జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): సంక్షేమశాఖలో ఆయనొక జిల్లా స్థాయి రిటైర్డ్ అధికారి. దశాబ్దాలుగా లక్షలాది మందికి సంక్షేమ ఫలాలను అందించడంలో వారధిగా నిలిచారు. ఆపన్నహస్తం అందించి ఆసరాగా నిలిచారు. కానీ నేడు అవసానదశలో ఆయనకు ప్రభుత్వం నుంచి హక్కుగా రావాల్సిన బెనిఫిట్స్ రాక ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతూ కనికరించాలని వేడుకుంటున్నారు. వైద్యఖర్చులకు కూడా చేతిలో చిల్లిగవ్వలేక అవస్థలు పడుతున్నారు.
ఈ హృదయవిదారక ఉదంతం అందరినీ కలచివేస్తున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జిల్లా సంక్షేమ అధికారిగా విధులు నిర్వర్తించిన చిన్నయ్య.. ఫిబ్రవరి 28న ఉద్యోగ విరమణ పొంది, హనుమకొండలో నివాసం ఉంటున్నారు. చిన్నయ్య కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు పేగు క్యాన్సర్ అని 15 రోజుల క్రితం వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
తీవ్ర అనారోగ్యం వేధిస్తున్నా.. వైద్యం చేయించుకునేందుకు చేతిలో డబ్బులు లేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి తనకు రావాల్సిన దాదాపు రూ.56 లక్షలు బెనిఫిట్స్ చేతికి అందకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు రూ. 15 లక్షల వరకు అప్పుచేశానని, ఇంకా అప్పులు చేసే పరిస్థితి లేదని వాపోతున్నారు. తన బెనిఫిట్స్‌కు సంబంధించిన బిల్స్ మొత్తం జిల్లా ట్రెజరీ ఆఫీస్ ద్వారా ప్రభుత్వానికి సమర్పించానని, బిల్స్ ఈ-కుబేర్‌లో ఉన్నాయని, సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే తనకు బెనిఫిట్స్ అందుతాయని తెలిపారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నానని, తన పరిస్థితి దయనీయంగా ఉన్నదని చెప్తున్నారు. ముఖ్యమంత్రి దయచూపి బెనిఫిట్స్ ఇప్పించాలని వేడుకుంటున్నారు.
కాంగ్రెస్ సర్కారుకు కనికరం, కనీస మానవీయత లేకుండా పోయాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగ విరమణ చేసిన వారికి బెనిఫిట్స్ ఇవ్వకుండా వేధించడం దారుణమని ప్రజలు, ప్రజా, ఉద్యోగ, పెన్షనర్ల సంఘాలు మండిపడుతున్నాయి. రిటైర్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అనారోగ్యంతో దవాఖానపాలైన వారు చేతిలో చిల్లిగవ్వలేక చికితిపోతున్నామని వాపోతున్నారు. దశాబ్దాలపాటు గౌరవంగా ఉద్యోగం చేసి, నేడు కాంగ్రెస్ సర్కారు నిర్వాకంతో అనాథలుగా మారిపోయామని విలపిస్తున్నారు.
బెనిఫిట్స్ కోసం ఎదురుచూస్తున్నామని చెప్తున్నారు. ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి కనికరించాలని వేడుకుంటున్నారు. ఇప్పటికే కొందరు ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేసిన ఉదంతాలు చూశాం. మరికొందరు కోర్టును ఆశ్రయించి, బెనిఫిట్స్ తీసుకోవాల్సి వచ్చిన వారిని చూశాం. ఇప్పుడు చిన్నయ్య దుస్థితి చర్చనీయాంశమైంది. చిన్నయ్య చికిత్స పొందుతున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి.