ENC Muralidhar Rao | హైదరాబాద్ : అక్రమ ఆస్తుల కేసులో ఇరిగేషన్ శాఖ మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) మురళీధర్‌రావును ఏసీబీ నిన్న రాత్రి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మురళీధర్ రావును ఏసీబీ కోర్టులో హాజరు పరచగా, ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఆయనను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ఈ కేసులో ఏసీబీ అధికారులు మంగళవారం తెల్లవారుజాము నుంచి ఆయన నివాసంతో పాటు 11 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. అక్రమంగా ఆయన కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కూడబెట్టినట్టు నిర్ధారించారు. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఓ విల్లాతోపాటు బంజారాహిల్స్, యూసుఫ్‌గూడ, బేగంపేట, కోకాపేటలో ఫ్లాట్లు.. కరీంనగర్, హైదరాబాద్‌లో కమర్షియల్ బిల్డింగులు, వరంగల్, కోదాడలో అపార్ట్మెంట్లు, జహీరాబాద్‌లో 2 కిలోవాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు, 11 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లో 4 ఓపెన్ రెసిడెన్షియల్ ప్లాట్లు, మోకిలాలో 6,500 చదరపు గజాల భూమి, ఓ బెంజ్ కారు సహా 3 ఫోర్‌వీలర్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్టు తేల్చారు. మురళీధర్‌రావు తన పదవిని ఉపయోగించుకొని ఈ ఆస్తులను సంపాదించినట్టు ఏసీబీ పేరొన్నది.
వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో సోదాలు
మురళీధర్‌రావు అక్రమ ఆస్తుల కేసు దర్యాప్తులో భాగంగా ఏసీబీ అధికారులు మంగళవారం వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో సోదాలు నిర్వహించారు. హనుమకొండలోని న్యూశాయంపేటలో మురళీధర్‌రావు కుమారుడు అభిషేక్ తన మిత్రులతో కలిసి మూడెకరాల్లో నిర్మిస్తున్న అపార్ట్మెంట్లో వరంగల్ ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.