నవాబ్‌పేట, మే 28 : మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట రిటైర్ ఉపాధ్యాయురాలు డాక్టర్ ఇందిరాదేవి పీహెచ్‌డీలో పొందుపర్చిన జరిపిన “గ్రామ దేవతలు-ప్రత్యేకత” అనే పరిశోధనలోని కొంతభాగాన్ని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో పాఠ్యాంశంగా చేర్చారు. వివరాల్లోకి వెళితే.. ఇందిరాదేవి 1984లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా బాధ్యతలు స్వీకరించి, 2013లో ఉద్యోగవిరమణ పొందారు.
1995-1999లో డాక్టర్ రుక్నొద్దీన్ పర్యవేక్షణలో పీహెచ్‌డీలో పరిశోధన చేసి పట్టా పొందారు. ఐదేండ్లు ఎంతోశ్రమపడి గ్రామాల్లో గ్రామదేవతలపై పరిశోధన చేసి, 2000లో డాక్టరేట్‌ను పొందారు. దీనిలోభాగంగా ఆమె రాసిన “గ్రామ దేవతలు-ప్రత్యేకత” అనే రచనను ఇంటర్లో పాఠ్యాంశంగా చేర్చాలని పాఠ్యాంశ ఎన్నిక కమిటీ గుర్తించింది. ఈ సందర్భంగా తనకు సహకరించిన కవి కపిలవాయి లింగమూర్తి, రుక్నొద్దీన్, రత్నయ్య, ఇంటర్ బోర్డు, తెలుగు అకాడమీ, పాఠ్యాంశ ఎన్నిక కమిటీ, సాహితీ వేత్తలకు ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.