతుంది. ప్రస్తుతం అదే ఎల్‌నినో ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ నివేదికలో వెల్లడించింది. గత 25 ఏండ్లలో ఇదే అత్యల్పమని అంచనా వేసింది. ఈ సీజన్లో జూన్-సెప్టెంబర్, ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో వర్షపాతం బలహీనంగా ఉండే అవకాశం ఉన్నదని తెలిపింది. నీటిని పొదుపుగా వాడటంతోపాటు అందుకు అనుగుణంగా పంటల కాలాన్ని ప్రణాళిక చేసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. తెలంగాణలోనూ సాధారణ లోటు వర్షపాతమే నమోదవుతుందని తెలిపింది. ఈ సంవత్సరం వానకాలం 2018 మాదిరిగానే ఉంటుందని, తకువ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని స్పష్టం చేసింది. 2025లో మాదిరిగా వర్షాలు కురుస్తాయని ఆశించవద్దని తెలిపింది. 2014-15లో మాదిరిగా తీవ్రంగా ఉండకపోయినా, గత ఐదారేండ్లతో పోలిస్తే ఈ సంవత్సరం వర్షాలు తకువగా ఉంటాయని పేర్కొన్నది.
మేడిగడ్డపై సర్కార్ పరుగులు
వాతావరణ శాఖ అంచనాలు వచ్చీరాగానే రేవంత్‌రెడ్డి సర్కార్ మేడిగడ్డపై దృష్టి పెట్టడం చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన లక్ష్మీబరాజ్ (మేడిగడ్డ)లోని 7వ బ్లాక్‌లోని 20 పిల్లర్ గత అక్టోబర్‌లో కుంగుబాటుకు గురైన విషయం తెలిసిందే. ప్రాజెక్టుపై అక్కసుతో ఆదినుంచీ ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ అదే అదునుగా కుమ్మక్కు రాజకీయాలకు తెరతీశాయనే విమర్శలున్నాయి. ఇన్వెస్టిగేషన్, సాంకేతిక పరీక్షలను నిర్వహించకముందే డిజైన్ లోపాలు, నాణ్యతా లోపాలు తదితర కారణాలంటూ విషప్రచారం చేస్తూ వచ్చాయి. రచ్చ చేయడం ప్రారంభించాయి. మంత్రులు ఒకసారి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి ప్రాజెక్టును స్వయంగా సందర్శించి అక్కడా అవే ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయడంతోపాటు ఒకవైపు విజిలెన్స్ విచారణ, మరోవైపు జ్యుడీషియల్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. విచారణ అంశాలను అనుకూల మీడియా సంస్థలకు లీకులు ఇస్తూ ప్రాజెక్టులపై అసత్య ప్రచారాలకు తెరలేపింది. ప్రాజెక్టు పునరుద్ధరణ అంశాన్ని మాత్రం ఎన్డీఎస్ఏ దయాదాక్షిణ్యాలకు వదిలేసింది.
ఇదిలా ఉంటే ఎన్డీఎస్ఏ నిరుడు ఏప్రిల్ 23న తుది నివేదిక సమర్పించింది. బరాజ్‌ల మరమ్మతు పనులకు ముందుగా మరోసారి జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు నిర్వహించాలని, పిల్లర్ కుంగుబాటునకు దారితీసిన కారణాలు, గమనించిన ఇతర సమస్యలను పరిశీలించాలని ఎన్డీఎస్ఏ సూచించింది. పరీక్షల నివేదికలను సీడబ్ల్యూసీకి పంపి, డిజైన్లు రూపొందించుకొని, ఆ మేరకు బరాజ్ పునరుద్ధరణ పనులు నిర్వహించాలని పేర్కొన్నది. అయితే, ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిగా ఏమాత్రం చొరవ చూపలేదు. తొలుత ఎన్డీఎస్ఏ నివేదిక రాలేదంటూ నెపం మోపుతూ మరమ్మతులను దాటవేసిన కాంగ్రెస్ సర్కార్.. నివేదిక వచ్చి ఏడాది గడుస్తున్నా రక్షణ చర్యలు చేపట్టలేదు. ఎన్డీఎస్ఏ సూచించినట్టు సీడబ్ల్యూపీఆర్ఎస్ (సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్) నిపుణుల సాయం తీసుకోవాలని నిర్ణయించినా సకాలంలో నిధులు విడుదల చేయకపోవడం, ఏజెన్సీలపై భారం మోపుతూ రావడంతో టెస్టుల నిర్వహణ ముందుకు సాగలేదు. ఆ తరువాత నిరుడు అక్టోబర్‌లో టెస్టుల నిర్వహణ, పునరుద్ధరణ పనుల కోసం కన్సల్టెన్సీని నియమించాలని నిర్ణయించింది.
ఆ ప్రక్రియను సైతం తీవ్ర జాప్యం చేసింది. తుదకు గత జనవరిలో పునరుద్ధరణ డిజైన్ల బాధ్యతలను ఆఫ్రీ, ఐఐటీ చెన్నైకి అప్పగించింది. అప్పటికీ పనులను వెంటనే ప్రారంభించిందా? అంటే అదీ లేదు. బరాజ్ పునరుద్ధరణ పనుల ప్రక్రియ జాప్యంపై ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్‌జైన్ స్వయంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేయడంతోపాటు సర్కార్‌ను నిలదీశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ, రిపోర్ట్ వచ్చేనాటికే వానకాలం వచ్చేసిందని, ఫలితంగానే పరీక్షలు సాధ్యపడలేదని సర్కార్ సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నది. అంతేకాదు, గత జనవరి నుంచి టెస్టులు ప్రారంభించామని, టెస్టుల విషయంలో తమకు ఓ రోడ్‌మ్యాప్ ఇవ్వాలని, అందుకు అనుగుణంగా పనులు చేస్తామని, ఆ మేరకు రోడ్‌మ్యాప్ ఇవ్వాలని తిరిగి ఎన్డీఎస్ఏను కాంగ్రెస్ ప్రభుత్వం కోరింది. దీనినిబట్టే పనులపై ఏపాటి పట్టింపు ఉన్నదో స్పష్టంగా అర్థమవుతున్నది. మళ్లీ మేడిగడ్డ మరమ్మతులపై హ డావుడి చేయడం ప్రారంభించింది. మే ఆఖరు నుంచే ప్రాణహితలో ప్రవాహాలు మొదలవుతాయి. పది నెలలపాటు కనీస సగటు ప్రవాహాలు కొనసాగుతాయి. బరాజ్ వినియోగంలో ఉంటే నీటిని ఎత్తిపోసుకొనే అవకాశం ఉండేది. కానీ, సర్కార్ ఇప్పటివరకు ఆ పని చేయలేదు. ఇప్పుడు లోటు వర్షపాతం హెచ్చరికలు రావడంతోనే మరమ్మతులపై హడావుడి చేస్తున్నది.
టెస్టులు పూర్తి చేయడమే అనుమానం
వచ్చే వానకాలం లోగానైనా టెస్టులు పూర్తవడం అనుమానంగానే ఉన్నది. వాస్తవంగా బరాజ్‌ల పునరుద్ధరణకు తొలుత జియోఫిజికల్ టెస్ట్‌లు నిర్వహించాలని ఎన్డీఎస్ఏ సూచించింది. అందుకోసం బరాజ్‌ల పొడువునా, ప్రతి బ్లాక్, పిల్లర్ వద్ద బోర్‌హోల్స్ వేసి దిగువ భూభౌతిక పొరల నమూనాలు సేకరించాల్సి ఉన్నది. మొ త్తంగా మూడు బరాజ్‌లు కలిపి దాదాపు 500 వరకు బోర్‌హోల్స్ వేసి, డాటాను సేకరించి, విశ్లేషించాల్సి ఉన్నది. ఇదిలా ఉంటే ఒక్కో బోర్‌హోల్ టెస్ట్‌కే దాదాపు ఐ దు రోజుల సమయం పడుతుంది. ఈ టెస్ట్‌లు సైతం ఇటీవలనే ప్రారంభమయ్యా యి. ఈ నేపథ్యంలో టెస్టుల నిర్వహణ కే దాదాపు మరో మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉన్నది. మరోవైపు, జూన్ మొదటి వారం కల్లా మేడిగడ్డ వద్ద ప్రాణహిత నీటి ప్రవాహాలు ప్రారంభమవుతాయి.
వానలు కురిస్తే టెస్టుల నిర్వహణ మళ్లీ కుంటుపడక తప్పదు. దీంతో టెస్టుల నిర్వహణకే ఈ సీజన్ గడిచిపోతుంది. వానలు ప్రారంభమైతే మళ్లీ వచ్చే ఏడాది గోదావరిలో వరద ప్రవాహాలు పూర్తిగా తగ్గేవరకూ అంటే డిసెంబర్ వరకూ టెస్టుల కోసం వేచిచూడాల్సి ఉంటుంది. ఇక టెస్టుల రిపోర్టులను విశ్లేషించి సీడబ్ల్యూసీకి పంపాలంటే మరమ్మతులకు మరో ఏడాది గడిచినట్లేనని ఇరిగేషన్ అధికారులు వివరిస్తున్నారు. అప్పటికీ టెస్టులు పూర్తి చేసి, ఆ డాటాను విశ్లేషించి, పునరుద్ధరణ పనులకు సంబంధించిన డిజైన్లను రూపొందించాల్సి ఉంటుంది. ఆ డిజైన్లను తిరిగి సీడబ్ల్యూసీ పరిశీలనకు పంపి, ఆమోదం తీసుకున్న తరువాతనే పనులను ప్రారంభించాల్సి ఉంటుంది. మొత్తంగా ఈ సీజన్లోనే కాదు, మళ్లీ వచ్చే వేసవి నాటికి కానీ పనులను ప్రారంభించే అవకాశం ఉండబోదని అధికారవర్గాలు చెప్తున్నాయి.