శేరిలింగంపల్లి/ కొండాపూర్, డిసెంబర్ 29: రాష్ట్ర మంత్రి కేటీఆర్ మామ, పదవీవిరమణ చేసిన అటవీ శాఖ ఉన్నతాధికారి పాకాల హరినాథరావు (74) గురువారమిక్కడ గుండెపోటుతో మరణించారు. కేటీఆర్ భార్య శైలిమ తండ్రి హరినాథరావు. ఈ నెల 27వ తేదీన అనారోగ్యంతో గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో చేరిన హరినాథరావును వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. రెండు రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన గురువారం మధ్యాహ్నం 1.10 నిమిషాలకు గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. హరినాథరావు భౌతికకాయాన్ని రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్‌లో ఆయన నివాసానికి తరలించారు.
తన వియ్యంకుడు పాకాల హరినాథరావు మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. హరినాథరావు భౌతికకాయాన్ని సీఎం సందర్శించి నివాళులర్పించారు. తండ్రిని పోగొట్టుకున్న దుఃఖంతో ఉన్న కోడలు శైలిమను, శోకతప్తులైన కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి దంపతులు ఓదార్చారు. సీఎం కేసీఆర్ సతీమణి శోభతోపాటు ఎమ్మెల్సీ కవిత, ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్, ఇతర కుటుంబ సభ్యులు తరలివచ్చి హరినాథరావు పార్థివ దేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు మహమూద్ అలీ, ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్‌కుమార్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర,ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, జీవన్‌రెడ్డి, బాల్క సుమన్, పెద్దిరెడ్డి సుదర్శన్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, పద్మాదేవేందర్ రెడ్డి, నగర మేయర్ విజయలక్ష్మి, తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, శేరి సుభాష్‌రెడ్డి, మాజీ మంత్రి వేణుగోపాలాచారి, ఇన్చార్జి డీజీపీ అంజనీకుమార్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, నగర పోలీసు అధికారి ఏఆర్ శ్రీనివాస్‌తోపాటు పలువురు ప్రముఖులు హరినాథరావు భౌతికకాయానికి నివాళులు అర్పించారు. సాయంత్రం రాయదుర్గంలోని మహాప్రస్థానంలో హరినాథరావు పెద్ద కుమారుడు రాజేంద్రప్రసాద్, చిన్న కుమారుడు శైలేంద్రప్రసాద్ తండ్రి పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
పాకాల హరినాథరావు స్వగ్రామం మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలోని దామరచెరువు. ఆయన బంధువులు, మిత్రులు హరినాథరావు మృతివార్త తెలుసుకొని హైదరాబాద్‌కు తరలివచ్చి నివాళులర్పించారు. అటవీశాఖలో పలు హోదాల్లో పనిచేసిన హరినాథరావు 2008లో పదవీవిరమణ చేశారు. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు తనవంతు సహాయం అందించారు. విద్య, వైద్యం తదితరాలకు సంబంధించి గ్రామం నుంచి ఎవ్వరు సహాయం అడిగినా, ఆయన కాదనకుండా చేసేవారని గ్రామస్థులు గుర్తు చేసుకున్నారు. హరినాథరావు మృతితో దామరచెరువులో విషాదఛాయలు అలుముకున్నాయి.