హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్ర ఆకాంక్షతో నాలుగు కోట్ల ప్రజలు పిడికెలెత్తి గళమెత్తిన ‘జై తెలంగాణ’ నినాదంతో.. ప్రజలంతా ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ప్రజలందరిలో పెనవేసుకున్న భావోద్వేగం ‘జై తెలంగాణ’ నినాదం. కానీ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం హైదరాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో ప్రభుత్వం నిర్వహించిన వేడుకల్లో ప్రసంగించిన సీఎం రేవంత్‌రెడ్డి ‘జై తెలంగాణ’ అనకపోవడం మరోసారి చర్చనీయాంశమైంది. రాష్ట్ర ప్రజల కలను నిజం చేసిన తెలంగాణ అమరవీరులకు, సోనియాగాంధీకి కృతజ్ఞతలు అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన రేవంత్‌రెడ్డి.. అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీల గురించి ప్రసంగంలో ప్రస్తావించలేదు.
అమరుల కుటుంబాలకు ప్రతీనెల రూ.25వేల ఆర్థికసాయం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటూ కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రకటించారు. ఉద్యమకారులపై కేసులు ఎత్తివేసి, 250 గజాల ఇండ్ల స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఈ రెండు ప్రధాన అంశాలపై రేవంత్‌రెడ్డి ఎలాంటి ప్రస్తావన చేయకపోవడంపై ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
రాష్ట్రంలో మహిళలకు క్యూఆర్ కోడ్ కార్డు తెచ్చి ఉచితంగా వైద్య పరీక్షలు చేయించే పథకాన్ని తీసుకొస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. మూసీ నదికి పూర్వ వైభవం తీసుకొస్తామని, బాపూఘాట్‌ను అంతర్జాతీయ స్థాయిలో గాంధీ సరోవర్‌గా తీర్చిదిద్దుతామని సీఎం తెలిపారు. వచ్చే పదేండ్లలో తెలంగాణను 1 ట్రిలియన్ ఎకనామీగా మార్చే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని, తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రజాప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని కోరారు.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన 9 మంది కవులు, కళాకారులు, సాహితీవేత్తలకు సీఎం రేవంత్‌రెడ్డి రూ.కోటి చొప్పున నగదు బహుమతి అందజేశారు. వీరిలో ఎక్కా యాదగిరావు, అందెశ్రీ, సుద్దాల అశోక్‌తేజ, జయరాజు, పాశం యాదగిరి ఉన్నారు. దివంగత గూడ అంజయ్య, గద్దర్ తరఫున వారి కుటుంబసభ్యులు అందుకున్నారు. విదేశీ పర్యటనలో ఉన్న గోరటి వెంకన్న తరఫున ఆయన కుమార్తె పురస్కారాన్ని స్వీకరించారు. బండి యాదగిరి కుటుంబ సభ్యులు అందుబాటులోకి రానందున వారి కోటి రూపాయల పురస్కారం ఇవ్వలేదు.