హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కాజా రత్నకిశోర్ ఆన్లైన్ సైబర్ నేరగాళ్ల చేతిలో రూ.3.37 కోట్లు మోసపోయారు. ఈ వ్యవహారంపై రత్నకిశోర్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే ‘ధని సెక్యూరిటీస్’ పేరుతో దుండగులు మార్చిలో రత్నకిశోర్ను పరిచయం చేసుకున్నారు. మ్యూచువల్ ఫండ్స్, ఐపీవోలు, ఆప్షన్ ట్రేడింగ్‌తో సుమారు 120 నుంచి 160 శాతం వరకు లాభాలు వస్తాయని ఆశ చూపారు. ఇదంతా నమ్మిన రత్నకిశోర్ ట్రేడింగ్‌కు సుముఖత వ్యక్తం చేశారు. పెద్దఎత్తున పెట్టుబడి కింద పెట్టారు. అయితే రత్నకిశోర్కు రూ.25.91 కోట్ల లాభం వచ్చిందని సైబర్ నేరగాళ్లు చూపించారు. ఆ డబ్బులు తీసుకోవాలంటే 10 శాతం ఫీజు (రూ.2.23 కోట్లు) చెల్లించాలని చెప్పారు. మార్చి నుంచి మే వరకు 33 సార్లు జరిపిన లావాదేవీల్లో రూ.3.37 కోట్లు కొల్లగొట్టారు. ఒక్క రూపాయి కూడా తిరిగిరాకపోవడంతో మోసపోయినట్టు గుర్తించి, రత్నకిశోర్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
ఎన్టీపీసీలో సమ్మెపై ఆరు నెలల నిషేధం
హైదరాబాద్, 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఎన్టీపీసీ విద్యుత్తు ప్లాంట్లలో సమ్మెలపై ప్రభుత్వం నిషేధం విధించింది. తెలంగాణ ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్-1971 ప్రకారం ఆరు నెలల పాటు సమ్మెలపై నిషేధాన్ని విధిస్తూ సోమవారం జీవోను జారీచేసింది. జూన్ 14 నుంచి ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని ఇంధనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్‌మిట్టల్ స్పష్టంచేశారు.