హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): ప్రపంచ దేశాల్లోని చమురు వనరులు, డాలర్లపై అగ్రరాజ్యాల ఆధిపత్యం, నియంతృత్వాన్ని నిరోధించేందుకు చిన్న దేశాలన్నీ ఏకమవ్వాలని తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిషార కమిషన్ చైర్పర్సన్, హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ జీ రాధారాణి పిలుపునిచ్చారు. సహజ వనరులు ప్రజలవేనని, వాటిపై అగ్రరాజ్యాలకు, ప్రైవేటు కంపెనీలకు పెత్తనం లేదని స్పష్టం చేశారు. ప్రపంచ శాంతికి దేశాల మధ్య సహకారం అత్యవసరమని, ప్రపంచీకరణ నేపథ్యంలో ఒకరి సహకారం లేకుండా ఒంటరిగా ఏ దేశం మనుగడ సాగించలేదని పేర్కొన్నారు. సంక్షోభాలతో సతమతమవుతున్న శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ ఇందుకు నిదర్శనమని చెప్పారు. అన్ని దేశాల మధ్య పరస్పర జ్ఞాన మార్పిడి, వనరుల భాగస్వామ్యం ద్వారానే ప్రపంచం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లగలదని తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని గ్రీన్‌ల్యాండ్స్ టూరిజం ప్లాజాలో జరిగిన భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం (ఇసఫ్) తెలంగాణ రాష్ట్ర రెండవ మహాసభలో జస్టిస్ రాధారాణి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం పేరిట అగ్రరాజ్యాలు తమ ఆర్థిక, రాజకీయ ఆధిపత్యం కోసం ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తున్నాయని విమర్శించారు.
అమెరికా బలగాలు ఇటీవల అడ్డగోలుగా వెనెజులాలోకి చొరబడి బలవంతంగా ఆ దేశ అధ్యక్షుడిని నిర్బంధించి తీసుకెళ్లడం యావత్ ప్రపంచాన్ని షాక్‌కి గురిచేసిందని పేర్కొంటూ.. ప్రస్తుతం ప్రపంచంలోని వివిధ దేశాల్లో జరుగుతున్న అంతర్యుద్ధాలు, రాజకీయ అస్థిరత పట్ల ఆందోళన వ్యక్తంచేశారు. అలీన విధానాన్ని ప్రవేశపెట్టి భారత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలవడంతోపాటు ప్ర పంచ శాంతి కోసం విశేష కృషి చేసిందని, అలీన విధానాన్ని అనుసరించి ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని పలు దేశాలు తమ ఉనికిని చాటుకున్నాయని గుర్తుచేశారు. వివరించారు. అప్పట్లో భారతీయులను చైతన్యపర్చేందుకు ఇసస్ ఎంతో కృషి చేసిందని, ఇప్పుడు ప్రపంచంలో నెలకొన్న ఉద్రిక్తతలను తొలగించి, శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు ఇసఫ్ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో ఇసఫ్ రిసెప్షన్ కమిటీ అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది కడారు ప్రభాకర్‌రావు, నేషనల్ ప్రిసీడియం మెంబర్, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా, ఆర్టీఏ మాజీ జాయింట్ కమిషనర్ సీఎల్ఎన్ గాంధీ, ఇసఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ గోపాల్, ప్రధాన కార్యదర్శి అరుణ్ రాజశేఖర్, న్యాయవాది బొమ్మెర రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.