Samagra Kutumba Survey | హైదరాబాద్, ఫిబ్రవరి12 (నమస్తే తెలంగాణ) : ఇప్పటివరకు సర్వేలో పాల్గొనని వారికి అవకాశం కల్పించేందుకు ఇంటింటి సర్వేను మళ్లీ నిర్వహించనున్నట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 16 నుంచి 28వ తేదీ వరకు వివరాల నమోదుకు అవకాశం ఇస్తున్నట్టు చెప్పారు.
డాక్టర్ బీఆర్ అంబేదర్ సచివాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమగ్ర ఇంటింటి సర్వేపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా 3.1 శాతం మంది వివరాలు నమోదు చేయించుకోలేదని వివరించారు. వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పిస్తున్నదని తెలిపారు. మూడు పద్ధతుల్లో కుటుంబాల వివరాల నమోదుకు అవకాశం కల్పిస్తున్నామని వివరించారు.
టోల్ ఫ్రీనంబర్కు ఫోన్ చేస్తే అధికారులే వచ్చి వివరాలు నమోదు చేసుకుంటారని, మండల కార్యాలయాల్లో ప్రజాపాలన అధికారులు పది రోజులు అందుబాటులో ఉండి వివరాలు నమోదు చేసుకుంటారని, ఆన్లైన్ ద్వారా కూడా కుటుంబ వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు. రాష్ట్రంలో కులగణన విజయవంతమైతే దేశమంతా చేయాల్సి వస్తుందనుకునేవారు రీ సర్వే కోరుతున్నారని, ప్రజాప్రభుత్వంతో రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు, మేధావులు కలిసి రావాలని కోరారు. రాష్ట్రంలో ఓబీసీలకు విద్య, రాజకీయ, ఆర్థిక రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పారు. రీ సర్వే అనంతరం మార్చి మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించి గణాంకాలను ప్రకటించి చర్చిస్తామని తెలిపారు. ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. రాష్ట్ర జనాభాలో ఓబీసీలు 56 శాతంగా ఉంటారని పేర్కొన్నారు.