హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంలో స్థానిక అధికారులపైనే ఆంక్షలు అమలవుతున్నాయి. అడుగు తీసినా.. పెదవి కదిపినా ఎక్కడికక్కడ నిఘా నీడ వెంటాడుతున్నది. నోరెత్తవద్దు.. మీడియాకు ఎలాంటి సమాచారమివ్వవద్దంటూ ప్రత్యక్షంగానే హుకుంలు జారీ అవుతున్నాయి. ఇదీ కాంగ్రెస్ ప్రజాపాలనలో రాష్ట్ర సాగునీటిపారుదలశాఖలో నెలకొన్న దుస్థితి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్స్టెన్షన్లపై దుమ్మెత్తిపోసిన వారే నేడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. సీనియర్లను పక్కనపెడుతూ జూనియర్లకు పట్టం కడుతూ అందలమెక్కిస్తున్నారు. ప్రభుత్వం తీరుపై ఇంజినీర్లు రగిలిపోతున్నారు. ఇప్పటికే పలువురు పరోక్షంగా సహాయ నిరాకరణ చేస్తుండగా, ప్రాజెక్టుల ప్రగతినే కుంటుపడుతున్నది. సర్కార్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు అసోసియేషన్లు సైతం సన్నద్ధమవుతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇరిగేషన్‌శాఖలో అడుగడుగునా ఏపీ స్థానికత చెందిన అధికారులకే పట్టం గడుతున్నది. సర్కార్ చేపడుతున్న నియామకాలు, బాధ్యతల అప్పగింతను చూస్తేనే తెలిసిపోతున్నది. సెక్రటేరియట్లో సెక్రటరీ తరువాత అత్యంత కీలకమైన పోస్టు జాయింట్ సెక్రటరీ (టెక్నికల్). నిబంధనల ప్రకారం ఆ పోస్టులో సీఈని (చీఫ్ ఇంజినీర్) నియమించాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా రెగ్యులర్ ఎస్ఈగా కూడా ప్రమోషన్ పొందని, కనీసం డీపీసీలో సైతం లేని ఏపీ స్థానికతకు చెందిన ఓ ఈఈని నియమించింది. కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ సమర్పించలేదనే సాకుతో తెలంగాణకు చెందిన ఈఈలకు ఎస్ఈలకు ప్రమోషన్లు ఇవ్వలేదు.
వారిస్థానంలో మరో ఐదుగురు ఇంజినీర్లకు ప్రమోషన్లు కల్పించగా, అందులో ముగ్గురు ఏపీ స్థానికత కలిగిన ఇంజినీర్లే కావడం గమనార్హం. వారిలో కే శ్రీనివాస్ ఒకరు. ఈ ప్రమోషన్లపై రివ్యూ కొనసాగుతున్నది. అయినప్పటికీ సదరు శ్రీనివాస్‌కే సెక్రటేరియట్లో కీలకమైన జాయింట్ సెక్రటరీ (టెక్నికల్) బాధ్యతలను అప్పగించింది. సూటిగా చెప్పాలంటే సీఈ హోదా పోస్టులో ఏపీ స్థానికతకు చెందిన ఈఈని నియమించింది. సదరు అధికారే ఈఎన్సీ జనరల్ ఆఫీస్‌లో డిప్యూటీ ఈఎన్సీగా సైతం విధులు నిర్వర్తిస్తున్నారు.
ఇక ఇటీవల ఈఎన్సీ జనరల్‌గా ఉద్యోగ విరమణ పొందిన రమేశ్‌బాబు సైతం ఏపీ స్థానికతకు చెందిన వారే. ఉద్యోగ విరమణ పొందిన రోజునే ఆయన సర్వీసును మరో 6నెలల పాటు పొడిగిస్తూ కాంగ్రెస్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.
ఎస్ఈగా ఉద్యోగ విరమణ పొందిన ఏపీ స్థానికత అధికారి భీమ్ ప్రసాద్‌ను మంత్రి ఉత్తమ్ ఓఎస్డీగా నియమించుకోవడం గమనార్హం.
మరో అత్యంత కీలకమైన పోస్టు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) పోస్టులో ఏపీ స్థానికతకు చెందిన మధుసూదన్‌రావును ఇటీవల ఈఎన్సీగా నియమించింది. ఆయన కీలకమైన కరీంనగర్ ఈఎన్సీగా సైతం అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
సూర్యాపేట సీఈగా సైతం ఏపీ స్థానికతకు చెందిన నాగభూషణరావును కాంగ్రెస్ సర్కార్ నియమించింది.
హైదరాబాద్ సీఈ పరిధిలో అవినీతి అక్రమాల పేరిట ఒకేసారి 106మంది ఇంజినీర్లను కాంగ్రెస్ సర్కార్ బదిలీ చేసింది. అందులో గమ్మత్తేమిటంటే ఆ సీఈ పరిధిలోని తెలంగాణ ఇంజినీర్లను తప్పించి, ఏపీ స్థానికత కలిగిన ఇంజినీర్లను అక్కడ నియమించడం ఇక్కడ గమనార్హం. అవినీతి, అక్రమాలకు, ఎన్వోసీల జారీకి సంబంధం లేని తెలంగాణ అధికారులను సైతం అక్కడి నుంచి అకారణంగా కాంగ్రెస్ సర్కార్ తొలగించింది.
అవే కాదు క్షేత్రస్థాయిలో కీలక పనులు కొనసాగుతున్న చోట సైతం ఏపీ స్థానికత కలిగిన అధికారులకే, సీనియారిటీని పరిగణనలోకి తీసుకోకుండా నియమించడం కాంగ్రెస్ సర్కార్‌లో పరిపాటిగా మారింది. వాస్తవంగా ఈఎన్సీ, సీఈ, ఎస్ఈ, ఈఈ ఇలా ఏ పోస్టు ఖాళీ అయినా కూడా వెంటనే సీనియారిటీ జాబితాలో అక్కడే ఉన్న ఇంజినీరుకు, ఒకవేళ అక్కడ సీనియర్ ఇంజినీర్ లేకుంటే ఆ బాధ్యతలను పక్కనే ఉన్న ఇతర సీఈ, ఎస్ఈ, ఈఈలకు అప్పగించడం ఆనవాయితీ. కానీ కాంగ్రెస్ సర్కార్ ఆ నిబంధనలనూ పూర్తిగా తుంగలో తొక్కింది. అనేక చోట్లా అన్ని క్యాడర్లలో 2005 బ్యాచ్ ఇంజినీర్లను పక్కన పెట్టి 2007, 2008 బ్యాచ్ ఇంజినీర్లకు పగ్గాలు అప్పగిస్తున్నది.
మరోవైపు తెలంగాణ స్థానికత కలిగిన ఇంజినీర్లను మాత్రం కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా పక్కనపెడుతున్నది. కంటితుడుపుగా ఒక్కరోజు ప్రమోషన్లను కల్పిస్తూ ఇంటికి పంపిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్, ఘోష్ కమిషన్ అంటూ హడావుడి చేసింది. ఆయా నివేదికలు వచ్చి ఏడాది దాటుతున్నా ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదీగాక ఆయా నివేదికల్లో తెలంగాణ స్థానికత కలిగిన, అత్యంత సీనియర్ అధికారులందరి పేర్లను చేర్చడం గమనార్హం. అంతేకాదు ప్రాజెక్టుకు ఎలాంటి సంబంధం లేని, పోస్టు ప్రకారం మీటింగ్‌లు ఏర్పాటు చేశారని సాకుతో ఓ ఈఈ పేరును సైతం చేర్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ నివేదికలపై సాకుగా చూపుతూ సీనియర్ ఇంజినీర్లకు ప్రమోషన్లను కల్పించలేదు.
అదే కాంగ్రెస్ ప్రభుత్వం సదరు అధికారులు ఉద్యోగ విరమణ పొందుతున్న రోజునే ప్రమోషన్లు కల్పించడం కొసమెరుపు. ఈఎన్సీ అడ్మిన్‌గా, జనరల్‌గా విధులను నిర్వర్తించిన అనిల్‌కుమార్‌కు దాదాపు 5నెలల పాటు పోస్టింగ్ ఇవ్వలేదు. విరమణ పొందుతున్న రోజున పోస్టింగ్ ఇచ్చి సాగనంపింది. అదేవిధంగా రామగుండం సీఈ సుధాకర్‌రెడ్డికి, హైడ్రాలజీ సీఈగా పనిచేసిన శంకర్‌నాయక్‌కు, ఆదిలాబాద్ సీఈ శ్రీనివాస్‌కు సైతం అదేతరహాలో ఉద్యోగ విరమణకు ముందుగా ప్రమోషన్ కల్పించి ఇంటికి పంపించింది. అంతేకాదు తెలంగాణ స్థానికత కలిగిన మరో సీఈని సైతం కీలకమైన పోస్టు నుంచి తప్పించి అప్రాధాన్యమైన పోస్టుకు బదిలీచేసింది.
ఇలా ఈఎన్సీలు, సీఈలే కాదు ఎస్ఈలు, ఈఈల పోస్టులకు సంబంధించి సైతం తెలంగాణ అధికారులది ఇదే పరిస్థితి కావడం గమనార్హం. నివేదికలను ప్రామాణికంగా తీసుకుంటే అదేవిధమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొందరికి మాత్రం కీలకబాధ్యతలను అప్పగించడంతోపాటు, ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. దానిని బట్టే కేవలం తెలంగాణ సీనియర్ ఇంజినీర్లు కీలకస్థానాల్లో లేకుండా చేయడమే అసలు ఉద్దేశమని తేటతెల్లమవుతున్నది.
ఇరిగేషన్ శాఖలో పరిపాలన, సాంకేతికపరమైన అన్ని నిర్ణయాల్లో ఏపీ అధికారులదే పెత్తనం. దీంతో తెలంగాణకు సంబంధించి ఏ ఒక్క ప్రాజెక్ట్ ముందుకు వెళ్లకుండా శతవిధాలా అడ్డుకుంటున్నారు. సాంకేతిక అంశాలను సాకుగా చూపుతూ ప్రాజెక్టులను నిలువరిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు ముందుకు సాగకపోవడానికి ప్రధాన కారణం సదరు అధికారులేనని తెలుస్తున్నది. అనేక ప్రాజెక్టుల రివైజ్డ్ ఎస్టిమేట్లు ఇప్పటికీ ఆమోదానికి నోచుకోని దుస్థితి. ప్రభుత్వం చిన్నకాళేశ్వరం, రాజీవ్‌భీమా, నారాయణపేట కొడంగల్, ఎస్ఎల్బీసీ తదితర ప్రాజెక్టులను ప్రాధాన్యంగా తీసుకున్నది. ఆ ప్రాజెక్టులు సైతం పురోగతికి నోచుకోలేని పరిస్థితి నెలకొన్నది. సాధారణంగా ప్రాజెక్టులకు సంబంధించి పనులు, ఇతరత్రా నిర్ణయాలపై స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ (ఎస్ఎల్ఎస్సీ) నిర్ణయం తీసుకుంటుంది.
అందులో అన్ని ప్రాజెక్టుల ఈఎన్సీలు, సీఈలు ఉంటారు. ఒకసారి ఎస్ఎల్ఎస్సీ ఆమోదం తెలిపి ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. ఇలా ఎస్ఎల్ఎస్సీ సిఫార్సు చేసిన ప్రాజెక్టుల ఫైల్స్‌పై సైతం కీలకస్థానాల్లోని ఏపీ అధికారులు కొర్రీలు వేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రాజెక్టులే కాదు ప్రభుత్వం, టెరిటోరియల్ వారీగా సీఈలు తీసుకునే ప్రతి అంశంపై ఒకదాని తరువాత ఒకటి ఏదో విధమైన పేచీలు పెడుతూ మూలకు నెడుతున్నారని ఇంజినీర్లు వాపోతున్నారు. గడిచిన 28నెలలుగా ఏ ఒక్క ప్రాజెక్టు సైతం ముందుకు పడకపోవడం సైతం ఇంజినీర్ల వాదనలకు బలం చేకూర్చుతున్నది.
అంతేకాదు ఈ ఏడాది ఏపీ సర్కార్ కృష్ణాజలాలను పోతిరెడ్డిపాడు నుంచి యథేచ్ఛగా మళ్లించింది. కేఆర్ఎంబీ సైతం ఇప్పటికీ 2025-26 నీటిసంవత్సరానికి సంబంధించి నీటివినియోగాలపై త్రీమెంబర్ కమిటీ సమావేశాన్నీ ఏర్పాటు చేయలేదు. కీలకస్థానాల్లో ఉన్న ఏపీ స్థానికత కలిగిన అధికారులు ఆ దిశగా ఒత్తిడి తీసుకువచ్చిందీ లేదు. ఏపీ సర్కార్ చేపట్టిన పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించిన కేంద్రం నుంచి వచ్చే, రివర్ బోర్డుల నుంచి తెలంగాణకు వచ్చే కీలకమైన లేఖలు, సమాచారాన్ని ఇప్పటికీ బయటకు పొక్కకుండా సదరు అధికారులే కీలకపాత్ర పోషిస్తున్నారని గతంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.
ఇరిగేషన్‌శాఖలో ఎట్టిపరిస్థితుల్లోనూ ఎక్స్టెన్షన్లను ఇవ్వబోమని స్వయంగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే ఆ మాటను తుంగలో తొక్కుతూ ఎక్స్టెన్షన్లను ఇస్తున్నారని ఇంజినీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాగునీటిశాఖకు అమాత్యుడు ఉన్నా లేన్నట్లే అన్నచందంగా పరిస్థితి మారిందని ఇంజినీర్లు వాపోతున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులు, సమస్యలు, ప్రమోషన్ల అంశాన్ని ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండాపోయిందని, విన్నపాలు బుట్టదాఖలవుతున్నాయని చెబుతున్నారు. ఎక్స్టెన్షన్లను రద్దు చేయాలనే నినాదంతో సర్కార్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సంఘాలు సైతం సిద్ధమవుతున్నాయి.
ఇదిలా ఉంటే తెలంగాణ ఇంజినీర్లపై నిఘా కొనసాగుతున్నది. ఎవరితో మాట్లాడవద్దు..? సమాచారం ఇవ్వవద్దు అంటూ హుకుం జారీ చేసింది. మీడియాకు సమాచారం ఎవరిస్తున్నారు? లేఖలు, ప్రభుత్వ పర అంశాలను ఎవరు లీకు చేస్తున్నారు? అంటూ కొందరిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతుండగా, మరికొందరిపై పార్టీ ముద్ర వేస్తూ ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఇంజినీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇలాంటి దుస్థితిని ఎన్నడూ చూడలేదని వాపోతున్నారు.