Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో/బడంగ్‌పేట, జనవరి 22 (నమస్తే తెలంగాణ): అనుమానంతో భార్యను అత్యంత కిరాతకంగా చంపి, ఆమె శరీరభాగాలను దొరకకుండా చేసి చెరువులో పడేసిన అమానుష ఘటన హైదరాబాద్ మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల విచారణలో వెల్లడైన విశ్వసనీయ సమాచారం, స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గురుమూర్తి, వెంకటమాధవి (35) దంపతులు. 13 ఏండ్ల క్రితం వీరి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. గత ఐదేండ్లుగా జిల్లెలగూడలోని వేంకటేశ్వర కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఆర్మీ నుంచి రిటైరైన గురుమూర్తి.. కంచన్‌బాగ్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. గురుమూర్తికి భార్యపై ఉన్న అనుమానం రోజురోజుకూ పెరగసాగింది. దీంతో భార్య, భర్తలిద్దరూ తరుచూ గొడవ పడుతుండేవారు. సంక్రాంతి పండుగకు ముందు కూడా ఇద్దరూ గొడవపడ్డారు.
సంక్రాంతి రోజైన 14న గురుమూర్తి తన ఇద్దరు పిల్లలను బంధువుల ఇంట్లో దింపేసి వచ్చాడు. అదే రాత్రి భార్యతో గొడవకు దిగి ఆమె గొంతుకోసి హత్య చేశాడు. ఆ మరుసటి రోజు భార్య మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కోశాడు. వాటిని కుక్కర్లో ఉడికించి, ఆ తరువాత పొడి చేసి దానిని తీసికెళ్లి జిల్లెలగూడ చెరువులో వేసినట్టు ఒక విషయం ప్రచారం అవుతుండగా, ముక్కలనే చెరువులో పడేశాడని మరో విషయం తెలుస్తున్నది. హతురాలి తలను కాల్చడంతో స్థానికులకు వాసన కూడా వచ్చిందని, అయితే ఆ రోజు పండుగ కావడంతో మేక తలకాయ కావచ్చనే భావనలో ఉన్నారని తెలిసింది. భార్య శరీరాన్ని ముక్కలు చేయడాన్ని స్వయంగా వీడియో తీసినట్టు సమాచారం. ఇదంతా చేయడానికి ముందు ఒక కుక్కను తీసుకొచ్చి దానిని చంపి, కుక్కర్లో ఉడికించి, దాని శీరర భాగాలను కూడా చెరువులో వేసినట్టు పోలీసుల విచారణలో బయటపడిందని తెలిసింది.
బయటకు వచ్చిందిలా!
తన కూతురు ఫోన్ చేయకపోవడంతో వెంకటమాధవి తల్లిదండ్రులు స్వయంగా వచ్చి గురుమూర్తిని ప్రశ్నించారు. కన్పించకుండా పోయిందని, మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేద్దామనుకున్నట్టు వారితో చెప్పాడు. అల్లుడిపై అనుమానంతో తామే వెళ్లి ఫిర్యాదు చేస్తామంటూ వెళ్లిపోయారు. 16న గొడవ జరిగిందని, ఆ తర్వాత నుంచి కన్పించడం లేదంటూ వెంకటమాధవి తల్లి 18న మీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసుగా నమోదైంది. ఈ మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే భర్తపై అనుమానం రావడంతో పోలీసులు అతనిపై ఓ కన్నేశారు. దీంతోపాటు ఇంటి పరిసరాల్లోని సీసీ కెమెరాలను క్షుణ్నంగా పరిశీలించారు. సీసీ కెమెరాలలో ఒక సంచిని ఇంట్లోకి తీసుకెళ్తున్న దృశ్యాలు కన్పించాయి. దీని ఆధారంగా పోలీసులు గురుమూర్తిని విచారించడంతో ఒక్కొక్క విషయం బయటపడిందని సమాచారం.
చట్టానికి దొరకొద్దని..
భార్యను చంపి ఆమె మృతదేహం అనవాళ్లు లేకుండా చేస్తే దొరకకుండా ఉంటానని దుండగుడు మరో పథకం పన్నాడు. దాన్ని అమలు చేసేందుకు దృశ్యం సినిమాను పలుమార్లు చూశానంటూ పోలీస్ విచారణలో వెల్లడించినట్టు సమాచారం. గురుమూర్తి తన భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి, కుక్కర్లో ఉడికించి దానిని చెరువులో పడేశాడని, ఆ ముక్కల కోసం చెరువులో పోలీసులు మూడురోజులుగా గాలిస్తున్నా, ఆనవాళ్లు దొరకలేదని తెలిసింది. ముక్కలు చేసి ఎండబెట్టి పొడిని చేస్తే ఆధారాలు దొరకడం కష్టమని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసుసై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని మీర్పేట్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు.