Retirement Benefits | హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): ‘పెన్షన్ బకాయిలు చెల్లించడానికి అదేమైనా మీ సొంత డబ్బు అనుకుంటున్నారా? ఉద్యోగుల కష్టార్జితమే ఇస్తున్నారని తెలియదా? ఉద్యోగ విరమణ చేసిన వాళ్లు చకోరపక్షుల్లా ఎదురుచూడాల్సిందేనా? కండ్లు కాయలు కాసేలా నిరీక్షించి కన్ను మూయాల్సిందేనా? రిటైర్డు ఉద్యోగుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి పట్టకపోతే ఏమనుకోవాలి! ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 80 మందికిపైగా రిటైర్డు ఉద్యోగులు ప్రాణాలు వదిలేశారు. రిటైర్డు ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లించాలని ఆదేశించినప్పటికీ ప్రభుత్వంలో కదలిక లేకపోతే ఎలా? ఆరు నుంచి తొమ్మిది మాసాల గడువు ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. నత్తనడకలా వ్యవహారం ఉంటుందంటే ఉపేక్షించే ప్రసక్తే లేదు’ అంటూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగింది. ‘ఇదే చివరి అవకాశమని గుర్తుంచుకొని వ్యవహరించండి. ఏప్రిల్ 9 వరకు గడువు ఇస్తున్నాం.
అప్పటిలోగా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్, జీపీఎఫ్, మ్యుటేషన్, గ్రాట్యుటీ, ఆర్జిత సెలవు, సరెండర్ సెలవు, గ్రూపు ఇన్సూరెన్స్ వంటి ఉద్యోగ ప్రయోజనాలను చెల్లించాల్సిందే’ అని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు సోమవారం కీలక ఉత్తర్వులు జారీచేశారు. కోర్టు విచారణకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా హాజరుకాకపోవడంపై మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల పేరుతో విచారణ నుంచి మినహాయింపు పొందలేరని తేల్చిచెప్పారు. అవసరమైతే రాత్రివరకు కోర్టులో ఉంటామని, సుల్తానియా రావాల్సిందేనని స్పష్టంచేశారు. దీంతో సాయం త్రం ఆన్లైన్లో ఆయన విచారణకు హాజరయ్యారు. స్రీన్‌పై పేరును చూసిన న్యాయమూర్తి, ‘మీరేనా ఐఏఎస్ అధికారి సుల్తానియా అని ప్రశ్నించారు. మీరే సుల్తానియా అని ఎలా గుర్తించాలి? కోర్టు ఆదేశాలంటే లెక లేదా? ఉత్తర్వులను అమలుచేయాల్సిన బాధ్యత మీకు లేదా?’ అని ప్రశ్నించారు. కోర్టు ధికరణ కేసులో ఎలా వ్యవహరించాలో తెలియదా అని నిలదీశారు.
బకాయిలు చెల్లించాల్సిందే
రిటైర్ట్ ఉద్యోగుల బకాయిల చెల్లింపుల్లో జాప్యంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. అవి ప్రభుత్వ సొమ్ము కాదని, ఉద్యోగులు కష్టపడి సంపాదించిన వారి సొంత హకు అని స్పష్టంచేసింది. చెల్లింపులు ఆలస్యం చేయడం వల్ల ప్రభుత్వం అపహాస్యానికి గురౌతుందని హెచ్చరించింది. ఇప్పటికే చెల్లింపులు అందకుండానే సుమారు 80మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేసింది. గత ఆదేశాలను అమలుచేసే తీరిక లేనంత బిజీగా అధికారులు ఉన్నారా అని ప్రశ్నించింది. ఏప్రిల్ 9లోగా బకాయిలు చెల్లించాలని తేల్చిచెప్పింది.
పెండింగ్‌లో ఉన్న 2,600మందికి పూర్తి చెల్లింపులకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. తామిచ్చిన గడువు పాటించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. లేకపోతే ప్రతి విచారణకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. గతంలో ఆదేశించిన మేరకు తమకు ప్రభుత్వం పెన్షన్ బకాయిలు చెల్లించలేదంటూ సుమారు 654 మంది దాఖలు చేసిన కోర్టు ధికరణ పిటిషన్లను న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు విచారించారు. వి విధ ప్రభుత్వశాఖల నుంచి ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్, జీపీఎఫ్, మ్యుటేషన్, గ్రాట్యుటీ, ఆర్జిత, సరెండర్ సెలవులు, గ్రూప్ ఇన్సూరెన్స్ వంటి ప్రయోజనాలు చెల్లించాలన్న గత ఆదేశాలను అమలు చేయలేదని పిటిషనర్లు పేరొన్నారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తి పదేపదే ప్రభుత్వం గడువు కోరుతూ కాలయాపన చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టా రు. వాయిదాల పేరుతో ఎంతకాలం లాగుతారని ప్రశ్నించారు.
సందీప్‌కుమార్ సుల్తానియా కోర్టు విచారణకు ఆన్లైన్లో హాజరయ్యారు. మొత్తం 3,656 మందిలో 1056 మందికి పెన్షన్ బకాయిల చెల్లింపులు చేశామని, మరో 2,600 మందికి చెల్లించాల్సి వున్నదని సుల్తానియా చెప్పారు. నిధుల సమస్య కారణంగా చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని చెప్పగానే న్యాయమూర్తి కల్పించుకుంటూ.. నిధుల సమస్యతో సంబంధం లేకుండా చెల్లింపులు జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ సమయంలో ప్రభుత్వం నాలుగు వారాల గడువు కోరగా అందుకు నిరాకరించారు. ఈ నెల 31లోగా చెల్లిస్తామని చెప్పారు. నగదు లేనందున చెల్లించకపోతున్నామని చెప్పడంపై న్యాయమూర్తి స్పందిస్తూ, వాటన్నింటితో సంబంధంలేదని. ఒక తేదీని చెప్పాలని, ఆ తేదీలోగా చెల్లించాల్సిందేనని అన్నారు. దీనిపై సందీప్ కుమార్ సుల్తానియా సమాధానమిస్తూ నాలుగు వారాల గడువు ఇస్తే చెల్లింపులకు సులభం అవుతుందని చెప్పారు. కోర్టు ఒత్తిడి చేస్తే ఈనెల 31లోగా చెల్లిస్తామని, ఇవి చెల్లిస్తే మరో విభాగంలోని వారికి చెల్లింపులను నిలిపి వేయాల్సివస్తుందని అన్నారు. దీనిపై న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ కోర్టు ఒత్తిడి తీసుకురావడమేమిటని ప్రశ్నించారు. ఉద్యోగ విరమణ ప్రయోజనాలు చెల్లించాల్సిన తప్పనిసరి బాధ్యత మీపై ఉన్నదని గుర్తుచేశారు. నాలుగు వారాల గడువు ఇవ్వబోమన్నారు. ఏప్రిల్ 9వ తేదీ నాటికి 2 వేల మందికి చెల్లిస్తామని సుల్తానియా ఇచ్చిన హామీని న్యాయమూర్తి రికార్డుల్లో నమోదు చేశారు. ఒకవేళ చెల్లింపులు చేయకపోతే ఈ కేసు విచారణ జరిగే ప్రతి విచారణకు సుల్తానియా హాజరుకావాల్సిందేనని చెప్పారు. తదుపరి విచారణను ఏప్రిల్ 19కి వాయిదా వేశారు.
తొలుత ప్రభుత్వ న్యాయవాది మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న కారణంగా ముఖ్యకార్యదర్శి సుల్తానియా విచారణకు వ్యక్తిగతంగా హాజరు కాలేరని చెప్పగా.. న్యాయమూర్తి మండిపడ్డారు. కోర్టు ధికరణ కేసుల విచారణ అని తెలిసి కూడా విచారణకు హాజరుకాకపోతే ఎలాగని ప్రశ్నించారు. అవసరమైతే రాత్రి వరకు విచారణ కొనసాగిస్తామని, విచారణకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి హాజరుకావాల్సిందేనని తేల్చిచెప్పారు. దీంతో కేసు విచారణ సాయంత్రానికి వాయిదా పడింది. సాయంత్రం ఆన్లైన్ ద్వారా సుల్తానియా విచారణకు హాజరయ్యారు. ముఖ్యకార్యదర్శి తీరుపై న్యాయమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆన్లైన్లో కనిపిస్తున్న వ్యక్తి నిజంగా ఆయనేనా అన్న సందేహం వ్యక్తంచేశారు. కోర్టుతో ఎలా వ్యవహరించాలో అధికారులకు తెలియదా అని ప్రశ్నించారు. చెల్లింపులు చేయనిపక్షంలో ఈ కేసు విచారణ జరిగిన ప్రతి వాయిదాకు సుల్తానియా హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించారు. రిటైర్డు ఉద్యోగులకు చట్టప్రకారం చెల్లించాల్సిన బకాయిలను నిర్దేశించిన గడువులోగా చెల్లించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. చెల్లింపులను వాయిదా వేస్తూ ఎన్నాళ్లు సాగదీస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు.