హైదరాబాద్, సెప్టెంబర్ 27(నమస్తే తెలంగాణ): ఇకపై పేదలకు ప్రభుత్వం భూములు ఇవ్వడం అసాధ్యమని, అప్పుడు ఇందిరమ్మ ఇచ్చింది కానీ ఇప్పుడు ఇవ్వలేమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు ప్రభుత్వం వద్ద పంచడానికి భూములు లేవని స్పష్టంచేశారు. ఈ మేరకు శనివారం మల్లేపల్లిలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్(ఏటీసీ) ప్రారంభోత్సవంలో పా ల్గొన్న సీఎం మాట్లాడుతూ… ‘గతంలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు సీలింగ్ ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చి జమీందార్ల వద్ద ఉన్న భూములను పేదలకు పంచారు. ప్రభుత్వం వద్ద ఆస్తులున్నప్పుడు ఇండ్ల పట్టాలు, ఇండ్లు, వ్యవసాయానికి భూములు ఇచ్చారు.
కానీ ఇప్పుడు ప్రభుత్వం వద్ద పంచడానికి భూములు లేవు. ప్రభుత్వ కార్యాలయాలు కట్టడానికే భూమి లేదు.. శ్మశాన వాటికలకు కేటాయించడానికి కూడా భూమి లేదు. ఇక పేదలకు భూమి ఇవ్వడం అనేది అసాధ్యం’ అని స్పష్టంచేశారు. ఇంజినీరింగ్ పిల్లలే గంజాయి సరఫరా చేస్తున్నారని అన్నారు. ఇటీవల పట్టుకున్న కేసుల్లో ఈ విషయం వెల్లడైందని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ పూర్తయ్యాక విద్యార్థులకు ఉద్యోగం దొరకకపోవడంతో మొదట గంజాయి అలవాటు చేసుకొని, ఆ తర్వాత అవసరాల కోసం గంజాయి వ్యాపారం చేసే పరిస్థితుల్లోకి విద్యార్థులు వెళుతున్నారని వాపోయారు. కొన్ని పనులు తనతో కాకపోతే మంత్రి శ్రీధర్‌బాబు తో చెప్పిస్తుంటానని తెలిపారు. ఆర్థిక మంత్రి కూడా శ్రీధర్‌బాబుకు దగ్గరని, మేం చెబితే వినడు కానీ.. ఆయన చెప్పగానే సరే అంటారని పేర్కొన్నారు.
ఆర్ఎంపీ డాక్టర్లకున్న తెలివి ఎంత..?
గ్రూప్-1 నియామక కార్యక్రమంలో సీఎం రేవంత్ ఆర్ఎంపీలపై చేసిన వ్యాఖ్య లు వాళ్లను అవమానించేలా ఉన్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీఎస్పీఎస్సీలో ఆర్ఎంపీ డాక్టర్లను మెంబర్లుగా వేశారని, వాళ్ల విజ్డం ఎంత..? వాళ్లకు ఉన్న నాలెడ్జ్ ఎంత? అని రేవంత్ ప్రశ్నించారు. కాగా, ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ లో ఆర్ఎంపీలను సభ్యులుగా నియమించలేదు. టీఎస్పీఎస్సీలో సభ్యుడిగా ఉన్న కరీంనగర్‌కు చెందిన డాక్టర్ చంద్రశేఖర్ ఆయుర్వేద వైద్యుడు. ఆయనకు పేదల వైద్యుడిగా మంచి పేరుంది. వాస్తవాలను దాచేసి సీఎం రేవంత్‌రెడ్డి ఆర్ఎంపీలను సభ్యులుగా పెట్టారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి.